కేరళలోని హరిపాద్ అనే ఊళ్లోని హరి టాకీస్ ముందు రోడ్డు మీద ఒకతను నిలబడి వచ్చేపోయే కార్లను ఆపి లిఫ్ట్ కోసం అడుగుతున్నాడు. కాస్సేపటికి అటువైపు వెళుతున్న ఒక అంబాసిడర్ కారు ఆగింది. ‘‘అలప్పుళకి లిఫ్ట్ కావాలి.’’ అన్నాడతను. ‘‘రండి’’ అంటూ వెనకసీటులో ఉన్నతను జరిగి చోటిచ్చాడు. డ్రైవర్ పక్కన మరో అతను కూర్చున్నాడు. వెనకసీటులో ఉన్నతను బ్రాందీ బాటిలు తెరిచాడు. ‘‘తాగండి’’ అన్నాడు. ఇతను ‘‘అబ్బే, వద్దు’’ అన్నాడు. ఫర్వాలేదు తీసుకోండి అని కాస్త కటువుగానే చెప్పినా తీసుకోలేదు.
ఇంతలో డ్రైవరు కారును పక్క వీధిలోకి పోనిచ్చాడు. అతని కళ్ల ముందు మందు బాటిలు మళ్లీ ఆడించి ‘‘ఇప్పటికైనా తాగు’’ అన్నాడు లిఫ్టిచ్చిన వ్యక్తి. ‘ఏదో వింత వాసనేస్తుంది. వద్దు’ అన్నాడితను భయంగానే. దాంతో ముందు సీట్లో ఉన్నతను, వెనకసీటతను యిద్దరూ కలిసి బలవంతంగా మద్యాన్ని అతని గొంతులో పోశారు. తాగుతూనే యితనికి స్పృహ తప్పింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి తువ్వాలు అతని గొంతుకి బిగించారు. అతనికి ఆశ్చర్యంగా వుంది – ఎవరు వీళ్లు? నన్ను చంపడానికి కారణమేమిటి? నన్ను చంపితే వీళ్లకు వచ్చే ప్రయోజనమేమిటి? అని ఆలోచిస్తూనే కళ్లు తేలేశాడు.
పూనాలో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తన చేతిలో ఫోటో చూసి నిట్టూర్చాడు. ‘‘ఎయిర్‌మన్ గోపాలకృష్ణ పిళ్లయ్ చచ్పిపోయాడా పాపం’’ అని జాలిపడి ఫోటోను బల్లమీద పడేశాడు. దాన్ని చేతిలోకి తీసుకుంటూ అతని అసిస్టెంటు ‘‘చచ్చిపోయి బతికిపోయాడు. ఎయిర్‌ఫోర్స్‌లో కెరియర్ అంటే తమాషా అనుకుని చేరాడు. ట్రెయినింగ్ అయ్యేటప్పటికి తిక్క కుదిరిపోయింది. ఇంటికి వెళ్లివస్తానని లాంగ్ లీవ్ పెట్టి వెళ్లాడు. మళ్లీ రాలేదు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను పంపించి, వెతికిస్తే యిదీ కబురు! ఆర్మీని డిజెర్ట్ చేసినందుకు శిక్ష పడుతుందని భయపడి చచ్చిపోయాడేమో!’’ అన్నాడు కసిగా.
‘‘మరీ అంత నిర్దయగా మాట్లాడకు. చెరియనాడులో మంచి అప్పర్ మిడిల్ క్లాస్ నాయర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడయ్యా. వాళ్ల అమ్మా, నాన్నా యిద్దరికీ సమాజంలో మంచి పేరుంది, రాజకీయంగా పలుకుబడి వుంది. వీడు ఇంటర్ కాగానే ఎయిర్‌ఫోర్సులో చేరాడు. ఆవేశం కొద్దీ చేరాడు కానీ దీనిలోని కష్టాలు చూసి బెదిరిపోయాడు. పోన్లే చచ్చిపోయినవాడి గురించి డిస్కషనెందుకు? ఆ డిజర్టర్ ఫైలు మూసేయ్.’’ అన్నాడు ఆఫీసర్.
