ఇది చదివే ముందు మీరు ‘‘దుల్ఖర్ సినిమా కథ ఇదేనా?’’ చదవాలి. దానికి యిది రెండో భాగం.
కడుతున్న యిల్లు పూర్తి చేయడానికి, పెట్టబోయే వ్యాపారానికి పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఏ విధంగా డబ్బు సంపాదించాలా అని సుకుమార్ ఆలోచిస్తూంటే జర్మనీలో జరిగిన ఇన్సూరెన్సు ఫ్రాడ్ గురించి లోకల్ పేపర్లో కనబడింది. ఒకతను తన పేర భారీగా ఇన్సూర్ చేసి, ఒక దిక్కుమాలిన శవాన్ని పోలికల బట్టి తన శవంగా భ్రమింపచేసి, ఇన్సూరెన్సు సొమ్ము కాజేశాడు. వేరే పేరుతో వేరే దేశంలో బతికాడు. దానిలో ఏదో పొరబాటు జరిగి కథ బయటకు వచ్చింది. తనైతే అలాటి పొరబాటు చేయనని సుకుమార్‌కు ధైర్యం. ఎందుకంటే గోపాలకృష్ణ పిళ్లయిగా తను చచ్చిపోయినట్లు చెకింగ్‌కు వచ్చిన స్పెషల్ బ్రాంచ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌కు లంచం యిచ్చి మేనేజ్ చేశాడు. సుకుమార్ కురుప్ పేర పాస్‌పోర్టు సంపాదించి, యిప్పుడా పేరుతోనే చలామణీ అవుతున్నాడు. అలాటి ప్రయోగమే మళ్లీ ఒకసారి చేసి, అబూ ధాబి నుంచి పారిపోయి ఇండియాలో దాక్కుంటే సరి.
తన ఐడియాను సాహూతో చెప్పాడు. అంతా విని సాహూ అదంత పెద్ద కష్టం కాదు. ఏదైనా మార్చురీలో నీ ఒడ్డూపొడుగూ వున్న అనాథ శవం దొరక్కపోదు. దాన్ని కొట్టేస్తే సరి అన్నాడు. మరీ అంతగా దొరక్కపోతే సమాధులు తవ్వవచ్చు. మన కేరళలో క్రైస్తవ, ముస్లిము శ్మశానాలు కొల్లలుగా వున్నాయి అన్నాడు. ఈ పనిలో సాయపడినందుకు నాకు కాస్త డబ్బివ్వాలి. ఇంట్లో ముగ్గురు అక్కలున్నారు, వాళ్ల పెళ్లిళ్లు చేయాలి అన్నాడు. సుకుమార్ ఓకే అన్నాడు. భాస్కరన్‌కు ఫోన్ చేసి ప్లాను చెప్పారు. నువ్వేం చెప్పినా చేయడానికి రెడీ అన్నాడు భాస్కరన్. మా బంధువొకడు అలప్పుళ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. వాడి ద్వారా శవాన్ని సంపాదించడం కష్టమేమీ కాదు అన్నాడు. డ్రైవర్‌గా పెట్టుకున్న పొణ్నప్పన్ విశ్వాసపాత్రుడని, అతని వలన ఏ గొడవా రాదని భరోసా యిచ్చాడు. శవంతో బాటు కారు కూడా తగలబెట్టాలిగా, కొత్త కారెందుకు తగలెయ్యడం, పాతదేదైనా కొను అంటే 8 వేలు పెట్టి ఓ పాత అంబాసిడర్ కొన్నాడు.
