టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సమాజంలో మహిళలను సమానంగా చూడకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు.
వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ చట్టం యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారన్నారు. కేవలం 21 రోజుల్లోనే నిందితులకు శిక్ష పడుతోందని ఆమె చెప్పుకొచ్చారు. దిశా లాంటి చట్టాలను హేళన చేస్తూ చట్టాల ప్రతులను తగలబెడుతూ లోకేశ్ ఉన్మాదులకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. మొబైల్‌లో దిశా యాప్ ఉంటే మహిళలకు అరచేతిలో వజ్రాయుధం ఉన్నట్లే అని ఆమె అన్నారు.
నెల్లూరులో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయమన్నారు. రమ్య ఘటనలో వారం రోజుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందని, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం న్యాయం చేశామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇదిలా వుండగా మహిళలపై దాడులకు పాల్పడిన వాళ్లకు శిక్షల కంటే, అవి జరగకుండానే తగిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం నుంచి డిమాండ్ వస్తోంది.
మహిళలపై దాడులు జరిగినప్పుడు రాజకీయ విమర్శలు కాకుండా సమస్య పరిష్కారానికి ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాల నుంచి సానుకూల స్పందన రావాలని ప్రజానీకం కోరుకుంటోంది. ఆ దిశగా మహిళా కమిషన్ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.