బొంబాయిలోని మాటుంగాలో ఓ గుడి ఆఫీసు. గుమాస్తా రిజిస్టర్లో వివరాలు రాసుకుంటూ అడుగుతున్నాడు. ‘‘శుక్రవారం పది గంటలకు పెళ్లి. నువ్వేనా ఆ పెళ్లికొడుకువి? ఏదీ ఫోటో ఇయ్యి.’’ అని. ఆ యువకుడు తన ఫోటో యిచ్చాడు. ‘‘పేరు?’’ ‘‘సుకుమార్ కురుప్.’’ ‘‘సరే, పెళ్లికూతురు?’’ ఆ యువకుడు ఓ ఫోటో యిస్తూ పేరు చెప్పాడు. ‘‘సరసమ్మ’’. ‘‘ఇదిగో, పురోహితుడి దగ్గర్నుంచి అన్ని ఏర్పాట్లూ మేం చేస్తాం. మీరు కనీసం నలుగురైదుగుర్ని వెంట తీసుకుని రండి. సాక్షులగా సంతకాలు తీసుకుంటాం.’’ అన్నాడు గుమాస్తా. యువకుడు తలవూపాడు.
పెళ్లయిన సాయంత్రం హోటల్లో స్నేహితులకు పార్టీ యిస్తున్నాడతను. అతని ఫ్రెండ్స్‌లో యిద్దరు మాట్లాడుకుంటున్నారు. ‘‘కేరళలో మంచి యిల్లు పెట్టుకుని యీ రహస్యపు పెళ్లేమిట్రా బాబూ వీడికి?’’ అన్నాడొకడు. ‘‘వాడి అమ్మానాన్నకు తెలిస్తే చావగొడతారు. ఈ సరసమ్మ వాళ్లింట్లో పనిమనిషి కూతురు. ఎలా ఒప్పుకుంటారు చెప్పు. ఇక్కడ బొంబాయిలో నర్సింగ్ కోర్సు చేసేటప్పుడు, వీడికి బాగా దగ్గరైంది. మనవాడు పెళ్లికి సరేనన్నాడు.’’ అని జవాబిచ్చాడు మరొకడు.
‘‘వీడి వానాకాలం చదువుతో ఏ ఉద్యోగం దొరుకుతుంది? వాళ్ల అమ్మానాన్నా సపోర్టు లేకుండా పెళ్లాన్ని ఎలా పోషిస్తాడు?’’ ‘‘అబు ధాబి వెళతాడట. తను అక్కడకి వెళ్లాక భార్యను రప్పించుకుంటాడట. అక్కడామెకు నర్సు ఉద్యోగం దొరక్కపోదు.’’
అదే జరిగింది. సుకుమార్ కురుప్ అబు ధాబి చేరాడు. ఓ మెరైన్ ఆపరేటింగ్ కంపెనీలో చేరాడు. సరసమ్మను రప్పించుకున్నాడు. ఇద్దరి జీతాలు కలిపి 60 వేలు వచ్చేది. దాంతో అక్కడ బాగానే జరగడమే కాక, కేరళలోని సరసమ్మ బంధువులకు కూడా డబ్బు సాయం చేయసాగారు. సరసమ్మ చెల్లెలి కుటుంబం బాగుపడింది. ఆమె భర్త భాస్కరన్ పిళ్లయ్‌కు సుకుమార్ అంటే గౌరవం కలిగింది. కొన్నాళ్లకు సుకుమార్‌కు యిద్దరు కొడుకులు కలిగారు. అయినా సుకుమార్ తలిదండ్రులు కొడుకుని క్షమించలేదు, దగ్గరకు రానీయలేదు. కానీ సుకుమార్‌కు చింతేమీ లేదు. తరచుగా కేరళ వచ్చి స్నేహితులకు బహుమతులు తెస్తూండేవాడు. మందు పార్టీలు యిస్తూండేవాడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. కేరళ వచ్చినపుడు సరదాగా తిరగడానికి ఓ అంబాసిడర్ కారు కొన్నాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకునే పని తోడల్లుడు భాస్కరన్‌కు అప్పగించాడు. చేతిలో డబ్బు మిగులుతూండడంతో అలప్పుళాలోని అంబళపుళ ప్రాంతంలో పెద్ద భవంతి కడితే బాగుండునని తోచింది సుకుమార్ దంపతులకు. భాస్కరన్ తను దగ్గరుండి కట్టిస్తానని మాట యిచ్చాడు. భవన నిర్మాణం సాగుతోంది.