సుకుమార్ 3 లక్షల దిర్హామ్‌లతో (సుమారు రూ. 30 లక్షలు) ఒక యిన్సూరెన్సు పాలసీ తీసుకున్నాడు. అతను, సాహూ లీవు పెట్టి జనవరి మొదటివారంలో త్రివేండ్రం వచ్చి భాస్కరన్ యింట్లోనే వుంటూ అళప్పుళతో మొదలుపెట్టి హాస్పటల్ మార్చురీలు వెతక నారంభించారు. కానీ అది అనుకున్నంత సులభంగా లేదు. ఇక సమాధులు వెతక నారంభించారు. ఇక్కడా అదే యిబ్బంది. శవం తాజాగా వుండాలి. ఒడ్డూ, పొడుగూ, వయసులలో సుకుమార్‌తో పోలిక కుదరాలి. రెండు వారాలు పోయేసరికి అందరికీ విసుగు వచ్చేసింది. అప్పుడు సుకుమార్ ఓ సారి అలవోకగా ‘‘శవం దొరక్కపోతే బతికున్నవాణ్నే శవంగా మారిస్తే సరి.’’ అన్నాడు. అంతా ఉలిక్కిపడ్డారు. ‘‘అవును, రోడ్ల మీద తిరుగుతూ నా పోలికలున్న వాడు ఒంటరిగా దొరకగానే లటుక్కున కార్లో ఎత్తుకువచ్చేసి, గొంతు నులిమి చంపేసి, మనం అనుకున్న చోట తగలబెట్టేస్తే సరి.’’ అన్నాడు. తక్కినవారందరూ ఆలోచనలో పడ్డారు. బయటపడితే కష్టం కదా అనుకున్నారు.
అప్పుడు భాస్కరన్ చెప్పాడు – ‘ఎవరైనా సడన్‌గా మాయమైతే ఏమనుకుంటారు? ఊరు వెళ్లాడేమో, లేదా కిడ్నాప్ అయ్యాడేమో అనుకుంటారు. శవం దొరికితే హత్యో, ఆత్మహత్యో అనుకుంటారు. హత్య అయితే అది చేయాల్సిన అవసరం, చేసే అవకాశం ఎవరికి వుంది అనే కోణంలో పరిశోధిస్తారు. ఈ అజ్ఞాతవ్యక్తి విషయంలో మోటివ్ ఎవడూ వూహించలేడు. అసలింతకీ శవం దొరికితే కదా, హత్య అనుకోవడానికి. దొరికిన శవం సుకుమార్దైనప్పుడు యిక ఆ మిస్సింగ్ వ్యక్తికి యీ శవానికి లింకెలా పెడతారు?’ ఈ లాజిక్‌తో అందరూ కన్విన్సయ్యారు. సుకుమార్ పోలికలున్న వ్యక్తి కోసం రాత్రి పూట కారేసుకుని వెతకసాగారు. కొత్తకారులో భాస్కరన్, సాహూ, డ్రైవర్‌గా పొణ్నప్పన్. వెనుక పాతకారులో సుకుమార్ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రావడం.
1984 జనవరి 21 రాత్రి 11 గంటల ప్రాంతంలో నేషనల్ హైవే 47 (ఎన్ఎచ్ 47) మీద వున్న కరువాట్ట అనే ఊరిలో కల్పకావడి హోటల్లో కూర్చుని డిన్నర్ చేస్తూ, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నారు. (ఈ కథాంశంతో 1984లో వచ్చిన సినిమాకు ఎన్ఎచ్ 47 అని పేరు పెట్టారు) భోజనం అయ్యాక ఓచిరా వరకు ఓ 25 కి.మీ.లు డ్రైవ్ చేసుకుంటూ, రోడ్డు మీద అటూయిటూ చూసుకుంటూ వెళ్లారు. తారసిల్లిన ఎవరిలోనూ సుకుమార్ పోలికలు కనబడలేదు. తిరిగి వస్తూంటే అర్ధరాత్రి సమయానికి హరిపాద్ దగ్గర హరి టాకీస్ ఎదురుగా లిఫ్ట్ అడుగుతున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. పోలికలున్నట్లు తోచింది. తమకు పనికి వస్తాడా రాడా తేల్చుకోవడానికి ఓ రెండు రౌండ్లు అటూయిటూ కొట్టారు. సుకుమార్ కూడా సరేనన్న తర్వాత అతని దగ్గర కారాపారు.
