థియేట‌ర్లో విడుద‌లైనా ఓటీటీలోకి.. లేటే లేదు!

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ గా రూపొందిన 'త‌లైవి' అప్పుడే ఓటీటీలో ప్ర‌త్య‌క్షం అయ్యింది. విడుద‌లై రెండు వారాలు తిరిగే స‌రికే ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ను నెట్ ఫ్లిక్స్ లో…

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ గా రూపొందిన 'త‌లైవి' అప్పుడే ఓటీటీలో ప్ర‌త్య‌క్షం అయ్యింది. విడుద‌లై రెండు వారాలు తిరిగే స‌రికే ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ను నెట్ ఫ్లిక్స్ లో పెట్టేశారు. 

ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా క‌రోనా ప‌రిస్థితుల‌ను స‌వాల్ గా తీసుకుని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు కూడా ఫ‌ర్వాలేద‌న్న‌ట్టుగా  వ‌చ్చాయి. అయితే జ‌య‌ల‌లిత జీవితంలో ఉన్నంత చాలెంజ్ ఈ సినిమాలో లేద‌న్న‌ట్టుగా కూడా టాక్ వినిపించింది.

ఇక న‌ట‌న విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాతో కంగ‌నా క‌న్నా అర‌వింద్ స్వామి పేరు బాగా మార్మోగింది. కంగ‌నా వంటి న‌టి న‌టించిన సినిమాలో న‌ట‌న‌పై చ‌ర్చ‌లో మ‌రొక‌రి పేరు వినిపించే అవ‌కాశాలు ఉండ‌వు. అయితే ఈ సినిమాలో అర‌వింద్ స్వామి ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేకంగా నిలిచింది. 

బాలీవుడ్ రివ్యూయ‌ర్లు కూడా అర‌వింద్ ను చూస్తే ఎంజీఆర్ నే చూసిన‌ట్టుగా ఉందన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ అర‌వింద్ ను ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేశారు. దీంతో కంగ‌నా వెనుక‌బ‌డిపోయింది. ఇక థియేట‌ర్లో ఈ సినిమాను ఎంత మంది చూశారో ఏమో కానీ.. ఇంత‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. 

రెండు వారాల గ‌డువుతో నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేసేశారు. ప్ర‌స్తుతం ఇంత‌కు మించి కూడా మూవీ మేక‌ర్లు చేయ‌గ‌లిగింది లేదేమో. థియేట‌ర్ల‌లో పూర్తి స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకునే రోజులు ఇంకా రాలేదు. బాక్సాఫీస్  వ‌సూళ్ల‌పై ఆశ‌లు పెట్టుకున్న మాస్ మూవీలు వెన‌క్కు వెన‌క్కు వెళ్లిపోతున్నాయి. 

ఇలాంటి ప‌రిస్థితుల్లో పేరుకు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి త‌లైవితో ప్ర‌యోగ‌మే చేశారు. అయితే వీలైనంత త్వ‌ర‌గా ఓటీటీలో విడుద‌ల చేసేందుకు కూడా ఒప్పందం చేసుకున్న‌ట్టుగా ఉన్నారు. రెండు వారాల్లోనే కాబ‌ట్టి.. ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి ధ‌రే ప‌లికి ఉండ‌వ‌చ్చు. 

అటు ప్ర‌యోగాత్మ‌కంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో కొంత రాబ‌ట్టుకుని, వెంట‌నే ఓటీటీలో విడుద‌ల ద్వారా మెరుగైన రేటుకే అమ్ముకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా ఉన్నారు. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రిస్థితి మెరుగు ప‌డ‌క‌పోతే.. ఈ త‌ర‌హా విడుద‌ల ఒక ప్ర‌త్యామ్నాయ మార్గం అవుతుంది కాబోలు!