పవన్ బాబుది లెక్కలేనంత తిక్క వాగుడు

“నాకు తిక్కుంది. కానీ దానికో లెక్కుంది” అనే డయలాగ్ పాతది. ఇప్పుడైతే ఏ లెక్కా లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నోటికొచ్చినట్టు వాగేయడమే. అవతల మంత్రి సోదరభావం గురించి మాట్లాడితే “సన్నాసి” అని…

“నాకు తిక్కుంది. కానీ దానికో లెక్కుంది” అనే డయలాగ్ పాతది. ఇప్పుడైతే ఏ లెక్కా లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నోటికొచ్చినట్టు వాగేయడమే. అవతల మంత్రి సోదరభావం గురించి మాట్లాడితే “సన్నాసి” అని తిట్టేయడమే. 

అయ్యా! పవన్ కళ్యాణూ! నువ్వు నిజంగా వార్తలు చూసి, చదివి ఒక అభిప్రాయానికి వస్తావా? లేక నీకు ఎవడన్నా ఫలానా వార్తొచ్చిందని చెప్పి వాడి అభిప్రాయాన్ని నీ మీద రుద్దితే నువ్వు మాట్లాడతావా? 

నానీ సినిమా థియేటర్లులోకి రాకపోవడానికి కారణం ఏపీ ప్రభుత్వమా? ఎగ్జిబిటర్లు నానీ మీద పడినందుకు నీకు జాలేసిందా? ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది అంటావా? అసలేవన్నా లింకు, సింకు ఉన్నాయా నీ మాటలకి? 

థియేటర్లో సినిమా వేస్తే కరోనా కారణంతో జనాలు రారేమోనన్న భయంతో నానీ సినిమా “టక్ జగదీష్” నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజుకెళ్లారు. ఇక్కడ ప్రభుత్వం చేసిందేముంది? పోనీ తక్కువ రేట్లకి టికెట్లమ్మాలని జీవో ఇచ్చిందాని గురించి మాట్లాడుతున్నావా అంటే..అసలా జీవోని ఫాలో అయ్యి టికెట్లమ్ముతున్న ఎగ్జిబిటర్లెంతమంది? 

కాకినాడలోని ఒక థియేటర్ “సీటీమార్” చిత్రానికి గాను “బుక్ మై షోలో” జీరో ప్రైస్ తో ఆడియన్స్ చేత టికెట్ బుక్ చేయించి కౌంటర్ దగ్గర కావాల్సినంత గుంజారు. అంటే ఎంతకి అమ్మారో లెక్క కనపడకుండా థియేటర్ ఓనర్ తీసుకున్న జాగ్రత్తన్నమ్మాట. బుక్ మై షో కి కన్వీనియన్స్ చార్జెస్ మాత్రమే ఆన్లైన్ లో పే చెయ్యాల్సి ఉంటుంది. థియేటర్ వాళ్లు ఎంతకమ్మారో బుక్ మై షో కి కూడా తెలియదన్నమాట. 

నిన్నటికి నిన్న ఏపీలోని చాలా థియేటర్స్ లో కౌంటర్ దగ్గర యధేచ్ఛగా తోచిన ధరకి “లవ్ స్టోరీ” టికెట్స్ అమ్మేసారు. జీవోలో ఉన్న లెక్కలు ఎవ్వడూ పాటించట్లేదు. ఎవడడిగాడు? 

అయినా సరే మంత్రిని పట్టుకుని “సన్నాసి” అనేసి నీ సన్నాసితనం బయటపెట్టుకున్నావ్. పైగా నీ స్పీచుకి ముందు వరుసలో కూర్చుని దిల్ రాజు ముసిముసి నవ్వులు. ఇవన్నీ చూస్తూ టికెట్ రేట్లు సవరించి కొత్త జీవో తేవాలా ప్రభుత్వం? 

