నీతులు చెప్పడంలో బాబాయిని అబ్బాయి మించిపోయారు. ఆ బాబాయి అచ్చెన్నాయుడు, అబ్బాయి రామ్మోహన్నాయుడు. నీతులు ఎదుటి వాళ్లకు చెప్పేందుకు తప్ప, ఆచరించడానికి కాదని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నట్టున్నారు.
నీతి, నిజాయితీలకు టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఆ పార్టీ నేతల ఉపన్యాసాలుంటాయి. తాజాగా శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ యువనేత రామ్మోహన్నాయుడు తాను బాబాయికి ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు హితవు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని ధ్వజమెత్తారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఏం అంశంపై అయినా తమ పార్టీ సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని.. ఆ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలని హితవు చెప్పడం గమనార్హం.
ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రజలకు సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని రామ్మోహన్ మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో డీజీపీ, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ఆయన ప్రశ్నించారు. గతంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన పనేంటో రామ్మోహన్నాయుడు మరిచిపోయినట్టున్నారని ప్రత్యర్థులు అంటున్నారు.
చివరికి వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీలోకి తీసుకెళ్లడంలో ఏబీ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే నందిగం సురేష్‌ను పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో అందరికీ తెలిసిందే. తమ పాలనలో మంచి సంప్రదాయాలను పాటించి వుంటే, నేడు ప్రత్యర్థులకు నీతులు చెప్పే నైతిక హక్కు ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.