Advertisement

Advertisement


Home > Politics - Opinion

పార్టీకి సమాధి కట్టనున్న నినాదం లాస్ట్ ఛాన్స్

పార్టీకి సమాధి కట్టనున్న నినాదం లాస్ట్ ఛాన్స్

'లాస్ట్ ఛాన్స్' అనే మాట తురుపు ముక్కలాగా తనకు లైఫ్ ఇస్తుందని చంద్రబాబు నాయుడు భ్రమపడుతున్నారు. వాస్తవంలో అదే మాట.. ఆయనకు, తెలుగుదేశం పార్టీకి కూడా ఆత్మహత్యాసదృశం కానుంది!

వార్దక్యం ముదిరిపోయి.. ఐదేళ్లు పరిపాలన సాగించలేని స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడుకు.. ఇప్పుడు లాస్ట్ చాన్స్ గా అధికారం అప్పగించినా సరే.. ఆయన మధ్యలోనే వదిలేసి కొడుకును, సింహాసనంపై కూర్చోపెడతారనేది ప్రజల అనుమానం, భయం! నారా లోకేష్ అసమర్ధత, అజ్ఞానం, అపరిపక్వత గురించి బాగా తెలిసిన తెలివైన ప్రజలు చంద్రబాబు నాయుడు ఎత్తుగడలకు లొంగుతారా? అసాధ్యం!!. 'లాస్ట్ ఛాన్స్' అనడం ద్వారా ఆయన మనోగతాన్ని తెలుసుకున్న ప్రజలు, ఈ ఎన్నికలలోనే తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టే అవకాశం ఎక్కువ!!. 'ఒక్క ఛాన్స్' అనే నినాదం జగన్ ను అధికారంలోకి తెచ్చినట్టుగా.. 'లాస్ట్ ఛాన్స్' అనేది తనకు లాభిస్తుందని చంద్రబాబు ఊహించారేమో గానీ.. పప్పులో కాలేశారు. అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు.

చంద్రబాబునాయుడుకు ముసలితనం వచ్చేసింది. ఇప్పటికీ ఆయన నాతో పాటూ నడవండి చూద్దాం.. అంటూ తన ఫిట్ నెస్ ప్రదర్శనకోసం రాజకీయ ప్రత్యర్థులకు సవాలు విసురుతుంటారు. నిజమే, ఆయన ఎంతో మంచి ఫిట్ నెస్ తోనే ఉన్నారు.  కానీ ఆయనకు ముసలితనం వచ్చేసింది. ఆ రావడం కూడా.. హఠాత్తుగా ఉన్నపళాన వచ్చేసింది. నిన్నటిదాకా ఆయన డెబ్భయి రెండేళ్ల నవయువకుడు. ఆయన ఆలోచనలు యువకుడిలాగానే ఉండేవి. పోరాట పటిమ ఉండేది. యవ్వనం ఆయనలో తొణికిసలాడుతూ ఉండేది. ఇవాళ, రాత్రికి రాత్రే ముసలివాడైపోయారు. ఆలోచనల్లో ముసలితనం, మాటల్లో బేలతనం వచ్చాయి. నాకిది లాస్ట్ ఛాన్స్. చివరి ఎన్నికలు.. అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎన్ని ఏళ్లు గడిచిపోయాయనేది కాదు.. ఎప్పుడైతే ఒక మనిషి మాటల్లో బేలతనం వస్తుందో, అదే అసలైన వార్ధక్యం. అందుకే, చంద్రబాబునాయుడులో ముసలితనం వచ్చేసిందని తొలిసారిగా అనిపిస్తోంది. 

మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఒక నాయకుడు ప్రజల అభిమానాన్ని, ఆదరణను, ఓట్లను చూరగొని పదవిలోకి, అధికారంలోకి రావడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి– తన సమర్థత గురించి ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడం. రెండు– ప్రజల్లో జాలి, సానుభూతిని నిర్మించండం ద్వారా వారి ఓట్లను పొందడం, గెలవడం! ఒకటో మార్గాన్ని నమ్ముకున్న వారికి కెరీర్ సుస్థిరంగా ఉంటుంది. రెండో మార్గాన్ని నమ్ముకున్న వారికి ఒకటిరెండు ఫలితాలు సానుకూలంగా ఉండవచ్చు. కానీ, వారి ప్రతిభను నిరూపించుకోలేకపోతే.. నెమ్మదిగా కనుమరుగైపోతారు. సానుభూతి అనేది కలకాలం కాపాడే కవచం కాదు. ఇందుకు మన తెలుగునాట కళ్లెదురుగా అనేకానేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఎంతో లబ్ధప్రతిష్ఠుడైన నాయకుడు హఠాన్మరణానికి గురైతే.. వారసత్వంగా ఉపఎన్నిక బరిలోకి దిగి సభల్లోకి వచ్చిన చాలా కుటుంబాలు.. తర్వాతి రోజుల్లో అసలు రాజకీయ యవనికపై లేనేలేకుండాపోయాయి. ఇందుకు పీవీ నరసింహారావు, బాలయోగి, కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి అనేక కుటుంబాలను మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. జాలి, సానుభూతి కలకాలం నిలబెట్టవు. ఎంట్రీకి ఉపయోగపడతాయంతే. 

