ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు మహా అయితే ఇంకో ఏడాది దూరంలో ఉన్నాయి. పార్టీలు అన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సన్నద్ధం అవుతూ ఉన్నాయి. తమ నాయకులకు రకరకాల బాధ్యతలను అప్పగిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడానికి పార్టీలు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటున్నాయి. ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని భారతీయ జనతా పార్టీ కూడా.. సింగిల్ గా బరిలోకి దిగి తొడకొడతాం అనే నినాదంతో.. తన పాట్లు తాను పడుతోంది. జనసేన కూడా అలాంటి ప్రయత్నాలలో ఉంది.
కానీ ఏ పార్టీలో అయినా సరే.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలతో కలుస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతూ వారిని ముందుకు నడిపించడానికి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తరహా బాధ్యతను పంచుకోవాలి. సరిగ్గా ఈ అంశం దగ్గరే జనసేన బలహీనత బయటపడుతోంది. బాధ్యతలను పంచుకోవడానికి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎందరు? ఎంత గట్టిగా లెక్క వేసినా ఇద్దరే నాయకుడు లెక్క తేలుతారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.
అప్పుడప్పుడు వేదికల మీద కూర్చోవడానికి మూడో వ్యక్తి లాగా నాగబాబు కూడా ఉపయోగపడతాడు గాని ఆయన ఆటలో అరటిపండు. ఏదో యూట్యూబ్ వీడియోలతో రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి తప్ప.. ప్రజల్లోకి వెళ్లి తరచుగా పని చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడరు. పవన్ కళ్యాణ్ కు షూటింగుల మధ్యలో విరామం వస్తే తప్ప.. ప్రజల వద్దకు వెళ్లలేరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ భారాన్ని మొత్తం నాదెండ్ల మనోహర్ ఒక్కడే తన భుజస్కందాలపై మోయాల్సి వస్తోంది. వేరే ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్క నాదెండ్ల మనోహర్ మీదనే పూర్తిగా ఆధారపడి పవన్ కళ్యాణ్ మరియు ఆయన జనసేన పార్టీ మనుగడ సాగిస్తున్నాయి.
జనసేన పార్టీ పరిణామాలను కాస్త దగ్గరినుంచి గమనించినప్పుడు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందంటే.. పార్టీ బాధ్యతలను మొత్తం నాదెండ్ల మనోహర్ భుజస్కంధాల మీద పెట్టేసి.. ఆయన చేతులమీదుగానే సమస్తం నడిపిస్తున్నారా? అనిపిస్తుంది.అవసరమైన సందర్భాల్లో పార్టీ శ్రేణుల్లో కాస్త మూడ్ నింపడానికి మాత్రం పవన్ కల్యాణ్ తెరమీదకు వస్తారు. తతిమ్మా అన్ని సందర్భాల్లో వ్యవహారాలు మొత్తం నాదెండ్ల చూసుకోవాల్సిందే. ఎంత సీరియస్ విషయాలు అయినా.. పవన్ కల్యాణ్ ఆయన మీద వదలిపెడుతున్నారు.
నాదెండ్ల మనోహర్ మీద పడుతున్న భారాన్ని పంచుకోడానికి కూడా మరో వ్యక్తి ఉండడం లేదు. మూడో నాయకుడే లేని పార్టీగానే జనసేన ఇప్పటిదాకా ఎనిమిదేళ్ల ప్రస్థానంలో చెలామణీ అయిపోతోందని అందరూ అనుకుంటున్నారు.