అమెరికా గ్రీన్ కార్డ్ కావాలంటే 195 ఏళ్లు ఆగాలా?

ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నా ప్రస్తుతానికైతే వాస్తవమే. గ్రీన్ కార్డ్ రావడానికి 195 ఏళ్లు పట్టడమేమిటి? అన్నేళ్లు పట్టేటట్టైతే అసలా దేశానికి వెళ్లి స్థిరపడే ఆలోచన చేయడమెందుకు? జీవితంలో కాని పనికి వెంపర్లాడడమెందుకు? ఇలాంటి…

ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నా ప్రస్తుతానికైతే వాస్తవమే. గ్రీన్ కార్డ్ రావడానికి 195 ఏళ్లు పట్టడమేమిటి? అన్నేళ్లు పట్టేటట్టైతే అసలా దేశానికి వెళ్లి స్థిరపడే ఆలోచన చేయడమెందుకు? జీవితంలో కాని పనికి వెంపర్లాడడమెందుకు? ఇలాంటి ప్రశ్నలు సగటు భారతీయుడికి వస్తున్నాయి. 

కానీ ఇదంతా ప్రస్తుతానికి మాత్రమే వాస్తవం. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎప్పుడు మారడానికి అవకాశముంది? 

అదలా ఉంచి ఇంతకీ అమెరికాలో ఆర్ధికమాంద్యం వల్లా ఎంతమందికి ఉద్యోగాలు పోతున్నాయి? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? ఇదే ఇక్కడ చెప్పుకునే అంశం. 

అమెరికాని ఆర్ధిక మాద్యం కుదిపేస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొతున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీల పైన ప్రభావం ఎక్కువగా ఉంది. 10 ఏళ్లుగా అమెరికాలో పని చేస్తూ గ్రీన్ కార్డ్ పొందడానికి దగ్గరగా ఉంటూ సడెన్ గా ఉద్యోగం పోతే ఎలా ఉంటుంది? హెచ్ 1 బి విసా మీద ఉన్నవారికి ఉద్యోగం పోతే గరిష్టంగా రెండు నెలల లోపు మరొక ఉద్యోగం సంపాదించాలి. మామూలు సందర్భాల్లో అయితే అది మరీ అంత కష్టమైన పని కాదు. కానీ వేల ఉద్యోగాలు ఒకేసారి పోతుంటే మరొక ఉద్యోగం 2 నెలల్లో దొరకడం ఎంత కష్టం? కష్టం కూడా కాదు, అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్స్  కూడా చాలా పెద్ద కంపెనీలే ఆపేసాయి, ఆపేస్తున్నాయి. 

ఈ పరిస్థితి కోవిడ్ వేవ్ ని తలపిస్తోంది. మామూలుగా ఒక పేషెంట్ కి ఊపిరాడకపోతుంటే ఆక్సీజన్ సిలెండర్ దొరకడం కష్టం కాదు. కానీ లక్షల మందికి ఒకేసారికి ఆ పరిస్థితి వస్తే ఆక్సీజన్ సిలిండెర్ల కొరత ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు హెచ్ 1బి మీద ఉండి ఉద్యోగాలు పోయిన వాళ్లకి పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడే ఇల్లు కొనుక్కుని, పిల్లల్ని చదివించుకుంటూ ఉన్న 35-40 ఏళ్ల వయసున్న దంపతులు కూడా ఇంకా హెచ్ 1 మీదే ఉంటున్నవారు బోలేడంత మంది ఉన్నారు. వాళ్లు ఇప్పటికిప్పుడు ఇండియా వెళిపోయి కొత్త జీవితం వెతుక్కోవాలా? లాంగ్వేజ్ అండ్ కల్చర్ షాక్ కి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఇండియాలో ఎలా సెట్టవుతారు? అమెరికాలోని లివింగ్ స్టాండర్డ్స్ ని ఇండియాలో కొనసాగించేంత జీతాలిచ్చే ఉద్యోగాలు ఇండియాలో ఉన్నాయా? ఇటువంటి టెన్షన్స్ వేధిస్తున్నాయి అమెరికాలోని హెచ్ 1 వీసా మీదున్న ఇండియన్స్ ని. 

హెచ్ 1బి మీద ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రోసెస్ లో ఉండి ఉద్యోగం పోయిన వాళ్లు 2 నెలల్లో మరొక ఉద్యోగం సంపాదించలేక బిచాణా ఎత్తేసి ఇండియా వెళ్లిపోతే ఇక అంతే సంగతులు. మళ్లీ వెనక్కి రావడం, గ్రీన్ కార్డ్ ప్రోసెస్ వగైరాలు మళ్లీ మొదలుపెట్టడమనేవి ప్రాక్టికల్ గా కరెక్ట్ అనిపించుకోవు. ఒకవేళ వాళ్ల పిల్లలు అమెరికా సిటిజెన్స్ అయితే వాళ్లకి 18 ఏళ్లు వచ్చే దాకా ఆగి, వారు ఎదిగి అమెరికా వెళ్లి స్థిరపడ్డాక వీళ్లు కూడా వాళ్ల నీడలో సిటిజెన్ షిప్ పొంది అక్కడకు షిఫ్టవ్వాలి. లేదా అమెరికా జీవనానికి శాశ్వతంగా స్వస్తి పలికేయాలి. 

