తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం (బర్డ్)లో ఆపరేషన్లకు మంగళం పాడారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం ఆపరేషన్లు బాగా చేస్తున్నారు. అలాగే ఎప్పుడో నమోదు చేసుకున్న వాళ్లకు అరకొర మోకాళ్ల ఆపరేషన్లు చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆస్పత్రి స్థాపించడం వెనుక ఉన్న ఆశయం అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వానికి ముందు బర్డ్‌లో మోకాళ్లు, తుంటి కీలు తదితర ఆర్ధోపెడిక్ సమస్యలన్నింటికి ఉచిత వైద్యం అందించేవాళ్లు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆస్పత్రిపై రోగులకు ఎంతో నమ్మకం. అలాగే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వ రుని ఆశీస్సులతో నడిచే ఆస్పత్రి కావడంతో రోగులు దేవాలయంగా భావించేవాళ్లు. ఆస్పత్రికి వెళితే తప్పక సమస్యకు పరిష్కారం చూపుతారనే విశ్వాసం ఉండేది. ఇదంతా గతం. వర్తమానంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో రోగులకు ఉచిత వైద్యం అందించడం దైవ కార్యంగా టీటీడీ భావించేది. ఇప్పుడా స్ఫూర్తి, ఆశయం ఎందుకు కొరవడ్డాయో సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.
ఆ గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయేది. దీంతో ప్రతి దానికి డబ్బు. అసలే పేదలు వెళ్లే ఆస్పత్రిని పెయిడ్ కేంద్రంగా మార్చడంతో, జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే ఈ తిప్పలనే శాపనార్థాలు తప్పడం లేదు. గతంలో రోజుకు 25 నుంచి 30 ఆపరేషన్లు ఉచితంగా చేసేవారు. నెలకు సరాసరి 250 వివిధ రకాల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు చేసేవారు. బర్డ్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పాటు డాక్టర్ జగదీష్ పని చేశారు. ఇప్పుడు బర్డ్ స్పెషల్ ఆఫీసర్‌గా డాక్టర్ రెడ్డెప్పరెడ్డి ఉన్నారు. రెడ్డో, నాయుడో ఎవరైనా… అంతిమంగా పేద రోగులకు సేవలందించాల్సిన బాధ్యత వుంది.
వైసీపీ ప్రజాప్రతినిధులు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళుతున్న సందర్భంలో చాలా వరకూ మోకాళ్ల ఆపరేషన్లు చేయించాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను రాసిస్తే, బర్డ్‌లో బుట్టదాఖలు చేస్తున్న వైనం. బర్డ్ స్పెషల్ ఆఫీసర్‌కు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మోకాలు, తుంటికీలు మార్పిడికి సంబంధించి ఉచిత ఆపరేషన్లు చేయాలని కోరుతున్నారు. అయితే టీటీడీ నిబంధనలు మార్చిన నేపథ్యంలో ఉచిత ఆపరేషన్లు చేయలేమని స్పెషల్ ఆఫీసర్ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఇప్పుడు కేవలం ప్రమాదంలో గాయపడిన వారికి, అలాగే ఏడాది రెండేళ్ల క్రితం రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు మోకాళ్ల ఆపరేషన్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మోకాళ్లు, తుంటికీలు మార్పిడి ఆపరేషన్లను పూర్తిగా డబ్బుమయం చేశారు. పోనీ డబ్బు పెట్టి చేసుకుందామన్నా… శస్త్రచికిత్సల పరికరాలు బర్డ్‌లో లేని దుస్థితి. విదేశీ, అలాగే స్వదేశీ పరికరాల ధరల్లో వ్యత్యాసం వుంది. తాము మంచి మోకాలు ఆపరేషన్‌కు మంచి పరికరమే వేయించుకుంటామని, త్వరగా చేయాలని వైద్యులను రోగులు ప్రాథేయపడుతున్నా… ఎవరూ పట్టించుకోని పరిస్థితి.
ఆపరేషన్‌కు డేట్ ఇవ్వడం, తీరా ఆ రోజు వెళితే… పరికరాలు రాలేదంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుపతి వెళితే… ఆపరేషన్ చేయకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిగుతున్న పరిస్థితి. కొందరు రోగులు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి. ఇదేమని ప్రశ్నిస్తే… పరికరాలకు సంబంధించి టెండర్ ప్రాసెస్ జరుగుతోందని బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డెప్పరెడ్డి రోగులకు చెబుతున్నారు. నిజానికి బర్డ్‌లో రోగులకు ఎదురవుతున్న ఇబ్బందులన్నింటికి టీటీడీ పాలక మండలి, ఈవో, అదనపు జేఈవోలే బాధ్యత వహించాల్సి వుంటుంది.
కానీ అంతిమంగా జగనే మూల్యం చెల్లించుకునే పరిస్థితి తలెత్తింది. చంద్రబాబు హయాంలో ఎలాంటి వివాదం, తాత్సారం లేకుండా అన్నీ ఫ్రీగా, సాఫీగా సాగేవని, ఇప్పుడు మాత్రం ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని ఎందుకు వెనక్కి పంపుతున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, గతంలో మాదిరిగానే బర్డ్‌లో ఉచిత ఆపరేషన్లు, అది కూడా త్వరితగతిన చేస్తే తప్ప, ప్రభుత్వంపై చెడ్డపేరు మాసిపోదు.