ఇప్పుడు చంద్రబాబునాయుడు విషయంలో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. నలభై నాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ కెరీర్ తరువాత.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తర్వాత.. నేషనల్ ఫ్రంట్ సారధిగా కూడా ఒకసారి చక్రం తిప్పిన తరువాత.. ఇప్పుడు.. ఆయన అత్యంత హేయమైన రీతిలో మళ్లీ జాలి, సానుభూతి మీద ఆధారపడి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఇంతకంటె చిత్రమైన సంగతి ఇంకొకటి ఉండదు.

దేబిరించే బీద పలుకులు కరక్టేనా?

ఒక ఆటను ఊహించుకోండి. ఇంకొక్క చాన్స్ ఇవ్వమని, లాస్ట్ చాన్స్ ఇవ్వమని అడిగేవాడు ఎలా ఉంటాడు. అప్పటికే ‘వాడిలోని ఆట’ అంతరించిపోయిఉంటుంది. కానీ, ఆట ఆడాలనే కాంక్షమాత్రం చావదు. ఒకప్పట్లో మంచి ఆటగాడే అయి ఉండొచ్చు. కానీ.. నవతరం దూసుకొచ్చేస్తుండగా.. నాకింకా ఒక్కచాన్స్ ఇవ్వండి.. లాస్ట్ చాన్స్ ఇవ్వండి అని చాలా లేకిగా ఉంటుంది. ఆ సంగతిని చంద్రబాబునాయుడు తప్ప అందరూ గుర్తిస్తున్నారు. ఆయనలోని పదవీలాలసత, ఆశ.. తన అభ్యర్థనలోని లేకితనాన్ని గుర్తించకుండా అడ్డం పడుతోంది. 

చంద్రబాబునాయుడు ఏనాడైతే.. సభలో తన భార్యను  పలుచన చేసి మాట్లాడారంటూ.. ప్రజల సానుభూతిని పొందడానికి ఊరూరా తిరిగి ఆ టాపిక్ తెచ్చి ప్రసంగాలు దంచాడో.. ఆనాడే దిగజారిపోయాడు. సుదీర్ఘకాలం ఆ ఒక్క డైలాగును పట్టుకుని ప్రజల జాలి, సానుభూతి పొందాలని ట్రై చేశారు. కానీ.. అదొక్కటీ వర్కవుట్ కాదని ఆయనకు క్లారిటీ వచ్చింది. ఆయన ఏడుపులో నిజాయితీ లేదని ప్రజలు గుర్తించారు. ఆ ఏడుపుకు ప్రజల్లో వేల్యూ లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే తాజాగా లాస్ట్ చాన్స్ అనే అస్త్రం బయటకు తీశారు. 

ఇది చివరి అవకాశం, లాస్ట్ చాన్స్ ఇవ్వండి అనే మాటల అర్థమే ఆయన బేలతనాన్ని చాటేది. ప్రజలకు జాలి పుట్టి ఇవ్వడానికి ఇది విరాళం కాదు కదా! రాబోయే అయిదేళ్ల అధికారం. ఇప్పుడే ఇలా ముసలి మాటలు మాట్లాడుతూ.. లాస్ట్ చాన్స్ అంటున్న వ్యక్తి.. అయిదేళ్ల పాటూ అసలు ఏం చేయగలడు? ఏమైనా చేయగల సత్తా, శ్రద్ధ ఆయనలో ఉంటాయా లేదా? అనే ఆలోచన ప్రజలకు కలిగితే మొదటికే మోసం వస్తుంది. మూడు సార్లు అధికారం వెలగబెట్టి.. ఏమీ చేయలేని వాడు.. కొత్తగా ఈ ముదిమిలో లాస్ట్ చాన్స్ పుచ్చుకుని చేయబోయేది ఏముంటుంది? అనే సంశయం ప్రజల్లో మెదలితే ఆయన ఏం సమాధానం చెప్తారు? 

