ఈ ఒక్క దఫా టీడీపీని ఓడిస్తే… మరో మూడు దశాబ్దాల పాటు అధికారంలో తానే వుంటానన్న జగన్ కల కంటున్నారు. కల కనడాన్ని ఎవరూ తప్పు పట్టారు. ఇదే సందర్భంలో టీడీపీని పతనం చేస్తే…ప్రమాదాన్ని జగన్ కొని తెచ్చుకున్నట్టే. ఈ కఠిన వాస్తవాన్ని జగన్ గ్రహించాల్సి వుంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలను చూసి జగన్ గుణపాఠం నేర్చుకోవాల్సింది ఇదే. తాజాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వున్న టీడీపీని వైసీపీ భూతంగా చూస్తోంది.
టీడీపీని అడ్డు తొలగించుకుంటే ఏపీలో ఇక తమకు తిరుగే లేదని జగన్‌తో పాటు వైసీపీ నేతలు కలలు కంటున్నారు. రాజకీయాల్లో అలా ఎప్పటికీ జరగదు. రాజకీయాల్లో ఖాళీని భర్తీ చేయడానికి ఏదో ఒక పార్టీ సిద్ధంగా వుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను లేకుండా చేస్తే ఇక తనకు అడ్డమే వుండదని కేసీఆర్ భావించారు. అందుకే ఆ మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తన పార్టీలో కలిపేసుకున్నారు.
అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. బీజేపీ రూపంలో అతి పెద్ద ప్రత్యామ్నాయం దూసుకొస్తోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని తట్టుకోవడం టీఆర్ఎస్‌కు అంత సులువు కాదు. 2018లో కేవలం ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గెలుపొందారు. ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి తెలంగాణలో ఎంపీలు కూడా వున్నారు. స్వయంగా కేసీఆర్ తనయ కవితను ఓడించిన ఎంపీ అర్వింద్‌తో తాజా వివాదం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీని పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటే వైసీపీ తన గోతిని తానే తవ్వుకున్నట్టే. టీడీపీతో పాటు జనసేన నేతల్ని మరీ టెర్రరైజ్ చేస్తూ, ఆత్మరక్షణ కోసం బీజేపీని ఆశ్రయించే పరిస్థితిని వైసీపీ ఇప్పటికైనా సృష్టించకపోతే మంచిది. చంద్రబాబుకు రానున్న ఎన్నికలు లాస్ట్ చాన్స్ కావచ్చు. కానీ టీడీపీకి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీపై వుంది. ఎందుకంటే టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ వుంటే, అధికారం ఆ రెండు పార్టీలూ అటూఇటూ మార్చుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఏదైనా కారణంతో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మాత్రం… ఇక ఆ పార్టీని ఓడించడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని వైసీపీ, టీడీపీ నేతలు గ్రహించాల్సి వుంటుంది. అందుకు తగ్గట్టు రాజకీయాలు చేస్తే మంచిది. కాదు, కూడదని ప్రాంతీయ పార్టీలు పరస్పరం అంతం చేసుకునే వికృత క్రీడకు తెగబడితే… మరణ శాసనం తమకు తామే రాసుకున్నట్టే.