ఇక ఇంతకీ 2020, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసిన భారతీయ హెచ్ 1 వీసాదారులు కనీసం 195 ఏళ్లు వేచి చూడాలన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అదే చైనావారికైతే కేవలం 18 ఏళ్ళే పడుతుందని, ఇతర దేశస్థులకైతే ఏడాది పట్టొచ్చని తాజాగా ఒక బులెటిన్ విడులయ్యింది. ఎందుకంటే ప్రతిదేశానికి ఏడాదికిన్ని గ్రీన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక కోటా ఉంటుంది. భారతీయులకి ఏటా సుమారు 10000 గ్రీంకార్డులిస్తే క్యూలో ఉంటున్నవారు లక్షల్లో ఉన్నారు. 

ఇదొక్కటే కాదు. సాధారణ టూరిస్ట్ వీసా పొందాలన్నా 2-3 ఏళ్లు ఆగాల్సి వస్తోంది ఇండియన్స్ కి. అదే చైనాకైతే 10 రోజులు, ఇతర దేశాలకైతే ఇంకా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఇండియన్స్ కి గ్రీన్ కార్డ్ రావడానికి గరిష్టంగా 10-15 ఏళ్లు పట్టడం అందరూ చూసారు, చూస్తున్నారు. కానీ 195 ఏళ్ల వ్యవహారం ఏంటి మరీ వింతగా? దీని వెనుక ఒక చిన్న రివెంజ్ స్టోరీ ఉంది. 

అదేంటంటే…అమెరికా శక్తికి ఎదురునిలవడం కానీ, అమెరికన్ డాలర్ ని ఢీకొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్న దేశాలు కానీ అమెరికాకి నచ్చవు. అప్పట్లో గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఒకటే కరెన్సీ పెట్టుకుని ఆయిల్ వ్యాపారంతో ప్రపంచాన్ని శాసించాలనుకున్నాయి. ఒకరకంగా అది డాలరుతో యుద్ధం ప్రకటించడమే. క్రమంగా ఇరాక్ లో మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ ఉన్నాయంటూ గల్ఫ్ వార్ కి తెరలేపి అస్థవ్యస్థం చేసి డాలర్ ని కాపడుకుంది అమెరికా. అదీ అమెరికా ఆర్ధికనీతి. 

ఈ మధ్య ఇండియా తన రూపీని బలోపేతం చెసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రష్యాతో చేతులు కలపడం, రష్యా నుంచి పెట్రోలుని డాలర్స్ లో కాకుండా రూపీతో కొనే ప్రయత్నాలు చేయడం అమెరికాకి మింగుడుపడలేదు. పైగా చిన్న దేశాలతో రూపీ త్రేడ్ ని కూడా మొదలుపెట్టింది. 

అసలే ప్రపంచంలో అధిక జనాభాగల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ప్రపంచవిపణిలో ఇండియన్ రూపీకి యాక్సెప్టెన్స్ వస్తే దాని విలువ క్రమంగా పెరిగిపోతుంది. అదే కొనసాగితే డాలర్ కి చాలా చోట్ల ఇండియన్ రూపీ ప్రత్యామ్నాయమవుతుంది. ఇదే పద్ధతి ఇతర దేశాల కరెన్సీలు కూడా అవలంబిస్తే డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. అమెరికా ఊపిరి తన డాలర్లోనే ఉంది. కనుక డాలరుకి భంగం కలిగించే పని ఏ దేశం చేసినా ఉపేక్షించదు. అందుకే భారతీయుల్ని డిస్కరేజ్ చేయడానికి, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఇండియన్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ని బ్యాక్ లాగులో పెట్టేసి ఒక ఇండైరెక్ట్ హెచ్చరిక జారీ చేసింది అమెరికా. 

భారతదేశం ఎగుమతి చేసే ఏకైక అతి పెద్ద అంశం ఏదైనా ఉందా అంటే అవి మానవవనరులు. అదికూడా అమెరికాకే ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. ఫలితంగా ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒకరో ఇద్దరో అమెరికాలో స్థిరపడి వారి సంపాదనలో కొంత భాగంతో ఇండియాలో రియల్ ఎస్టేట్ కి తోడ్పడుతున్నారు, వారి కుటుంబ సభ్యుల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. 

అమెరికాలో ఉద్యోగం సంపాదించిన ఒక యువకుడు ఆర్నెల్లు తిరగకుండా ఇండియాలో ఉన్న తన మధ్యతరగతి తల్లిదండ్రులకి డౌన్ పేమెంట్ చేసి కారు కొని పెడుతున్నాడు, మూడేళ్లాగితే ఇల్లు కొనిపెడుతున్నాడు. ఇలా డాలర్స్ ని ఇండియాలో పోస్తున్న ఎన్నారైలు ఎందరో ఉన్నారు. 

ఎవరు అమెరికాలో అడుగుపెట్టినా అధికశాతం మంది యొక్క అంతిమలక్ష్యం గ్రీన్ కార్డ్ సంపాదించడం. దాని మీద నీళ్లు జల్లేస్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల ఇండియాకి డాలర్ల ప్రవాహం కూడా సన్నగిల్లుతుంది. 

కనుక భారతదేశం తన విధానాలను అమెరికన్ డాలర్ ని భయపెట్టకుండా ఉన్నప్పుడు ఈ 195 ఏళ్ల గడువు కాస్తా ఏ 15 ఏళ్లకో కుదించబడుతుంది. అప్పటివరకు ఇంతే. 

తల్లావజ్ఝల సుందరరామశర్మ (క్యాలిఫోర్నియా)