జీవితం బాగానే నడుస్తోంది అనుకుంటూండగా గల్ఫ్‌లో కంపెనీలు పెద్ద జీతాల వాళ్లను తీసేసి, వాళ్లకు బదులుగా తక్కువ జీతాలకు కొత్త పనివాళ్లను తెచ్చుకోసాగాయి. సుకుమార్ పనిచేసే కంపెనీ కూడా ఆ దిశలో ఆలోచిస్తోందన్న వార్త వచ్చింది. దాంతో యితను భయపడ్డాడు. ‘‘ఈ ఉద్యోగాల్ని నమ్ముకుంటే లాభం లేదు. కేరళ వెళ్లి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం. మా ఫ్రెండ్స్ చాన్నాళ్లగా అదే చెప్తున్నారు. నువ్వు మొదలెడితే అన్నీ దగ్గరుండి చూసుకుంటాం అంటున్నారు.’’ అన్నాడు సుకుమార్ తన భార్యతో. ‘‘సగంలో ఆగిన యిల్లు పూర్తి చేయాలి. లేకపోతే నామర్దా. మన సేవింగ్సన్నీ హరించుకుపోయాయి. వ్యాపారానికి పెట్టుబడికై డబ్బు కావాలి. మీ వాళ్ల దగ్గర వుంది కానీ అడిగితే యివ్వరు. డబ్బు లేనిదే ఏ ప్లాన్లు వేసి ఏం లాభం?’’ అంది సరసమ్మ. ‘‘అదీ నిజమే. ఏదో ఒకటి చేయాలి.’’ అన్నాడు సుకుమార్. అప్పణ్నుంచి తీవ్రంగా ఆలోచించసాగాడు.
1984 జనవరి 22 ఉదయం. మావెళిక్కర పోలీసు స్టేషన్‌లో సర్కిల్ యిన్‌స్పెక్టర్ హరిదాస్ తన చేతిలోని ఫోటో చూస్తూ ‘‘తన్నిముక్కం దగ్గరి పొలంలో కారులో కాలిపోయింది యితనే అంటావ్’’ అని అడిగాడు ఎదుటి వ్యక్తితో. ‘‘అవునండి, సుకుమార్ కురుప్ అని మా తోడల్లుడు. అబు ధాబిలో పని చేస్తూంటాడు. ఇక్కడ అంబళపుళలో యిల్లు కట్టిస్తున్నాడు. ఆ పనిమీదే వచ్చాడు. కాలిపోయిన నల్ల అంబాసిడర్ కారు అతనిదే. ఇక్కడికి వచ్చినపుడు తిరగడానికి సెకండ్ హ్యాండ్ కారు కొనిపెట్టమంటే కొనిపెట్టాను. గల్ఫ్ నుంచి వచ్చాక మా యింట్లోనే వుంటున్నాడు. సొంతిల్లు కడుతున్న అంబళపుళా వెళ్లి వచ్చేస్తానన్నాడు. రాత్రి వస్తూండగా యాక్సిడెంటయి కారులో మంటలు రేగి కాలి, చచ్చిపోయి వుంటాడు. చాలా ఉపకారస్తుడు. చూడండి, ఎంత ఘోరంగా చచ్చిపోయాడో.’’ అని కళ్లు ఒత్తుకున్నాడతను. ‘‘నీ పేరేమిటి?’’ ‘‘భాస్కరన్ పిళ్లయ్. చెరియనాడులో ఉంటాను.’’