చంద్రబాబుకు లాస్ట్ చాన్స్ ఇవ్వడం మంచిదా.. ఒక్క చాన్స్ అడిగి ప్రూవ్ చేసుకున్న జగన్ కు మలి చాన్స్ ఇవ్వడం మంచిదా.. ఆటలో అరటిపండులాగా ఎంట్రీ ఇచ్చి, నాక్కూడా ఒక చాన్స్ అని మారాం చేస్తున్న పవన్ కల్యాణ్ కు ఇవ్వడం మంచిదా అని జనం బేరీజు వేసుకుంటే చంద్రబాబు ఏమైపోతారు?

వ్యతిరేక ప్రచారాలకు ఆస్కారం

‘‘లాస్ట్ చాన్స్ అని తనే అంటున్నాడు.. మళ్లీ ఓట్లకోసం మీ మొహం కూడా చూడడు.. ఇప్పుడు అధికారం ఇచ్చారంటే.. దొరికిన కాడికి రాష్ట్రం మొత్తాన్నీ సమూలంగా దోచేసుకుంటాడు.. మొత్తం దుకాణం సర్దేస్తాడు..’’ అనే వ్యతిరేక ప్రచారానికి స్వయంగా చంద్రబాబునాయుడు ఆస్కారం కల్పించారు.  అవినీతి మరిగిన అధికారి రిటైర్ కావడానికి కాస్త ముందు అవకాశం ఉన్నంత దండుకోడానికే చూస్తాడు. మరికొన్నాళ్లలో ఈ దండుకునే అవకాశమే దూరమైపోతుందనే భయం అతనిలో విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తుంది. చాలా సహజమైన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతం దృష్టికోణంలోంచి ప్రజలు చంద్రబాబు కోరికను గమనిస్తే ఏమవుతుంది?

నిస్సందేహంగా ఇది చివరిసారిగా దండుకోవడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ అని రాజకీయ ప్రత్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగించే అవకాశం పెరుగుతుంది. చంద్రబాబు ఆ ప్రచారాన్ని ఏ రకంగానూ అడ్డుకోలేరు. తాను లాస్ట్ చాన్స్ అడిగిన మాట వాస్తవం గనుక!

పుత్రవాత్సల్యమే శాపం..

చంద్రబాబునాయుడుకు ఇవి చివరి ఎన్నికలు అవునో కాదో గానీ.. ఆయన కొడుకు రాజకీయ కెరీర్ కు మాత్రం చిట్టచివరి ఎన్నికలు! ఇప్పుడు గనుక.. అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే.. మరో ముప్ఫయ్యేళ్ల పాటు తిరుగుండదు అని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అంచనా వేస్తున్నారో.. అదే తీరుగా, ఇప్పుడు గనుక అధికారంలోకి రాకపోతే నారా లోకేష్ రాజకీయ కెరీర్ సంపూర్ణంగా సమాధి అయిపోతుందనే విశ్వాసం ఆ పార్టీలోనూ ఉంది. నిజానికి చంద్రబాబునాయుడు అసలు ఆందోళన కూడా అదే.  వర్తమాన రాజకీయ ప్రపంచంలో అత్యంత అసమర్థ, అజ్ఞాన నేతగా గుర్తింపు తెచ్చుకున్న నారా లోకేష్ ను.. తన వారసుడిగా పట్టాభిషేకానికి అర్హుడిగా బిల్డప్ ఇవ్వడానికే.. గత ప్రభుత్వహయాంలోనే ఆయనను దొడ్డిదారిలో మంత్రిని చేశారు. పేరుకు మంత్రి అయ్యాడే తప్ప.. తన సమర్థతను నిరూపించుకోలేకపోయాడు. 

ఇప్పుడు ఇవి చివరి ఎన్నికలు అంటున్న చంద్రబాబునాయుడు.. గద్దె ఎక్కితే ఏం చేస్తారు? గద్దె దిగేలోగా కొడుకును ముఖ్యమంత్రి పదవికి తయారుగా తీర్చిదిద్దడం ఆయన మొదటి కర్తవ్యంగా భావిస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాజధాని, ఆయన చెబుతున్న ప్రజాప్రయోజనాలు ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే.. ఎటూ తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ స్వయంగా చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు గనుక.. మళ్లీ పోటీచేసే ఓపిక గానీ శక్తిగానీ ఆయనలో లేవు గనుక.. అధికారం దక్కడం అంటూ జరిగితే.. ఈ అయిదేళ్ల పదవీకాలం ముగిసేలోగా.. తన వారసుడిగా లోకేష్ ను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టేసి.. తాను కొన్నాళ్లు మార్గదర్శనం చేసి పక్కకు తప్పుకుంటానని ఆయన చివరి సంవత్సరంలో ప్రకటించినా ఆశ్చర్యం లేదు. లోకేష్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రే అయితే గనుక.. రాష్ట్రంగానీ, పార్టీ గానీ ఏమవుతుందో చెప్పనక్కర్లేదు. చంద్రబాబుకు లాస్ట్ చాన్స్ ఇస్తే, రాష్ట్రం ఆయన చేతిలో ఉండదని, పుత్రరత్నం డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా చెలరేగడం మొదలవుతుందని, అయిదేళ్లు ముగిసేలోగా అధికారం లాక్కోవడమూ జరుగుతుందనే భావన ప్రజలకు వస్తే.. తెలుగుదేశాన్ని దారుణంగా తిప్పి కొడతారు.

