వైసీపీపై వ్యూహాత్మ‌క ఒత్తిడి

వైసీపీపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌కంగా ఒత్తిడి పెంచుతోంది. ఇందుకు ఈ నెల 27న రైతు సంఘాలు చేప‌ట్టిన భార‌త్ బంద్‌ను ఆయుధంగా ఎంచుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ…

వైసీపీపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌కంగా ఒత్తిడి పెంచుతోంది. ఇందుకు ఈ నెల 27న రైతు సంఘాలు చేప‌ట్టిన భార‌త్ బంద్‌ను ఆయుధంగా ఎంచుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ బంద్ మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా రైతు సంఘాలు చేప‌ట్టాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలతో స‌హా దేశ వ్యాప్తంగా ప‌లు చిన్న పార్టీలు, ప్ర‌జాసంఘాలు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పాటు ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌లో పాల్గొంటామ‌ని హెచ్చ‌రించాయి. మోడీకి వ్య‌తిరేక బంద్ కాబ‌ట్టి ఏపీ అధికార పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇదే అవ‌కాశంగా తీసుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీ కంటే వైసీపీనే రైతు వ్య‌తిరేకిగా చిత్రీక‌రించ‌డానికి దీన్ని ఉప‌యోగించుకోవాల‌ని టీడీపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇందులో భాగంగా ప‌దేప‌దే బంద్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు టీడీపీ నేత‌లు ప్ర‌క‌టిం చ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. 

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ రైతు ప్ర‌యోజ‌నాలే త‌మ పార్టీకి ప్ర‌ధాన‌మ‌న్నారు. బంద్‌లో పాల్గొన‌కుంటే రైతుల‌కు వైసీపీ వ్య‌తిరేక‌మ‌నే సందేశాన్ని పంప‌డం ఈ మాట‌ల ఉద్దేశంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలున్నాయి. 

గ‌తంలో భార‌త్ బంద్‌కు వైసీపీ సంఘీభావం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకైనా వైసీపీ త‌గిన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.