గత ఎన్నికల్లో సీఎం జగన్ కి వ్యతిరేకంగా పనిచేసిన రెండు ప్రముఖ న్యూస్ ఛానెళ్లు… ఇప్పుడు ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ లో చాలా మీడియా సంస్థలున్నా.. విచిత్రంగా ఆ రెండు ఛానెళ్లు తీవ్రంగా కరోనా బారినపడ్డాయి. పచ్చ పత్రిక తోడున్న ఛానెల్ కంటే.. పత్రిక సపోర్ట్ లేని ఛానెల్ లో మూడు వారాలుగా పరిస్థితి దారుణంగా ఉంది.
ఇటీవలే ఆ ఛానెల్ లో కీలక పోస్టులో ఉన్న కొంతమంది ఓ లీడింగ్ ఛానెల్ కు వలస వెళ్లారు. అదే సమయంలో కరోనా కలకలం చుట్టేసింది. దీంతో సదరు విద్వేష ఛానెల్ లో సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, ఆఫీస్ స్టాఫ్ అంతా కరోనా టెస్టింగ్ కి వెళ్లారు. వీరిలో 70శాతం మందికి పాజిటివ్ గా తేలింది. అయితే ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరలేదు. అందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పింది ఛానెల్ యాజమాన్యం.
రెండు వారాల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చూసినా ఎవరూ ముందుకు రాలేదట. దాదాపు సగం మంది ఉద్యోగానికి రావట్లేదని తెగేసి చెప్పేశారు. వీరిలో కొంతమంది జర్నలిజం ఫీల్డ్ ని వదిలేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇటు జగన్, అటు కేసీఆర్.. ఇద్దరితో సఖ్యత లేకపోవడంతో ఆ ఛానెల్ కు యాడ్ రెవెన్యూ ఆగిపోయింది. ఇప్పుడు ఉద్యోగులు కూడా చేజారిపోయారు. దీంతో అర్జంట్ గా సబ్ ఎడిటర్ల రిక్రూట్ మెంట్ మొదలు పెట్టింది సదరు ఛానెల్.
టీడీపీ భావజాలం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తామంటున్నారు. వైసీపీని విమర్శిస్తూ వార్తలు రాసేవాళ్లు కావాలని ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో వారికి ఎవరూ దొరకడంలేదు. మరీ ముఖ్యంగా ఆ ఛానెల్ సంగతి తెలిసిన వాళ్లెవరూ అటువైపు చూడడం లేదు.
వాస్తవానికి న్యూస్ ఛానెళ్లు కొన్నాళ్లుగా రాతగాళ్ల కొరత ఎదుర్కొంటున్నాయి. ఏపీలో పంచాయతీ సెక్రటరీస్ రిక్రూట్ మెంట్ జరిగాక చాలామంది సబ్ ఎడిటర్లు ఛానెళ్లలో ఉద్యోగం వదిలేసి సచివాలయ పోస్టుల్లో చేరిపోయారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో వారి కొరత మరింత పెరిగింది. దీంతో వైసీపీని విమర్శించే రెండు ఛానెళ్లు ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్నాయి.
లాక్ డౌన్ టైమ్ లో కాస్ట్ కటింగ్ పేరిట చాలామంది ఉద్యోగులకు పొగబెట్టిన యాజమాన్యాలు.. ఇప్పుడు అసలుకే మోసం వచ్చేసరికి బేలచూపులు చూస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాసేవాళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. బహుశా.. టీడీపీ ఆఫీసుల్లో వెదికితే వాళ్లకు కావాల్సిన వ్యక్తులు దొరుకుతారేమో.