పార్టీకి కూడా నష్టమే. తెలుగుదేశం అనేది చంద్రబాబునాయుడు రెక్కల కష్టం మీద నిర్మాణం అయిన పార్టీ ఏం కాదు. ఆ పార్టీ సర్వాధినేతగా ఆయన పరిస్థితుల్ని మానిప్యులేట్ చేస్తూ.. ఇన్ని దశాబ్దాలుగా లాక్కొస్తున్నారు. అంతో ఇంతో ఆయనకు మాజీ సీఎంగా ఒక ఇమేజి ఉన్నది గనుక.. పార్టీలో ఆయనంటే గిట్టని అనేకమంది సీనియర్లు కూడా ఆయనను ఖాతరు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా, నా పని అయిపోయింది, ఇదే లాస్ట్ చాన్స్, ఇక రిటైర్మెంటే మిగిలింది.. అంటూ బేలపలుకులు పలుకుతోంటే.. పార్టీలోని సీనియర్ల మనోగతం ఎలా ఉంటుంది. లోకేష్ వంటి అసమర్థ నేత అజమాయిషీలో పని చేయడానికి వారు సిద్ధంగా ఉంటారా? పార్టీ ముక్కలు చెక్కలు కాకుండా ఉంటుందా? ఆయనే బేరీజు వేసుకోవాలి. 

ఏ రకంగా చూసినా సరే.. అటు ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రావడానికి గానీ, పార్టీని ఐక్యంగా బలంగా ఉంచడానికి గానీ.. ‘లాస్ట్ చాన్స్’ అనే చంద్రబాబు మాట.. యూజ్ లెస్ నినాదంగా కనిపిస్తోంది. అంతమాత్రమే కాదు.. నెగ్గడం సంగతి తర్వాత.. పార్టీని సమాధి చేయడానికి బాటలు తీర్చే విధంగా కనిపిస్తోంది. రిటైర్మెంట్ ప్రకటిస్తారో లేదో గానీ.. ఈ మాట తాలూకు దుష్పపరిణామాన్ని మాత్రం చంద్రబాబు స్వయంగా చూస్తారు.

వివేచన లేకపోయెనే..

పరుగు ఆపడం ఒక కళ. ‘ఇది లాస్ట్ ఇన్నింగ్స్’ అనే భావన కలిగినప్పుడు.. అంతకు ముందు విజయం దగ్గరే ఆట ఆపేయాలి. ఆ వ్యక్తిత్వశోభ అందరికీ అబ్బే లక్షణం కాదు. చంద్రబాబునాయుడు వంటి పదవీలాలసుడైన నాయకుడికి అసలు అబ్బదు. ఒకసారి ఇది నా చివరి ఆట అని ప్రకటించిన తర్వాత.. పేలవమైన ప్రదర్శనలతో ముగించినవాళ్లు మన కళ్లముందు ఎందరో ఉన్నారు! బెన్ జాన్సన్ చివరిరన్ ఎంత పేలవమైనది? సచిన్ టెండూల్కర్ చివరి ఇన్నింగ్స్ లో ఎంత స్కోర్ చేశాడు? రోజర్ ఫెదరర్ చివరి గ్రాండ్‌శ్లామ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేశాడు? ఇవన్నీ మన కళ్ల ముందు కదలాడుతాయి. ఒకసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిన తర్వాత.. అదివరకటి విజయాన్ని నెమరువేసుకుంటూ.. దానిని ప్రకటిస్తే.. ప్రజలు అంతే హీరోగా ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుంటారు. అలా కాకుండా.. మనసులోకి రిటైర్మెంట్ అనే ముసలి ఆలోచనను పెట్టుకుని.. చివరి ఆట ఆడుతా అని బరిలోకి దిగితే.. పరాజయమూ, పరాభవ భారంతోనే నిష్క్రమించాల్సి వస్తుంది. 

ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి. రిటైర్ కాదలచుకుంటే తక్షణం అయిపోవాలి. బరిలో నిలవదలచుకుంటే.. నిన్నటి చంద్రబాబులాగా పూర్తి పోరాట పటిమతోనే ఆట కొనసాగించాలి. అంతేతప్ప.. నాకిది చివరి అవకాశం అంటూ బేలపలుకులతో ఆడాలనుకుంటే.. ఆట రక్తికట్టదు!

.. ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?