సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ స్పీచ్

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మీద రకరకాల కథనాలు ప్రసారం చేసిన చానెళ్లకు హీరో పవన్ కళ్యాణ్ చురకలు వేసారు. ఓ మనిషి ప్రమాదానికి గురయితే జాలి చూపించాల్సింది పోయి, ఏ స్పీడ్ లో…

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మీద రకరకాల కథనాలు ప్రసారం చేసిన చానెళ్లకు హీరో పవన్ కళ్యాణ్ చురకలు వేసారు. ఓ మనిషి ప్రమాదానికి గురయితే జాలి చూపించాల్సింది పోయి, ఏ స్పీడ్ లో వెళ్లాడు, ర్యాష్ డ్రయివింగ్ నా ఇలా రకరకాల కథనాలు చేయడం సరికాదు. రేపు మీకు కూడా ఈ పరిస్థితి రావచ్చు అని గుర్తు వుంచుకొండి అంటూ పవన్ చురకలు అంటించారు.

అంతే కాదు ఏ తరహా స్టోరీలు వేయాలో పవన్ ఐడియాలు ఇచ్చారు. తేజు నలభై కిలోమీటర్ల స్పీడ్ మీద కాదు వైఎస్ వివేకా హత్య మీద కథనాలు వేయండి. జగన్ మీద జరిగిన కోడికత్తి వ్యవహారం మీద కథనాలు చేయండి. గిరిజనుల భూముల ఆక్రమణల మీద, చిన్నారి చరిత ఉదంతం మీద కథనాలు వేయండి.

ఇంకా స్పైసీ కథనం కావాలంటే వైసీపీ వాళ్లు ఆ మధ్య వ్యభిచారం చట్టబద్దం చేయడానికి మద్దతు పలికారు దాని మీద స్టోరీ వేయండి. టీడీపీ అధికారంలో వుండగా కాపు రిజర్వేషన్ల మీద పోరాడి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు నలిగిపోతున్నారు. వాటిమీద కథనాలు నడపండి. 

ఇడుపులపాయలో నేలమాళిగల్లో కట్టలకు కట్టలు డబ్బులు వున్నాయి అని పోలీసులు చెబుతుంటారు. నిజమెంతో తెలియదు. దీని మీద కథనాలు రాయరు. రాస్తే ఇంటికొస్తే కొడతారని భయం. ఇన్ని సమస్యలు వున్నాయి. కేవలం సినిమా వాళ్లు సాఫ్ట్ టార్గెట్ అంటూ పవన్ చురకలు వేసారు. 

మాకు పది కోట్లు ఇస్తే అందులో నాలుగున్నర కోట్లు పన్నులు కడతామని, కష్టపడితే రెమ్యూనిరేషన్ వస్తుంది కానీ ఉట్టినే కాదని, ప్రభాస్, రానాల్లా కండలు పెంచితే, ఎన్టీఆర్ లా డ్యాన్స్ లు చేస్తే, చరణ్ లా స్వారీలు చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయని అన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో, మరెందుకో థియేటర్లపై కక్షసాధిస్తే జనాలు తిరగబడే ప్రమాదం వుందని అన్యాపదేశంగా పవన్ చెప్పారు.