తనకీ ఎన్నికలు లాస్ట్ చాన్స్ అని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. లాస్ట్ చాన్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సానుభూతి పొందే క్రమంలో చంద్రబాబు అన్న మాటలు భూమరాంగ్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు “లాస్ట్ చాన్స్”ను పట్టుకుని వైసీపీ చెడుగుడు ఆడుకుంటోంది. ఇదిలా వుండగా చంద్రబాబుకు వయసు పైబడుతున్న రీత్యా… రానున్న ఎన్నికలు చివరివి అని చెప్పక తప్పదు.
సహజంగా జీవితంలో చివరి రోజుల్లో తమ తప్పులకు పశ్చాత్తాపం చెందుతుంటారు. అంత వరకూ శత్రువులుగా భావించిన వాళ్లకు, అలాగే తెలిసోతెలియకో తమ వల్ల నష్టపోయిన వాళ్లకు క్షమాపణలు చెబుతుంటారు. ఇవన్నీ ఎందుకంటే… మనిషిగా ఈ భూమ్మీద పుట్టడం అదృష్టంగా భావిస్తూ, ఇదే సందర్భంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా మనశ్శాంతిగా చివరి మజిలీ ముగించాలనే కోరికతోనే.
ఎటూ చంద్రబాబు కూడా రాజకీయాల్లో తనకు లాస్ట్ చాన్స్ అని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబుది ప్రత్యేక పంథా. ఆయనదంతా వెన్నుపోటు రాజకీయ చరిత్ర అనే పేరు సంపాదించుకున్నారు. రాజకీయాలు ఎలా చేయాలన్నది చంద్రబాబు ఇష్టం. దాని వల్ల వచ్చే మంచీచెడూ ఆయనే భరించాల్సి వుంటుంది.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఎంతగానో నమ్మి ఆదరించిన ప్రతి నాయకుడికి బాబు వెన్నుపోటు పొడిచారని చెబుతుంటారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి, దివంగత మాజీ ఎంపీ రాజగోపాల్‌నాయుడు మొదలుకుని, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ వరకూ ఏ ఒక్కర్నీ చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా విడిచిపెట్టలేదనేది నిజం.
అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్లకు చేసిన ద్రోహం గురించి అందరికీ తెలిసిందే. ఇక పార్టీ ఫిరాయింపులు, ఎన్నికల్లో డబ్బు సంస్కృతి, పార్టీ ఫిరాయింపులను పతాక స్థాయికి దిగజార్చిన చరిత్ర చంద్రబాబుదే అని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఇక వ్యవస్థల్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించడంలో చంద్రబాబుకు మరెవరూ సాటిరారనేది జగమెరిగిన సత్యం.
నాలుగు దశాబ్దాలకు పైబడి తన రాజకీయ ప్రస్థానంలో చేసిన ఘోర తప్పిదాల గురించి కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాబు చేసిన ఘోరాలు, నేరాలను గురించి చెప్పుకున్నా పోయేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రాజకీయంగా చివరి రోజుల్లో ఉన్నానని చెబుతున్న చంద్రబాబు… కనీసం ఇప్పుడైనా నేరాలకు ప్రాయశ్చితంగా ఏదో ఒక ప్రకటన చేస్తే బాగుంటుందనేది జనాభిప్రాయం. ప్రజాకోర్టులో నిలిచి… తన తప్పులకు క్షమాపణ చెప్పేందుకు బాబుకిదే లాస్ట్ చాన్స్. అపరాధన భావంతో రాజకీయాలతో పాటు వ్యక్తిగత జీవితం నుంచి నిష్క్రమించకూడదని అనుకుంటే చంద్రబాబుకు ఇంతకంటే మంచి సమయం దొరకదు. తప్పులకు క్షమాపణ కోరి మనసు నుంచి భారాన్ని దించుకునేందుకు బాబుకిదే లాస్ట్ చాన్స్.