అంతా సినీ పక్కీలో జరిగిపోయింది. ఢిల్లీలో కోర్టు ఆవరణలో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్ కాల్ఫులకు తెగబడడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఎప్పట్లాగే ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207 వద్ద కక్షిదారులు, న్యాయవాదులతో హడావుడి నెలకుంది. ఓ కేసు విషయంలో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర కోర్టుకు వచ్చారు. గ్యాంగ్‌ల మధ్య గొడవల నేపథ్యంలో జితేంద్ర రాకపోకలపై ప్రత్యర్థులు నిఘా వేసి వుంచారు. జితేంద్రను అంతమొందించాలనే కుట్రకు ఢిల్లీ రోహిణి కోర్డు ఆవరణే సరైందని అతని ప్రత్యర్థులు పథకం రచించారు.
కొందరు లాయర్ దుస్తులు ధరించి జితేంద్రను వెంబడించారు. కోర్టు ఆవరణలో జితేంద్రపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టార్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఇదిలా వుండగా దుండగులపై పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు వార్తలొస్తున్నాయి.
గ్యాంగ్‌స్టర్ జితేంద్ర వయసు 30 ఏళ్లు. గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యాడు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేంద్రపై ఉన్నాయి. నేర సామ్రాజ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. సమగ్ర దర్యాప్తులో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.