తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. సహజంగా ఇందులో విశేషం ఏమీ లేదు కానీ, ప్రస్తుతం సెకండ్ ఇయర్ సగం చదివేసిన విద్యార్థులంతా తిరిగి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందేనని ప్రభుత్వం చెప్పడం ఒక్కటే కలకలం రేపుతోంది.
ఇప్పటి వరకూ పరీక్షలు పెట్టాలా వద్దా అని చర్చలు జరుగుతున్నా.. ఇప్పుడు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అక్టోబర్ 25 నుంచి పరీక్షలు రాయాల్సిందేనంటూ టైమ్ టేబుల్ ఫిక్స్ చేసింది.
గతంలో ఆల్ పాస్ అనగానే అందరూ సంబర పడ్డారు. ఇప్పుడు పరీక్షలంటే మళ్లీ ఫస్ట్ ఇయర్ పుస్తకాలతో కుస్తీ పట్టాలని, సెకండ్ ఇయర్ సిలబస్ పూర్తి చేయలేమని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సమయం కేటాయించలేమని విద్యార్థులు వాపోతున్నారు.
అధికారుల ఇబ్బంది ఇదీ..
కరోనా సెకండ్ ఇయర్ ప్రభావంతో పరీక్షలు నిర్వహించలేక అప్పట్లో ఇంటర్ ఆల్ పాస్ అనేశారు అధికారులు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం అంతకు ముందు ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సగటు మార్కులు ఇచ్చారు. వారంతా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వేర్వేరు కోర్సుల్లో చేరిపోయారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పాస్ చేసినా మార్కులు ఇవ్వలేదు. ఒకవేళ వీరంతా సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే సమయానికి మరోసారి కరోనా విజృంభిస్తే మార్కులివ్వడం మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెడతామంటున్నారు అధికారులు.
ఇప్పుడెందుకీ అవస్థ..
ఫస్ట్ ఇయర్ ఆల్ పాస్ అనేసరికి, సెకండ్ ఇయర్ కి ప్రమోట్ అయిన విద్యార్థులంతా సంబరపడ్డారు. అదే సమయంలో సెకండ్ ఇయర్ సిలబస్ పై దృష్టిపెట్టారు.
మరికొన్ని రోజుల్లో వారంతా ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి ఎగ్జామ్స్ కి సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఈ దశలో మళ్లీ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలనే సరికి వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇటు ఎంట్రన్స్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వలేక, అటు మరోసారి ఫస్టియర్ సిలబస్ తిప్పలేక ఇబ్బందిపడుతున్నారు.
కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. పరీక్షలు ఉంటాయంటూ నెల రోజుల నుంచే చెబుతున్న విద్యాశాఖ, ఇప్పుడిలా టైమ్ టేబుల్ ప్రకటించి పరీక్షలు రాయమంటోంది.
విద్యార్థుల బాధలు వర్ణనాతీతం
ఉన్నది 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లోనే సెకెండియర్ పూర్తిచేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేరక్ అవ్వాలి. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాయాలి. దీంతో విద్యార్థులపై విపరీతంగా ఒత్తిడి పెరిగిపోయింది.
ఒకవేళ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైతే, అలా తప్పిన సబ్జెక్టులతో కలిపి మళ్లీ సెకెండియర్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అప్పుడు అదో టెన్షన్. కానీ తప్పదు.