ఆ రోజు ఉదయం 4 గంటలకు ఒక పల్లెటూరతను పోలీసుస్టేషన్‌కు వచ్చి వరిపొలంలో కారు తగలబడిపోతోందని, డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి బాగా కాలిపోయాడని చెప్పాడు. హెడ్ కానిస్టేబుల్ వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అక్కడకు పరిగెట్టాడు. అప్పటికే అక్కడ కొంతమంది పోగడివున్నారు. టర్న్ చేయడంలో పొరబాటు జరిగి, రోడ్డు మీద నుంచి కారు పొలంలో దూసుకుని వచ్చి మంటలు వచ్చి వుంటాయని అందరూ అనుకుంటున్నారు. ‘‘మంటలు విపరీతంగా వచ్చాయండి. లోపలేముందో కనబడలేదు. మంటలు కాస్త చల్లారాక చూస్తే లోపల డ్రైవరు కాలిపోయి వున్నాడు. కారులో యింకెవరూ లేరు.’’ అన్నాడొకతను. సర్కిల్ ఇన్‌స్పెక్టరు హరిదాస్‌కు కబురు పంపితే ఆయన వచ్చేసరికి 5.30 అయింది. పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓ అగ్గిపెట్టె, చెప్పులజత, రబ్బర్ గ్లవ్స్ కనబడ్డాయి. గ్లవ్స్ మీద వెంట్రుక కూడా కనబడింది. గాలిలో పెట్రోలు వాసన బాగా వస్తోంది. ఎవరో అక్కణ్నుంచి పారిపోయినట్లు మట్టిలో అడుగుజాడలు కూడా కనబడ్డాయి.
శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపమని చెప్పి హరిదాస్ ‘కారు ఎవరిదయ్యా? కనుక్కో’ అన్నాడు. ‘కనుక్కున్నామండి. సుకుమార్ కురుప్ అని 30 ఏళ్ల వయసుంటుంది. రెండు వారాల క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడట. వాళ్ల బంధువుల దగ్గరే చెరియనాడులో ఉన్నారట.’ అయితే కబురు పెట్టండి. వాళ్లు వచ్చి ధృవీకరిస్తే తప్ప శవం ఫలానావారిదని తెలియనంతగా కాలిపోయింది.’ అన్నాడు హరిదాస్. కానిస్టేబుల్ వెళ్లి చెప్పగానే భాస్కరన్, అతని భార్య వచ్చారు. శవాన్ని చూసి ఏడ్చారు. ‘ఒడ్డూ పొడవూ బట్టి చూస్తే సుకుమార్‌దే’ అని భాస్కరన్ చెప్పాడు. ఆ మేరకు స్టేటుమెంటు యిచ్చాడు. అతన్ని పోలీసు స్టేషన్‌లో చాలాసేపు కూర్చోబెట్టి హతుడి వివరాలన్నీ సేకరించి, మధ్యాహ్నానికి కానిస్టేబుల్ నిచ్చి యింటి దగ్గర పోలీసు జీపులో దింపి రమ్మన్నారు. ‘‘శవాన్ని దహనం చేయకండి. పాతిపెట్టండి. మాకేమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలి.’’ అని ప్రత్యేకంగా చెప్పాడు హరిదాస్.
అవేళ సాయంత్రానికి పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. మంటల వలన చనిపోతే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లి కార్బన్ డయాక్సయిడ్, ధూళీ వుండాలి. కానీ యితనికి అలా లేదు. ముందే చంపేసి, కారులో కూర్చోబెట్టి వుండాలి. హతుడి పొట్టలో లిక్కర్‌తో బాటు ఇథైల్ ఆల్కహాల్ కూడా వుండడం ఆశ్చర్యంగా వుంది అన్నాడు డాక్టరు. పైగా చేతికి వాచీ, వేలికి ఉంగరం కూడా లేవు. ‘ఒకవేళ తాగించి, స్పృహతప్పించి, వాచీ, ఉంగరం లాక్కుని, కారులో కూర్చోబెట్టి మంట పెట్టేశారేమో. పొలంలో దొరికిన సాక్ష్యాలు కూడా అలాగే వున్నాయి. సుకుమార్‌ది యాక్సిడెంటు కాకపోవచ్చు, ఎవరో హత్య చేసి వుంటారు.’ అన్నాడు హరిదాస్ తన స్టాఫ్‌తో. వారిలో ఒకతను ‘ఆ పని భాస్కరనే ఎందుకు చేసి వుండకూడదు? పొద్దున్న స్టేషన్‌కు వచ్చినపుడు పొడుగు చేతుల చొక్కా వేసుకుని వచ్చాడు. కారుకి నిప్పు ముట్టించడంలో చేతులు కాలేయేమో!’ అన్నాడు.
