ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకుని 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదని ఉపదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంపై వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరైన ఈ సమావేశంలో జగన్ కీలక ఉపన్యాసం చేశారు.
కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? అని జగన్ ప్రశ్నించారు. అలాగే కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తామని ఎవరైనా అనుకున్నామా? అని జగన్ ప్రశ్నించారు.
ఇదంతా ఎందుకు జరిగింది? ప్రజలంతా మన వైపే ఏకపక్షంగా ఎందుకున్నారు? కుప్పంలో ఏ విధంగానైతే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశామో …175కి 175 స్థానాల్లో గెలుపొందుతామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇది జరగాలంటే మనం కష్టపడాలని కోరారు. ప్రజల మద్దతుతో ఏమైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరాయన్నారు. ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో … ప్రతి అక్క చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నామన్నారు.
మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.. ప్రజా ప్రతినిధులుగా మనకు ఏం కావాలని జగన్ ప్రశ్నించారు.
పారదర్శ పాలనకు చరిత్రలో మనం ఒక ముద్ర వేశామన్నారు. పూర్తిస్థాయిలో చెప్పింది చేశామని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నట్టు జగన్ చెప్పారు. మరోసారి ప్రజల మద్దతు పొందడమే మనందరి ముందున్న ఏకైక లక్ష్యంగా జగన్ చెప్పుకొచ్చారు.
గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. దాదాపు 8 నెలల పాటు ప్రజల వద్దకే వెళ్లే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు.
ప్రతి సచివాలయం పరిధిలో కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెలలో 10 సచివాలయాల పరిధిలో నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలని మార్గనిర్దేశం చేయడం విశేషం. కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా బాధ్యతతో నిర్వర్తించడం ముఖ్యమన్నారు.