అతను కారెక్కాడు. ఈథర్ కలిపిన బ్రాందీని బలవంతంగా తాగించారు. అతనికి స్పృహ తప్పగానే భాస్కరన్, సాహూ కలిసి తువ్వాలుతో అతని ప్రాణాలు తీశారు. తర్వాత భాస్కరన్ యింటికి తీసుకెళ్లి, వాచీ, ఉంగరం తీసేసి, అతని బట్టలు మార్చేసి కురుప్ బట్టలు తొడిగి మొఖమంతా కాల్చేశారు. ఆ తర్వాత పాతకారు డిక్కీలో ఆ శవాన్ని కుక్కి, కొత్తకారుతో సహా తన్నిముక్కం ఊరిలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక పాతకారు డ్రైవింగు సీటులో శవాన్ని అమర్చి, పది లీటర్ల పెట్రోలుతో కారుని పూర్తిగా తడిపి పొలంలోకి తోశారు. భాస్కరన్ అగ్గిపుల్ల ముట్టించి కారు మీద పడేశాడు. కారు ఒక్కసారిగా భగ్గుమంది. మంటలు అక్కడితో ఆగకుండా భాస్కరన్ చేతిని కూడా చుట్టుముట్టాయి. దాంతో నలుగురూ భయపడిపోయారు. పక్క పొలంలోకి దూకారు. మంటల్ని అదుపులో పెట్టబోయారు కానీ వాళ్లకు సాధ్యం కాలేదు. హడావుడిగా అక్కణ్నుంచి పారిపోయి కొత్తకారులో భాస్కరన్ యింటికి వచ్చిపడ్డారు. ఈ గలభాలో చెప్పులు, అగ్గిపెట్టి అక్కడే వదిలేశారు.
పని అయిపోయింది కాబట్టి సాహూ తన వూరు వెళ్లిపోయాడు. పొణ్నప్పన్ సుకుమార్‌ను అక్కణ్నుంచి 115 కి.మీ.లున్న అలువాలో దింపేసి, వెనక్కి వెళ్లిపోయాడు. పోలీసులకు సమాధానాలు చెప్పడానికి భాస్కరన్ తనింట్లోనే వున్నాడు. ఇన్సూరెన్సు డబ్బు వచ్చేదాకా సుకుమార్ అజ్ఞాతంగానే వుండాలి కాబట్టి తన ఆనుపానులు ఎవరికీ చెప్పనన్నాడు. అతనెక్కడున్నాడో తామెవ్వరికీ తెలియదు. – ఇదీ సాహూ కథనం.
అంతా విని హరిదాస్ ‘నీ వెర్షన్ సరే కానీ తనే సుకుమార్‌ను చంపానని భాస్కరన్, ఇది తాను చేసిన యాక్సిడెంటల్ డెత్ అని డ్రైవరూ అంటున్నారు. దానికేమంటావ్?’ అని అడిగాడు. ‘నేను నిజమే చెప్పాను. పొరపాటున చేసిన యాక్సిడెంటు అని చెప్పి కొద్దికాలం జైలుకి వెళ్లి వచ్చేస్తే ఎవరికీ చిక్కుండదు కదాని డ్రైవర్ ఆలోచన. గండం తప్పించినందుకు సుకుమార్ డబ్బు ముట్టచెపుతాడని ఆశ. భాస్కరన్ విషయానికి వస్తే సుకుమార్‌కు ఇన్సూరెన్సు డబ్బు రావడమే అతనికి ముఖ్యం. అందువలన చనిపోయినవాడు సుకుమారే అని నిరూపించాలని అతని తాపత్రయం. తను హత్యానేరంపై ఏ పదేళ్లో జైలుకి వెళ్లినా అన్నాళ్లూ సుకుమార్ తన కుటుంబాన్ని పోషిస్తాడని ధీమా.’ అని జవాబిచ్చాడు సాహూ.
హరిదాస్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ శవం సుకుమార్‌ది కాదని నిరూపించాలంటే ఆ సినిమా హాలు దగ్గరి వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. పోలీసు స్టేషన్ల నుంచి వచ్చిన ‘మిస్సింగ్’లలో ఏ వ్యక్తికీ సుకుమార్‌తో పోలికలు కుదరటం లేదు. హాలు దగ్గర మిస్సయిన వ్యక్తి గురించి వాకబు చేయాలంటే అతని ఫోటో కావాలి. అది లేదు కానీ సాహూ చెప్పిన ప్రకారం అతను సుకుమార్ పోలికలతో వున్నాడు. అందుకని భాస్కరన్ యిచ్చిన సుకుమార్ ఫోటో చేతికిచ్చి ఒక యిన్స్పెక్టర్ను హరిపాద్ పంపించి కనుక్కోమన్నాడు. అతను ఆ వూళ్లో నలుగుర్నీ అడిగి, హరి టాకీసుకి వెళ్లాడు.