భాస్కరన్‌ను దింపడానికి వెళ్లిన కానిస్టేబుల్ ‘ఇంకో విషయమండి. వాళ్లింట్లో ఎక్కడా ఏడుపులూ, పెడబొబ్బలూ లేవు. మేం వెళ్లేసరికి భాస్కరన్ భార్య యింట్లో చికెన్ వండుతోంది. బావగారు చచ్చిపోయిన రోజున ఎవరైనా చికెన్ వండుకుంటారా?’ అన్నాడు. ‘తక్షణం వెళ్లి భాస్కరన్‌ను తీసుకురండి.’ అన్నాడు హరిదాస్. మళ్లీసారి వచ్చినపుడు కూడా భాస్కరన్ ఫుల్‌స్లీవ్ చొక్కాలోనే వున్నాడు. ‘‘పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చింది. ఎవరో కానీ అతన్ని ముందే చంపేసి, శవాన్ని కారులో పడేసి కాల్చేశారని తేలింది. ఎవరు చేసి వుంటారు?’’ అని హరిదాస్ అడిగాడు. ‘‘అయ్యో అలాగా, అతను ఖర్చు బాగా పెట్టడం చూసి అసూయతో భగ్గుమనేవారు చాలామంది ఉన్నారు. అబూ ధాబిలోనే శత్రువులున్నారని చెప్పేవాడు. వారిలో ఎవరైనా యీ ఘాతుకం చేసి వుండవచ్చు.’’ అన్నాడు భాస్కరన్.
‘‘అది సరే కానీ, నువ్వు నీ చొక్కా చేతులు కాస్త పైకి మడిచి చూపించు’’ అన్నారు. చూస్తే అతని మోచేయి కాలి వుంది. ఏమిటిది? అని అడిగితే శీతాకాలం కదండి, పెరట్లో ఎండుటాకులు పోగేసి, మంట పెడుతూంటే, మంట ఎగసి చేతులు కాల్చేసింది. చూడండి నుదుటి మీద కూడా కాలింది.’’ అన్నాడు. ‘‘ఇది చూస్తే 24 గంటలు కూడా గడిచినట్లుగా లేదు. మీ పెరట్లో ఆ చితి అలాగే వుండివుంటుంది. పద, వెళ్లి చూద్దాం.’’ అన్నాడు హరిదాస్. ‘‘మర్చిపోయానండోయ్. అలా జరిగింది, కితం నెల. ఇది నిన్నటిది. వేణ్నీళ్ల కాగు దింపుతూంటే నీళ్లు తుళ్లిపడి చెయ్యి కాలిపోయింది.’’ అన్నాడు భాస్కరన్. ‘ఎందుకైనా మంచిది వీడి బట్టలిప్పి శరీరమంతా పరీక్షించండిరా’ అన్నాడు హరిదాస్. చూస్తే కుడి కాలు కూడా కొంత మేర కాలినట్లు తెలిసింది.
లాకప్‌లో పెట్టి కాస్సేపు కుమ్మిన తర్వాత భాస్కరన్ చెప్పేశాడు – ‘‘నేనే అతన్ని చంపేశాను. నాకు గల్ఫ్‌లో ఉద్యోగం యిప్పిస్తానని ఆశ పెట్టి, నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నాడు. ఇప్పుడు నాకే ఉద్యోగం పోయేట్లుంది, నీకేమిప్పిస్తాను అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి చంపేశాను.’’ అని. కానీ హరిదాస్ నమ్మలేదు. ‘‘మీ యింటికి పద’’ అని అక్కడకు వెళ్లి సాక్ష్యాలు వెతికాడు. పోర్టికోలో కొన్ని కాలిన వెంట్రుకలు కనబడ్డాయి. అక్కడే వాళ్ల కాంపౌండులో కొత్త ఎంబాసిడర్ కారు కనబడింది. కొత్త కారుండగా గల్ఫ్ నుంచి వచ్చినవాడు పాతకారులో ఎందుకు తిరుగుతాడు? ఈ భాస్కరనే సుకుమార్‌ను చంపేసి, పాతకారులో పడేసి, మంట పెట్టేసేడా?’ అనుకుంటూ ‘ఈ కారు డ్రైవరు ఎవరు? ఎక్కడున్నాడు?’ అని అడిగాడు. ‘అతని పేరు పొణ్నప్పన్. ఎక్కడికి పోయాడో కనబడటం లేదు.’ అన్నాడు భాస్కరన్.
