పార్టీ విస్తరణ.. మరోసారి గాలికొదిలేసిన పవన్

ఎన్నికలకు రెండేళ్ల ముందు పవన్ ఫుల్ యాక్టివ్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన యాక్టివ్ అయ్యారు. అయితే జనసైనికులు అనుకున్నదొకటి, ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. ఈ రెండేళ్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం…

ఎన్నికలకు రెండేళ్ల ముందు పవన్ ఫుల్ యాక్టివ్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన యాక్టివ్ అయ్యారు. అయితే జనసైనికులు అనుకున్నదొకటి, ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. ఈ రెండేళ్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ కార్యాచరణ రచిస్తారని, ఆ మేరకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం మరోసారి పార్టీ విస్తరణను గాలికొదిలేశారు. 

రెండేళ్ల ముందు నుంచే ఆయన సీఎం కలలు కంటున్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. అసలు పని చేయకుండా, కొసరు కబుర్లు చెబుతున్నారు. ఇది పార్టీకి, పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం పనికిరాదు.

ఆప్షన్లపై ఉన్న శ్రద్ధ.. పార్టీపై పెట్టి ఉంటే..

రెండేళ్లాగితే.. అంటే సరిగ్గా 2024 ఎన్నికలనాటికి జనసేన పార్టీ వయసు పదేళ్లు. అంతకు ముందు ప్రజారాజ్యంలో పవన్ కి ఉన్న అనుభవం కూడా కలుపుకుంటే.. ఆయనకు రాజకీయ నాయకుడిగా ఇప్పటికే 14 ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఏం లాభం. ఇంకా జనసేన ఏపీలో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు. 

నాయకులెవరో, కార్యకర్తలెవరో, ఎప్పుడు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు గుడ్ బై చెప్పి పక్కకు వెళ్తారో తెలియదు. అసలు అధినాయకుడు ఎప్పుడు సభలకు వస్తారో, ఎప్పుడు షూటింగ్ లకు వెళ్తారో ఆయనకే తెలియదు.

ఇంత కన్ఫ్యూజన్ ఉన్న పార్టీ కూడా పవన్ కల్యాణ్ వీరాభిమానుల వల్ల, సోషల్ మీడియా పుణ్యమా అని జనాల్లో నానుతూ ఉంది. ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పవన్ అనుకుంటున్నారు, ప్రతిపక్ష టీడీపీ ఒక్కటే ఏమీ చేయలేదని కూడా ఆయన మధనపడుతున్నారు. అలాంటప్పుడు ఈ గ్యాప్ ని జనసేన ఎలా ఉపయోగించుకోవాలి. 

కానీ పవన్ ఏం చేస్తున్నారు. పార్టీ పెట్టి ఎనిమిదేళ్లవుతున్నా ఇంకా ఆప్షన్లు వెదుక్కుంటున్నారంటే, నన్ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించండి అంటూ వాళ్లను, వీళ్లను బతిమిలాడుకుంటున్నారంటే ఏమనుకోవాలి. పవన్ రాజకీయ అపరిపక్వతను ఎలా అర్థం చేసుకోవాలి.

అందరూ నాయకులే..

జనసేనలో అందరూ నాయకులే. పార్టీ జెండా మోసేందుకు ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ ని తీసుకొస్తారు. మిగతా వాళ్లంతా నాయకుల్లాగా స్టేజీలు ఎక్కి ఫోజు కొడుతుంటారు. అసలు సిసలైన కార్యకర్తలు లేరు, బూత్ కమిటీలు లేవు, ఎలక్షన్ ఏజెంట్లు లేరు. పార్టీ సంస్థాగత నిర్మాణం అస్సలు జరగలేదు. కనీసం ఎన్నికల వేళ అయినా పవన్ ఆ పని పూర్తి చేస్తారనే ఆశ జనసైనికుల్లో ఉంది.

2019లో సోలోగా పోటీ చేశారని చెప్పుకున్నారే కానీ, అప్పట్లో ఆ పని సగంలోనే ఆపేశారు. కనీసం ఇప్పుడైనా పార్టీపై దృష్టిపెడతారనుకుంటే.. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా ఆ ఊసేలేదు. అంటే పవన్ మరోసారి తనని తాను మోసం చేసుకోవడంతో పాటు, పార్టీ నాయకుల్ని, జనసైనికుల్ని కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారు.

ఎలాగోలా పార్టీని నడపాలంటే కేఏపాల్ లాగా ఎన్నికలప్పుడు వచ్చి హడావిడి చేసి, కామెడీగా మాట్లాడి వెళ్తే చాలు. కానీ పాల్ కి, పవన్ కి తేడా ఉందని జనసైనికులు అనుకుంటున్నారు. అలాంటప్పుడు నాయకుడికి ఎంత ఓపిక ఉండాలి, ఎన్నికల కోసం ఎలా సిద్ధమవ్వాలి. కార్యకర్తల్ని నాయకులలాగా ఎలా మార్చుకోవాలి. ఎలా రాజకీయ వ్యూహాలు పన్నాలి..? ఇవేవీ పట్టనట్టుగా పవన్ ఆప్షన్-1, ఆప్షన్-2, ఆప్షన్-3 అంటూ ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ యాంకర్ లాగా మాట్లాడుతున్నారు. 

జనసేన ఫెయిలైందంటే.. జనం అర్థం చేసుకోకపోవడం కారణం కాదు, పవన్ స్వయంకృతాపరాధమే దానికి కారణం.