అధికారంలో ఉన్నప్పుడు, తమకు తిరుగులేదనే దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు కొందరు నేతలు ఆధిపత్య ధోరణని కనబరుస్తూ ఉంటారు. అందుకు నిదర్శనమే బీజేపీ నేతల హిందీ ప్రేమ! ఒకదేశం ఒక భాష అన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉన్నతీరు అనేక రాష్ట్రాల్లో విమర్శల పాలవుతూ ఉంది. దేశంలో ఎక్కువమంది హిందీలో మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే.. భారతదేశం అంటే భిన్న సంస్కృతులకు, భిన్న భాషలకు నిలయం. ఇండియాలోనే అత్యధిక భాషలున్నాయి. లిపిలేని భాషలు కూడా మనగలుగుతున్న దేశం మనది.
ప్రజలు మాట్లాడేదే భాష. నేతలు చెప్పేది, మేధావులు సూచించేది కాదు. ఎక్కడ ప్రజలు ఏ భాషలో మాట్లాడుకుంటే.. అది వారి భాష, మరో భాషను నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం వారి ఇష్టం. అది పూర్తిగా ఐచ్చికం. ఇలాంటి దేశంలో హిందీని బలవంతంగా రుద్దాలని బీజేపీవాళ్లు చూస్తున్నట్టున్నారు. అంతేజేసీ మోడీ మాతృభాష హిందీకాదు, అమిత్ షా భాష కూడా హిందీ కాదు. లిపి విషయంలో హిందీకి దగ్గరదగ్గరగా ఉండే గుజరాతీలు.. హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ వంటి రాష్ట్రంలో ఇప్పటికే నిర్బంధ హిందీ అమల్లో ఉంది. ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకూ హిందీ ఒక సబ్జెక్ట్ గా ఉంది. అందులో పాస్ అయితేనే టెన్త్ కంప్లీట్ అవుతుంది. ఈ లెక్కన నిర్బంధ హిందీ అమల్లో ఉన్నట్టే. అయితే అది ఒకందుకు మంచిదే. అదనంగా మరోభాష వస్తుంది. కానీ.. అంతటా బలవంతంగా హిందీని రుద్దడం మాత్రం సమంజసం కాదు. ఈ మాటలు అంటున్నది ఏ బీజేపీ వ్యతిరేకులో కాదు.. బీజేపీ అనుకూలురు, బీజేపీ ముఖ్యమంత్రులే ఈ మాట చెబుతూ ఉన్నారు.
కర్ణాటక సీఎం యడియూరప్ప పరోక్షంగా హిందీని రుద్దే ఆలోచనను వ్యతిరేకించారు. కర్ణాటకలో కన్నడ ఫస్ట్ అని.. ఆ తర్వాతే మరే భాష అయినా అని యడియూరప్ప ప్రకటించారు. ఇక బీజేపీ సానుకూలుడు అయిన రజనీకాంత్ కూడా తమిళనాట హిందీని రుద్దవద్దని వ్యాఖ్యానించాడు. తమిళుల్లో హిందీ వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో బీజేపీతో కలిసి రాజకీయాల్లోకి వస్తారనే అంచనాలున్న రజనీకాంత్ కూడా హిందీ వ్యతిరేకతను వ్యక్తంచేశారు.
భాష అనేది ప్రజల ఇష్టం. నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం వారి వ్యక్తిగత వ్యవహారం. ఇలాంటి విషయాల్లో నేతలు హద్దు మీరితే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు బాగాతెలుసు. ఆ విషయాన్ని కమలనాథులు గ్రహించాలి.