అతడే మా ధైర్యం: దక్షిణాదికి జగన్ ఆదర్శం

సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలకు మేలుకొలుపులా మారాయి. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో కేంద్రం వద్దంటున్నా ముందుకు పోవడం, పీపీఏల రద్దు విషయంలోనూ అంతే మొండిగా ఉండటం చూసి ఇతర…

సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలకు మేలుకొలుపులా మారాయి. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో కేంద్రం వద్దంటున్నా ముందుకు పోవడం, పీపీఏల రద్దు విషయంలోనూ అంతే మొండిగా ఉండటం చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధైర్యం వచ్చింది. ముఖ్యంగా పీపీఏల రద్దు విషయంలో తాము కూడా జగన్ బాటలోనే నడుస్తామంటున్నారు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని తేల్చి చెబుతున్నారు.

సంప్రదాయేతర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జగన్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. విండ్ పవర్ కోసం దుబారా చేస్తున్న వందల కోట్ల రూపాయల్ని మిగిల్చే ప్రణాళిక సిద్దం చేసి పీపీఏలను ఏకపక్షంగా రద్దుచేశారు. అయితే దీనిపై కేంద్రం రాద్ధాంతం చేస్తోంది. పీపీఏలను రద్దు చేసుకుంటే రాష్ట్రాలకు పెట్టుబడులు రావని, ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని తప్పునెట్టాలని చూసింది. అయితే జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు, విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోనని స్పష్టం చేసారు. ఇప్పుడు ఆయన ధైర్యం దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

విండ్ పవర్ తో కేంద్రం తమనెత్తిన చేతులు పెడుతోందని తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా గ్రహించాయి. ఇప్పటివరకూ వారు నోరు మెదపకపోయినా జగన్ తీసుకున్న నిర్ణయం, పైనుంచి ఒత్తిడులు వచ్చినా వెరవని తత్వంతో ఇతర రాష్ట్రాధినేతలు కూడా జగన్ బాటలో నడుస్తున్నారు. పీపీఏలను రద్దు చేసుకుంటామని కేంద్రానికి ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. థర్మల్ విద్యుత్ కి గండిపడుతోందని, దాని స్థానంలో పీపీఏల కారణంగా కచ్చితంగా తీసుకోవాల్సిన పవన విద్యుత్ కి కేంద్రం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

ఈ మేరకు ఈనెల 27వ తేదీన చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. 11 అంశాల అజెండాపై చర్చించబోతున్న దక్షిణాది రాష్ట్రాలు పవన విద్యుత్ పై నిరసన గళం వినిపించాలనే నిర్ణయానికొచ్చాయి. పవన విద్యుత్ ని కచ్చితంగా వాడాలనే నిబంధన, పీపీఏలను కొనసాగించాలనే నిబంధన రాష్ట్రాలపై పెనుభారం వేస్తోందని విమర్శిస్తున్నాయి. పవన్ విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు అవసరమైన లైన్లు వేయడానికి డిస్కమ్ లు అప్పులు చేయాల్సి వస్తోందని, వడ్డీభారం అన్నీకలిపి వినియోగదారులపైనే పడుతోందనేది రాష్ట్రాల వాదన.

చివరకు 2 రూపాయలకే యూనిట్ లభిస్తున్నా.. ముందే కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా రూ.6.04 చెల్లించి పవన విద్యుత్ ని కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ విషయాన్ని రాష్ట్రంలోని గత టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో లాలూచీపడి మరీ కొనసాగించింది. అయితే అధికారంలోకి వచ్చీరాగానే జగన్ వీటిని రద్దుచేసి కేంద్రానికి షాకిచ్చారు. రాష్ట్రంపై పెనుభారాన్ని తగ్గించారు.

జగన్ ముందు చూపుతో అలెర్ట్ అయిన దక్షిణాది రాష్ట్రాలు పవన్ విద్యుత్ కి వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కచ్చితంగా ఒప్పందాలను కొనసాగించాలనే నిబంధన పెడితే, కేంద్రమే సబ్సిడీ రూపంలో అదనపు ఖర్చును భరించాలనే కండిషన్ పెట్టబోతున్నాయి. మొత్తమ్మీద జగన్ తీసుకున్న నిర్ణయం, దక్షిణాది రాష్ట్రాల అధినేతలకు ధైర్యాన్నిచ్చింది. 

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!