విశాఖ ఏం పాపం చేసింది బాబూ..!

విశాఖలో 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకున్నామని అంటున్న చంద్రబాబు.. వైసీపీని విశాఖ వాసులు నమ్మడంలేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. సాగర నగరంపై ఎక్కడలేని ప్రేమ కురిపించారు. విశాఖ నేతలు,…

విశాఖలో 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకున్నామని అంటున్న చంద్రబాబు.. వైసీపీని విశాఖ వాసులు నమ్మడంలేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. సాగర నగరంపై ఎక్కడలేని ప్రేమ కురిపించారు. విశాఖ నేతలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి మరీ విశాఖను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. అంతా బాగానే ఉంది కానీ, అసలింతకీ ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా? మంగళగిరి పార్టీ ఆఫీస్ లో.

విశాఖపై అంత ప్రేమే ఉంటే అక్కడికే వెళ్లొచ్చు కదా. విశాఖ వెళ్లడానికి బాబుకి ఉన్న ఇబ్బంది ఏంటి..? కార్పొరేటర్లందర్నీ మంగళగిరి పిలిపించే బదులు, విశాఖపై తనకున్న ప్రేమను చాటేందుకు సాగరతీరానికి బాబు వెళ్లి రావొచ్చు కదా.

బాబు చీప్ ట్రిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన రాయలసీమ వెళ్లరు, కానీ ఆ ప్రాంతంపై ప్రేమ ఉందంటారు, కుప్పంలో చిత్తుగా ఓడిపోతారు, కానీ సీమకు న్యాయం చేసింది తానే అంటారు. విశాఖ మీద ఎక్కడలేని ప్రేమ చూపెడతారు, కానీ పరిపాలన రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఒప్పుకోడానికి మనసొప్పదు. 

కర్నూలుకి న్యాయరాజధాని రావడం బాబుకి ఇష్టంలేదు, కానీ అక్కడ ఓట్లన్నీ తనకే రావాలంటారు. బాబు  ప్రేమ అంతా అమరావతిపైనే, దాని చుట్టూ తాను తన మనుషులు కొన్న భూములపైనే. అందుకే ఆయన మూడు రాజధానులకు అడ్డు తగులుతున్నారు. అదే సమయంలో విశాఖపై ఎక్కడలేని ప్రేమ చూపెడుతున్నారు.

విశాఖలో ఎంతమంది ఉన్నారు బాబూ..?

రాష్ట్ర వ్యాప్తంగా చిత్తు చిత్తుగా ఓడిపోయిన టీడీపీ.. విశాఖ నాలుగు దిక్కుల్లో మాత్రం జెండా ఎగరేయడం విశేషం. అయితే అందులో వాసుపల్లి గణేష్ ఆల్రడీ వైసీపీ గూటికి వచ్చేశారు, గణబాబు రెడీగా ఉన్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక గంటా శ్రీనివాస్ సంగతి సరే సరి. విశాఖ ఉక్కు ఉద్యమం వంక పెట్టుకుని ఆయన రాజీనామా చేయడంతో పాటు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 

నిజంగా విశాఖలో టీడీపీకి బలం ఉంటే కార్పొరేషన్ చేజిక్కించుకోవాలి కదా. నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న విశాఖ వాసులు, ఆమాత్రం కార్పొరేషన్లో టీడీపీకి క్లీన్ స్వీప్ ఇవ్వలేరా. అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచిన కార్పొరేటర్లను కూడా నిలుపుకోలేని టీడీపీ ఇప్పుడు విశాఖలో సత్తా చూపిస్తామంటూ రంకెలేస్తోంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో బాబుకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావడంతో.. హడావిడిగా విశాఖ కార్పొరేటర్లతో సమావేశం పెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే విప్ జారీ చేసి వేటు వేస్తామని హెచ్చరించారు. విశాఖను వైసీపీ నాశనం చేసిందని, తాము చేసిన అభివృద్ధి అంతా పోయిందని చెప్పుకొచ్చారు. 

సడన్ గా విశాఖపై బాబుకి ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో ఆయనకే తెలియాలి. అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా.. మంగళగిరి నుంచి విశాఖపై ప్రేమ కురిపించాలని చూస్తున్నారు బాబు. ఇంకా నయం కార్పొరేటర్లందర్నీ హైదరాబాద్ లోని తన ఇంటికో, టీడీపీ ఆఫీస్ కో పిలిపించుకోలేదంటూ బాబుపై సెటైర్లు పడుతున్నాయి.