ఆ హాలు ఓనరు కొడుకు శ్రీకుమార్ ఫోటో చూస్తూనే చెప్పాడు. ‘‘ఇతను చాకో. సినిమా రిప్రజంటేటివ్. డిస్ట్రిబ్యూషర్ తరఫున హాలు కలక్షన్లు చెక్ చేయడానికి వస్తూంటాడు. జనవరి 21 రాత్రి మా హాల్లో సెకండ్ షో నడుస్తూండగా కాంటీన్లో అతనూ నేనూ కబుర్లు చెపుతూ కూర్చున్నాం. ‘‘ఈ అర్ధరాత్రి మీ ఊరికి బయలుదేరడం దేనికి? ఈ పూటకి యిక్కడే వుండి పొద్దున్న వెళ్లవచ్చుగా’’ అన్నాను. ‘‘లేదు, ఆర్నెల్ల గర్భిణి ఐన మా ఆవిణ్ని రేపు చర్చిలో విందుకి తీసుకెళతానని ప్రామిస్ చేశాను. వెళ్లి తీరాలి.’’ అన్నాడు. ‘సరే నీ యిష్టం, యీ టైములో బస్సేం దొరుకుతుంది?’ అంటూ నేను హాల్లోకి వెళ్లిపోయాను. అతన్ని మళ్లీ చూళ్లేదు.’’ అని. చాకో వూరికి వెళ్లి చూస్తే అతను లేడు. ‘‘మా ఆయనకి వూళ్లు తిరగడం అలవాటే. ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే పోలీసు రిపోర్టు యివ్వలేదు.’’ అంది అతని భార్య శాంతమ్మ.
1984 ఫిబ్రవరి 1న సమాధిలోంచి శవాన్ని బయటకు తీశారు. అప్పటికింకా కొత్తదైన సూపర్ ఇంపోజింగ్ టెక్నాలజీ ఉపయోగించి, ఆ శవం చాకోదే అని తేల్చారు. అంత్యక్రియలకై శవాన్ని చాకో భార్యకు అప్పగించారు. ఈలోగా పొణ్నప్పన్ను కూడా పట్టుకున్నారు. చాకోను హత్య చేసినందుకు భాస్కరన్, పొణ్నప్పన్లపై కేసు పెట్టారు. సాహూ అప్రూవర్‌గా మారడంతో వదిలేశారు. హత్యకు సహకరించారంటూ సుకుమార్ భార్య, భాస్కరన్ భార్యలపై కేసు పెట్టారు కానీ సాక్ష్యాలు లేక వదిలివేయాల్సి వచ్చింది. సెషన్స్ కోర్టు భాస్కరన్, పొణ్నప్పన్లకు యావజ్జీవ శిక్ష వేసింది. ఇక హత్యకు సూత్రధారి ఐన సుకుమార్‌ను పట్టుకోవడం ఒక్కటే మిగిలింది.
పొణ్నప్పన్ యిచ్చిన సమాచారం ప్రకారం అలువాలోని అలంకార్ లాజ్‌కు వెళ్లారు పోలీసులు. మూడు రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్లిపోయాడు అని చెప్పాడు లాజ్ ఓనరు. పోలీసులకు పట్టుదల పెరిగింది. అతన్ని వెంటాడుతూ, అతని ఫోటోను పత్రికలలో ప్రచురిస్తూ, ఎక్కడున్నా మాకు తెలియపరచండని ప్రజలను కోరుతూ విస్తృతంగా అతని గురించి శోధించారు. దేశవ్యాప్తంగా వున్న మలయాళీలకు యిదొక వ్యాపకమై పోయింది. ఇదిగో యిక్కడ కనబడ్డాడంటే, అదిగో అక్కడ కనబడ్డాడంటూ పోలీసులకు టెలిగ్రాంలు యిచ్చేవారు. రోజుకి వందలాది టెలిగ్రాంలు వచ్చిపడేవి. కబురు తెలియగానే పోలీసులు అక్కడకు పరుగులు పెట్టేవారు. హత్య జరిగిన నెల్లాళ్లకు సుకుమార్ వాళ్ల అమ్మానాన్నల యింటికి వచ్చి ప్రాధేయపడ్డాడని, వాళ్లు జాలిపడి అతనికి పుష్కలంగా డబ్బిచ్చి, అతన్ని తమ రాజకీయ మిత్రుల ద్వారా కాపాడుతున్నారనీ, అందుకే పోలీసులు పట్టుకోవటం లేదనే వార్తలు పత్రికల్లో వచ్చాయి. దాంతో పోలీసులు నలుగురు అండర్‌కవర్ పోలీసులను అతని యింటి ముందు కాపలా పెట్టారు. అలా ఎనిమిదేళ్లు పెట్టినా లాభం లేకపోయింది.