డ్రైవరెందుకు మాయం కావాలి? వాణ్ని పట్టుకుంటే మిస్టరీ విడుతుంది అనుకుని హరిదాస్ డ్రైవర్ల యూనియన్‌కు కబురుపెట్టాడు. మర్నాడు ఒకతను ఫోన్ చేసి ‘‘పొణ్నప్పన్ నా దగ్గరకు వచ్చాడు సార్. మొన్న రాత్రి తను కారులో వస్తూంటే రోడ్డు మీద పొరపాటున ఎవర్నో గుద్దేశాడట. భయపడి అతన్ని కార్లో పెట్టి కాల్చేసి, పారిపోయాడట. భయం చేత మీ దగ్గరకు రాలేకుండా వున్నాడు. కావాలని చేసినది కాదు కాబట్టి, అతనికి పెద్దగా శిక్ష పడదని హామీ యిస్తే వస్తాడట.’’ అని చెప్పాడు. ‘‘సరేలే, పై అధికారులను సంప్రదించి చెప్తాను.’’ అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు హరిదాస్. డ్రైవరేమో రోడ్డు మీద గుద్దేసినవాణ్ని కాల్చేశాడంటున్నాడు. ఇటు భాస్కరన్ ఏమో తనే సుకుమార్‌ను చంపి కాల్చేశానంటున్నాడు. శవం ఎవరిది? సుకుమార్‌దా? లేక ఆ రోడ్డు మీద పోయేవాడిదా? రెండోదే అయితే వాడెవడు? ఎవరైనా మిస్సింగ్ అని ఏ పోలీసు స్టేషన్‌లో నైనా రిపోర్టు యిచ్చారా? అని వాకబు చేయమని చెప్పి మళ్లీ భాస్కరన్ యింటికి వెళ్లాడు.
‘‘మీ డ్రైవరు ఫలానా విధంగా చెప్పాడు. నువ్వేమో యిలా చెప్తున్నావు. ఏమిటి కథ?’’ అంటే భాస్కరన్ ‘‘నేను నిజమే చెప్పాను సార్. మరి డ్రైవరు ఎందుకలా అన్నాడో వాడికే తెలియాలి.’’ అన్నాడు. ‘‘సుకుమార్ రెండు వారాల క్రితం వచ్చాక ముగ్గురు, నలుగురితో కలిసి తిరుగుతున్నాడని అంబళపుళా వాళ్లు చెప్పారు. నువ్వూ, డ్రైవరూ యిద్దరనుకున్నా తక్కినవారెవరు?’’ అడిగాడు హరిదాస్. ‘‘కొందరు అతని లోకల్ ఫ్రెండ్స్. ఒకతను అతనితో బాటు అబూ ధాబీ ఆఫీసులో పని చేసే సాహూ. అతనూ తనతో పాటు వచ్చాడు. వాళ్లది చావక్కాడు.’’ అని జవాబిచ్చాడు భాస్కరన్. సుకుమార్ అంత్యక్రియలకు రాలేదా అంటే రాలేదన్నాడు భాస్కరన్. డ్రైవరుతో బాటు, అతనూ మిస్టీరియస్‌గా మాయం కావడంతో హరిదాస్‌కు అతని మీదా అనుమానం వచ్చింది. దేవాసియా అనే మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను చావక్కాడు పంపితే అక్కడ సాహూ దొరికాడు. అర్ధరాత్రి వీళ్లు వెళ్లేసరికి అతను కొచ్చిన్ వెళ్లి అక్కణ్నుంచి అబూ ధాబీకి వెళ్లే ప్రయత్నంలో వున్నాడతను. అతన్ని పట్టుకుని నాలుగు ఉతికితే మొత్తం కథంతా బయటకు వచ్చేసింది. అది ‘‘37 ఏళ్లగా దొరకని నేరస్తుడు’’ వ్యాసంలో చదవండి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)