ఉన్న జీవో ని అమలు చెయ్యమని తొడపాశం పెడితే అప్పుడు వినిపిస్తాయి అసలు అరుపులు. తమిళనాడులోనూ, కేరళలోనూ టికెట్ ధరలెలా ఉన్నాయో ఇంచుమించు వాటికి దీటుగా సవరణలు చెయ్యమని అడగొచ్చు. ఒక్క ఆంధ్రలోనే కాదు రేపో మాపో తెలంగాణాలోనూ, కర్ణాటకలోనూ కూడా సినిమా టికెట్ల నియంత్రణపై గట్టి నియమాలు వస్తాయి. వాటిని పాటించాలి కానీ నీ దురాశ, నీ కుటుంబంలోని హీరోల పేరాశ తీరట్లేదని సినిమా రంగం పీక నొక్కేస్తున్నారంటే ఎలా? 

ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానాలు నిర్మాతకే శ్రేయస్కరం. ఏ రేట్లకి టికెట్స్ అమ్మితే థియేటర్స్ ని సజావుగా నడపొచ్చో ఆ రేట్లు కేటాయించబడతాయి. ఆ విధంగా ఎగ్జిబిటర్స్ కూడా నష్టపోరు. ఏం? తమిళనాడు సినీ పరిశ్రమ టికెట్ రేట్ల సీలింగ్ వల్ల అడుక్కుతింటోందా? వాళ్లు బాగానే ఉన్నారుగా? 

నిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సినిమారంగాన్ని ఇబ్బంది పెడుతోందంటున్నావు! అదికాదు అసలు..

రేపో మాపో ఒక సానుకూలమైన పరిష్కారం వస్తుందనుకుంటే ఆ పనికి పూనుకున్న మంత్రినే సన్నాసి అనేసావు. నీ నోటి దూలకి మొత్తం పరిశ్రమని మంటల్లోకి తోస్తున్నది నువ్వు. 

కాసేపు కులాల గురించి మాట్లాడ్డం చిరాకంటావు. ఈ డయాలగ్ చెప్పడానికి కాస్త ముందే..”కాపులకి, బలిజలకి న్యాయం చేయండి..మీడియా వాళ్లు అటువంటి వార్తలు చూపించండి” అంటూ అరిచావు. నువ్వేం మాట్లడతావో నీకే తెలియదు. 

సాయి ధరం తేజ్ సినిమా హీరో. యాక్సిడెంటైతే జనానికి ఆతృత ఉంటుంది. ఆ ఆతృతకి సమాధానం చెప్పే విధంగా మీడియా పని చేస్తుంది. 

జనం ఏం కోరుకుంటారో అటువంటి సినిమాలు తీస్తామని మీ సినిమా వాళ్లు చెప్పినప్పుడు, జనం ఏం కోరుకుంటారో ఆ వార్తని ఎక్కువగా చూపిస్తామని మీడియా ఎందుకనకూడదు? 

కోలుకుంటున్నాడు కదా అని కుటుంబ సభ్యులు చెబితే “హమ్మయ్య” అనుకుని పక్కన పెట్టిన వార్తని కెలికి నువ్వే చెప్పావు ఇవాళ- సాయి తేజ్ ఇంకా కళ్లు తెరవలేదని. ఇలా చెప్పద్దనుకున్నది చెప్పినందుకు మీ అన్నయ్య ఈ పాటికి నిన్ను మందలించి ఉండాలి. 

సాయి ధరం తేజ్ కి మీడియా ఏదో అన్యాయం చేసేసినట్టు మాట్లాడుతున్నావు. కేవలం వేగంగా వెళ్లి పడ్డాడు అంటేనే సన్నాయి నొక్కులు నొక్కేసుకుంటున్నావు. నీ మొత్తం కుటుంబంలోని అందరి హీరోలకంటే సాయిధరం అంటే యాంటీ ఫ్యాన్స్ కి కూడా ఇష్టం. మీడియా వాళ్లు కూడా సాయిని సాఫ్ట్ కార్నర్ తోనే చూస్తారు. నీకా విషయం తెలియకపోవచ్చు. 