ఈలోగా పోలీసులకు కసికొద్దీ అతని కోసం తిరిగారు. ప్రతీ చోటా ‘ఇదిగో, మీరు వచ్చే ముందే సుకుమార్ యిక్కణ్నుంచి వెళ్లిపోయాడు’ అనేవారు. అలా సుకుమార్ పోలీసులను అలువా నుంచి చెన్నయ్‌కు, అక్కణ్నుంచి భూటాన్‌కు, అక్కణ్నుంచి అండమాన్‌కు, అక్కణ్నుంచి గ్వాలియర్, భోపాల్‌కి, ఇటార్సీకి, దుబాయి, లాస్ వెగాస్లతో సహా విదేశాలకు తిప్పించాడు. పోలీసు శాఖ ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా మారిపోవడంతో అతని కేసు కింద స్టాఫ్ టిఏ, డిఏలకై ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది. ఈ క్రమంలో కొందరు పోలీసులు తమ సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారట. జేబులో లేకపోతే అప్పు చేసైనా ఊళ్లు వెళ్లి సుకుమార్‌ని పట్టుకుందామని చూశారు. పోలీసులు ఒక వందమంది దాకా అనుమానితులను అరెస్టు చేసి విచారించారు. ఇంటర్‌పోల్ కూడా కొంతమందిని అరెస్టు చేసింది. కురుప్ ముస్లిముగా మారి సౌదీ అరేబియాలో ఒక మసీదులో కాలం గడుపుతున్నాడనే పుకారూ వుంది.
ఇంతకీ కురుప్ బతికివున్నాడా లేదా? 2010లో కురుప్ రెండో కొడుకు సునీత్ పిళ్లయ్‌కి కేరళలో పెళ్లయినప్పుడు శుభలేఖలో తండ్రి పేరును సుకుమార పిళ్లయ్గా వేసి దానికి ముందు కీ.శే. అని చేర్చలేదు. కురుప్ బతికి వుంటే అతనికి 74 ఏళ్లు వుండాలి. కానీ హృద్రోగం వుంది కాబట్టి అతను ఎప్పుడో చనిపోయి వుండవచ్చని కొందరు పోలీసధికారుల నమ్మకం. ‘1989లో ధన్బాద్లో జిల్లా ఆసుపత్రిలో అతను పిఎస్ జోషి పేరుతో ఎడ్మిటయ్యాడు. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయించుకున్నాడు. అతని ఖర్మం కొద్దీ అక్కడొక మలయాళీ నర్సు వుంది. మలయాళీ పత్రికల ద్వారా అతని ఫోటో పరిచితమే కాబట్టి ‘నువ్వు సుకుమార్వే కదా’ అని నిలదీసింది. మర్నాడే అతను తన మెడికల్ రికార్డులతో సహా మాయమై పోయాడు. ఇదే వ్యక్తి 1990లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో తేలాడు. అదే కాదు, ఒడిశా, బెంగాల్, అసాం.. యిలా 9 రాష్ట్రాల్లో అతన్ని స్పాట్ చేశారు. అతని అప్పటి ఆరోగ్యపరిస్థితి చూస్తే యింతకాలం బతికే ఛాన్సే లేదు. ’’ అంటాడు జోసెఫ్ అనే పోలీసాధికారి.
