ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ మొదట్లో చెప్పేవాళ్లు. పవన్ మాట్లాడారంటే తన గురించి 80 శాతం, 20 శాతం సామాజిక సమస్యలపై ప్రస్తావన వుంటుంది. పవన్‌కల్యాణ్ ప్రశ్నించడం సంగతేమో గానీ, ఆయన ప్రశ్నార్థకంగా మారారు. అనేక సందర్భాల్లో ఆయనే ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రాజకీయంగా చంద్రబాబు మనిషని ముద్ర నుంచి ఆయన ఇప్పటికీ బయట పడలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. టెన్త్‌లో విద్యార్థుల ఫెయిల్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాడు-నేడు పేరుతో వేలాది కోట్లు ఖర్చు పెట్టారని చెబుతున్న ప్రభుత్వం, ఆ సొమ్ము ఏమైందని ఆయన నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
నాడు -నేడు కార్యక్రమం కింద పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీష్‌లో పాఠాలు చెబుతున్నామంటే సరిపోదని ఆయన ఆక్షేపించారు. నాడు -నేడుకు రూ.16 వేల కోట్లు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించుకుందని, మరి ఫలితాలు ఎందుకు ఇంత అధ్వానంగా వచ్చాయని ప్రశ్నించారు. ఆ నిధులన్నీ ఏమయ్యాయని నిలదీశారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు బోధనా సిబ్బందిని నియమించాల్సి వుండిందని తెలిపారు.
చాలీచాలని సంఖ్యలో ఉపాధ్యాయులుంటే, వారికి మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని నిర్వేదం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు టాయిలెట్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం ఫొటోలు తీయడం వంటి బాధ్యతలు అప్పగించి, విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపమే ఈనాటి ఫలితాలని పవన్ తేల్చి చెప్పడం గమనార్హం.