జగన్ మోహన్ రెడ్డి మీద జల్లే బురద నీమీద కూడా జల్లదు మీడియా. వైసీపీ వాళ్లు అలా బురద జల్లిన వాళ్ల ఇంటికి వెళ్ళి కోట్టేశారా? 

నీ కోడి బుర్రకి కోడి కత్తి కేసు తప్ప ఇంకేమీ కనపడదు. దాని మీద చెప్పమంటావు. వివేకా హత్య గురించి అడుగుతావు. నాయనా! టీవీలు చూడవా? ఆ హత్య గురించి సీబీయై చేస్తున్న విచారణలు తెలియవా? ఎందుకయ్యా ఇలా “అజ్ఞానవాసి”లాగ మమ్మల్ని పీక్కుతింటావ్? 

నువ్వు భయపాడాల్సిన విషయం ఒకటుంది. అమెరికాలో “లవ్ స్టోరీ” సినిమా రెండు రోజుల్లో నీ “వకీల్ సాబ్” రికార్డ్ ని దాటేసింది. ఇదేనా నీ స్టార్ డం? పవర్ లేనప్పుడు ఎందుకొచ్చిన “పవర్ స్టార్” బిరుదని బాగానే గ్రహించావు. రాజకీయాల్లోనే కాదు వాస్తవానికి సినిమాల్లో కూడా చెప్పుకుంటున్నంత పవర్ నీకు లేదు. అంతా మసిపూసిన మారేడుకాయ. 

నీ సినిమాలన్నీ ఆన్లైన్లోనే వస్తే మంచిది. లేకపోతే ఇలా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి రేంజ్ వ్యక్తులు నిన్ను దాటేస్తూనే ఉంటారు. నీ అసలు బండారం బయట పడిపోతుంది.  

మధ్యలో ఒకమాటన్నావు. “మన సినిమాలు ఆంధ్రలో ఆపుతారు. ఆపితే ఊరుకుంటామా?” అని నీ ఫ్యాన్స్ ని రెచ్చకొట్టే ప్రయత్నం చేసావు. ఎవ్వరూ ఏమీ చెయ్యరు. వస్తే ఓటీటీలో చూస్తారు, లేకపోతే లేదంతే. 

ఇడుపులపాయలో ధననిధులు ఉన్నాయని నీకెవరో చెప్పారని చెప్పావు. మరి నువ్వు చంద్రబాబు దగ్గర రూ. 1000 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నావని రాష్ట్రంలో చాలమంది చాలామందికి చెబుతున్నారు. దాని మీద కూడా వార్తలు చూపించొచ్చా మరి మీడియా? 

లాజిక్కు లేకపోయినా మొన్న “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ వేడుకలో మీ అన్నయ్య హుందాగా మాట్లాడాడు. నువ్వేమో ఇవాళ సన్నాసివాగుడు వాగావు. 

నీది రెండు పడవల మీద కాళ్లు. సినిమా ఈవెంటులో సినిమావాడిగా మాట్లాడు, రాజకీయాలు చెయ్యకు. రాజకీయ సభల్లో జనసేన తరపున మాట్లాడుకో, సినిమా కబుర్లు అక్కడ చెప్పకు.  

అన్నట్టు ఫైనల్ గా ఒక్క మాట- నువ్వింకా గంగతో రాంబాబు సినిమా పాత్రలోంచి బయటికొచ్చినట్టు లేవు. మీడియాకి ఎటువంటి వార్తలు చూపించాలో క్లాసులు పీకుతున్నావు. నీ సొంత చానల్ వాళ్లకి చెప్పు. చెవులు మూసుకునైనా వింటారు. 

– అల్లంశెట్టి గణేష్