37 ఏళ్లయినా యిప్పటికీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడిగా సుకుమార్ ప్రజల్లో ఆసక్తి రగిలించాడు. అందుకే అతని కథ ఆధారంగా 1984లో ఎన్ఎచ్ 47 అనే సినిమా వచ్చింది. అడూర్ గోపాలకృష్ణన్ 2016లో తీసిన ‘‘పిన్నెయుమ్’’ సినిమా దీనిపై ఆధారపడినదే. ఇప్పుడు దుల్ఖర్ సల్మాన్ తను హీరోగా తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పేర ‘‘కురుప్’’ అనే సినిమాను బహుభాషా (నాలుగు దక్షిణాది భాషలు ప్లస్ హిందీ) చిత్రంగా నిర్మించాడు. థియేటర్లలో మే నెలలోనే రావలసినది ఆలస్యమై ఒటిటిలో త్వరలో రిలీజు కాబోతోంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన యీ సినిమాలో శోభితా ధూళిపాళ, మనోజ్ బాజపేయి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కురుప్‌ను హీరోగా చూపించకూడదంటూ చాకో కుమారుడు జితిన్ కేసు పెట్టాడు. ‘నా తల్లి హంతకులను క్షమించానని ప్రకటించింది కానీ నేను మాత్రం క్షమించను. ఏ పాపమూ తెలియని మా నాన్నను అన్యాయంగా చంపేశారు. ఆయన నన్ను కళ్లారా చూసుకోనూ కూడా చూడలేదు. నేను గర్భంలో వుండగానే వీళ్లు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు’ అంటాడతను.
1990లో కురుప్‌ను ‘అబ్స్కాండర్’గా ప్రకటించారు కాబట్టి ప్రభుత్వం అతని ఆస్తులను జప్తు చేసుకుంది. సుకుమార్ ఇల్లు మధ్యలోనే ఆగిపోయి, దిష్టిబొమ్మలా మిగిలింది. అతని భార్య సరసమ్మకు అబు ధాబిలో ఉద్యోగం పోయింది. అక్కడి వాళ్లంతా వెలివేశారు. కేరళ వచ్చేసి పులియూరులో అజ్ఞాతంగా బతుకుతోంది. సాహూ గల్ఫ్ వెళ్లిపోయి ఉద్యోగంలో చేరిపోయాడు. పొణ్నప్పన్ జైలు శిక్ష పూర్తి చేసి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కరన్ పులియూరులోనే వున్నాడు. భార్య, కొడుకుతో వుంటూ మీడియాను తప్పించుకుంటున్నాడు. చాకోను లోపల పెట్టి కారు కాల్చేసిన పొలాన్ని మొదట్లో తన్నిముక్కం పాడం అనేవారు కానీ 1984 తర్వాత చాకో పాడంగా పిలుస్తున్నారు. ఇప్పటికీ అటువైపు వెళ్లే కొందరు ఆగి ఫోటోలు తీసుకుంటూ వుంటారంటే కేసు ఎంత ఆసక్తిని రగిలించిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ కథను నేను ఒక పత్రికా కథనంగా ప్రెజెంటు చేసి వుండవచ్చు. ఈ సబ్జక్టుపై తీసిన పాత సినిమాలు చూడలేదు కానీ కొత్తగా సినిమాగా తీస్తున్నారని తెలిశాక కథనం యిలా మొదలు కావచ్చు అనే పద్ధతిలో చెప్పుకొచ్చాను. చాకో, గోపాలకృష్ణ, సుకుమార్ పాత్రలు ఒకే నటుడు వేస్తాడు కాబట్టి, తొలి సీన్లలో దృశ్యరూపంగా కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, యినీషియల్గా యింట్రస్టు పుట్టించవచ్చు. కానీ ‘‘కురుప్’’ సినిమా రచయితలు కథను మరోలా ప్రెజంటు చేయవచ్చు. మెలోడ్రామా కోసం వాస్తవాలను మార్చవచ్చు, కల్పన జోడించవచ్చు. ముఖ్యంగా కురుప్ పోలీసులను ఎలా బురిడీ కొట్టించాడనే దానిపై ఎక్కువ చెప్పారేమో సినిమా వచ్చాక తెలుస్తుంది. (సమాప్తం) (ఫోటోలో సుకుమార్, చాకో, కురుప్ తెలుగు వెర్షన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)