బాబూ.. కోడెలను అప్పుడెందుకు సమర్థించలేదు.?

'నియోజకవర్గంలో మీ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువగా వుంది. టిక్కెట్‌ విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేను..' అంటూ ఇటీవలి ఎన్నికల్లో టిక్కెట్‌ విషయమై కోడెల శివప్రసాద్‌కి చంద్రబాబు తేల్చి చెప్పేసిన వైనం, రాష్ట్ర రాజకీయ…

'నియోజకవర్గంలో మీ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువగా వుంది. టిక్కెట్‌ విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేను..' అంటూ ఇటీవలి ఎన్నికల్లో టిక్కెట్‌ విషయమై కోడెల శివప్రసాద్‌కి చంద్రబాబు తేల్చి చెప్పేసిన వైనం, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అవ్వాల్సిన వ్యక్తి, స్పీకర్‌ పదవిలో కూర్చున్నారంటే.. దానిక్కారణం టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయమే. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చి, ఆ ఫిరాయింపుల్ని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రోత్సహిస్తే.. ఆ ఘనకార్యానికి కోడెల తనవంతు సహకారం అందించాల్సి వచ్చింది.

ఇక, సత్తెనపల్లితోపాటు నర్సారావుపేట నియోజకవర్గాల్లో 'కె-ట్యాక్స్‌' గురించి అప్పటి విపక్షాలు గగ్గోలు పెట్టడం కాదు, తెలుగుదేశం పార్టీ నేతలే నానాయాగీ చేశారు. దాన్ని బూచిగా చూపి, కోడెలకు టిక్కెట్‌ విషయమై చంద్రబాబు నడిపిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఇక, అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సీరియస్‌ యాక్షన్‌కి సిద్ధమైన వేళ, చంద్రబాబు గొంతు పెగలలేదు.

కోడెల నానా తంటాలూ పడి వివరణ ఇచ్చుకున్నారు గానీ, ఆ ఫర్నిచర్‌ వ్యవహారానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతను చంద్రబాబు కనీసం కప్పిపుచ్చుకునేందుకు కూడా మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. ఇప్పుడు తాపీగా, కోడెల శివప్రసాద్‌ మరణం తర్వాత చంద్రబాబు మీడియా ముందుకొచ్చి, అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారంలో కోడెల శివప్రసాద్‌ని మానసికంగా వేదించారంటూ గగ్గోలు పెడుతున్నారు.

ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు.. పదే పదే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు అసెంబ్లీ ఫర్నిచర్‌ గురించి మాట్లాడుతోంటే, 'ఈ పని అప్పుడే చేసివుంటే, కోడెల బలవన్మరణానికి పాల్పడేవారే కాదు..' అంటూ కోడెల అనుచరులు, సన్నిహితులు వాపోవాల్సి వస్తోంది. హైద్రాబాద్‌ నుంచి అసెంబ్లీ తరలింపు నిర్ణయం చంద్రబాబుదే. ఆ ఫర్నిచర్‌ ఎటు వెళ్ళాలి.? అన్నదానిపై స్పీకర్‌ కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలూ నడిచి వుండొచ్చుగాక.. కానీ, అప్పటి ప్రభుత్వ అధినేతగా ఆ బాధ్యత చంద్రబాబుదే కదా.!  

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!