పవన్ కళ్యాణ్ – మహా నటుడు

నిద్రపోయేవాడిని లేపగలం..నిద్రపోయినట్లు నటించేవాడిని లేపలేం అన్నది పెద్ద‌ల‌ మాట. ఈ బాపతు జనాలనే మహానటులు అని అనేయచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి మహానటుడు. Advertisement తన తప్పులు కూడా ఇతరుల తప్పులుగా…

నిద్రపోయేవాడిని లేపగలం..నిద్రపోయినట్లు నటించేవాడిని లేపలేం అన్నది పెద్ద‌ల‌ మాట. ఈ బాపతు జనాలనే మహానటులు అని అనేయచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి మహానటుడు.

తన తప్పులు కూడా ఇతరుల తప్పులుగా మార్చడం అంటే ఎంత టాలెంట్ వుండాలి. దానికి ఎంత చాకచక్యం కావాలి. నటన కనబర్చాలి. పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో కన్నా సినిమాల విషయంలో మంచి నటన కనబరుస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ తన నటనా వైదుష్యం తొలిసారి ఎక్కడ ప్రదర్శించారు అంటే సినిమాలు మళ్లీ మొదలు పెడుతున్నా అని చెప్పినపుడు. ప్రజల కోసం తను సినిమాలు త్యాగం చేస్తున్నా అని చెప్పింది ఆయనే. అప్పటికి ఆయన ఆలోచన వేరు. 2019లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు. 2014 నుంచి 2019 వరకు సినిమాలు లేకుండానే తాను కాలక్షేపం చేసేసారు. మళ్లీ అదే విధంగా చేసేయచ్చు అని అనుకుని వుంటారు. కానీ అక్కడ తేడా కొట్టింది. జగన్ అధికారంలోకి వచ్చారు.

దాంతో మళ్లీ తాను తన సినిమాలు అంటూ రెడీ అయిపోయారు. అది ఆయన ఇష్టం. తప్పులేదు. కానీ ఇలా మాట మార్చిన తరువాత తన నటన ప్రదర్శించడం మొదలు పెట్టారు. తనకు చానెళ్లు లేవు. సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. నటన వల్లే డబ్బులు సంపాదించుకోవాలి అని టముకేయడం ప్రారంభించారు. అసలు సినిమాలు వద్దని ఎవరన్నా అన్నారా? ఆపేయాలని ఎవరైనా అన్నారా? ఆయనే తుమ్ముకోవడం, ఆయనే చిరంజీవ అనడం. మహానటన కాకుంటే మరేంటీ?

సరే వకీల్ సాబ్ అనే సినిమా ప్లాన్ చేసారు. అప్పటికే హరిహర వీరమల్లు అనే సినిమా ప్లానింగ్ లో వుంది. ఎఎమ్ రత్నం అనే నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయడం అన్నది ఏళ్ల తరబడి బకాయిగా వుంది. అంతన్నా దాదాపు 45 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మైత్రీ మూవీస్ అనే సంస్థకు సినిమా చేయడం అన్నది కూడా బకాయి వుందని వార్తలు వున్నాయి. ఇవి పక్కన పెట్టి ఫ్రెష్ గా రెమ్యూనరేషన్ వచ్చే సినిమా అందుకున్నారు. సరే, అది కూడా ఆయన ఇష్టం. కానీ ఎక్కడకు వెళ్లినా తాను సినిమాలు చేసుకోవద్దా..తనకు వేరే వ్యాపారాలు వున్నాయా అనే పాట మాత్రం ఆపలేదు. మహా నటుడు కదా.

సరే వకీల్ సాబ్ పూర్తయింది. అప్పుడయినా మైత్రీ సినిమా, హరిహర వీరమల్లు సినిమా కేసి చూస్తారా అంటే భీమ్లా నాయక్ అనే కొత్త సినిమా మొదలు పెట్టారు. అది పూర్తి చేసారు. ఇక అప్పుడు తప్పలేదు. కానీ అప్పుడు కూడా వేరే రీమేక్ కు జెండా ఊపారు. ఎక్కడ తనది తప్పు అంటారో అని కథ ఇలా వుంది..సెట్ లు అలా వున్నాయి. పాటలు అన్నెందుకు, ఫైట్లు అవసరమా? ఇలాంకి కొర్రీ లు వేయడం ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఇదంతా హరి హర వీరమల్లు కోసం. మరి మైత్రీ సంగతేమింటి? సింపుల్..ఎలా చెప్పినా కథ నచ్చలేదు. సరైన కథ తెస్తే చేయకుండా వుంటానా? ఇది కదా మహా నటన అంటే.

ఈ లోగా మరో సినిమా రీమేక్ కు కూడా జెండా ఊపుతున్నారని తెలిసి, అదే రీమేక్ తామే చేస్తాం కదా అని మైత్రీ వాళ్లు వెళ్లారని వార్తలు. దాంతో పంచ్ ఫలక్ నుమా దాస్ కే పంచ్ పడినట్లు అయింది. సరే అలాగే అని చెబుతూనే వేరే బ్యానర్ లో కథకు గ్రీన్ సిగ్నల్.

ఇవన్నీ ఇలా వుండగానే హరిహర వీరమల్లు డైరక్ట‌ర్ మీద చిర్రుబుర్రులు. ఇంకెన్నాళ్లు తీస్తారు. నేను వేరే సినిమా మీదకు ఎప్పుడు వెళ్తాను అంటూ. అక్కడికేదో పవన్ సదా ఆ సినిమా మీదే వున్నట్లు, తప్పంతా దర్శకుడిదే అయినట్లు కలరింగ్ కాక ఇంకేంటీ? గమ్మత్తేమిటంటే సినిమా జనాలకు అంతా తెలుసు. ఏం జరుగుతోందో. కానీ ఏం చేయగలరు..హీరో కాబట్టి మాట్లాడేందుకు లేదు.

హరిహర వీరమల్లు అలా వుంది. మైత్రీ మూవీస్ అడ్వాన్స్, డివివి దానయ్య-సుజిత్ సినిమా, విశ్వప్రసాద్-సముద్రఖని సినిమా ఈ మూడూ చేయాలి. మధ్య మధ్యలో ఆంధ్ర వెళ్లి రాజకీయం చేస్తూ వుండాలి. మరోపక్క 2024 ఎన్నికలు మంచుకు వస్తున్నాయి. ఆ టైమ్ లో మళ్లీ సినిమాలు త్యాగం అంటారో లేక నాకు చానెళ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు సినిమాలు చేయవద్దా అంటారో.

పాపం నిర్మాతలు మాత్రం కోట్లకు కోట్లు వడ్డీలకు అప్పులు తెచ్చి పవన్ చేతిలో పోసి, ఆయన దగ్గరే చేతులు కట్టుకుని నిల్చుంటారు. ఈయన వారి ముందు మహానటన ప్రదర్శిస్తూ వుంటారు.

-వెంకట్