జీవితంలో తనకూ ఎన్నో అగ్ని పరీక్షలు ఎదురైనట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకావిష్కరణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ వీడియో సందేశం పంపారు. అందులో ఏముందంటే…
‘ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటి పెద్ద మనిషికీ నీలాపనిందలు తప్పలేదు. తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి, రెండేళ్లు సాగిన విచారణ గురించి, ఓర్పుగా ఉంటూ అగ్నిపరీక్షలో పునీతమైన సీతలాగా బయటపడిన వైనాన్ని ఆత్మ కథలో ఒకింత బాధతో ఏకరువు పెట్టారు. నాకూ ఇలాంటి పరీక్షలు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. ఆయన అనుభవించిన క్షోభను అర్థం చేసుకోగలను. సత్యం గెలిచి తీరుతుంది’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
వివిధ సందర్భాల్లో జస్టిస్ ఎన్వీ రమణపై రాజకీయంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే ఎన్వీ రమణ నర్మగర్భ వ్యాఖ్యలు చేసి వుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు.
నోరి దత్తాత్రేయుడి సేవలను మన ప్రభుత్వాలు ఉపయోగించుకోడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఇదిలా వుండగా ఒడిసా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎన్వీ రమణ న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సామాజిక వాస్తవికతలు, వాటి పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ ప్రక్రియను ప్రజలకు సన్నిహితంగా తీసుకురానంత కాలం మన న్యాయవ్యవస్థ విజయవంతం కాలేదని ఆయన తేల్చి చెప్పారు.