మనిషుల్లో శాడిస్టులకూ, సైకో పాత్ లకూ లోటేమీ లేదు. ప్రత్యేకించి తమ మాట చెల్లుబాటు అయ్యే తరుణంలో మనిషి వీలైనంత శాడిస్ట్ గా, సైకో పాత్ గా మారతాడు. ప్రతి మనిషీలోనూ ఎంతో కొంత శాడిజం ఉంటుందనేది పరిశోధకులు చెప్పే మాటే. ఇది ఒక్కోరిలో ఒక్కో డిగ్రీలో, ఒక్కో విషయంలో ఉండవచ్చు! అలాగని ప్రపంచమంతా శాడిస్టులతో నిండిపోలేదు.
చిన్న పిల్లలపై, కట్టుకున్న వాళ్లపై అఘాయిత్యాలను చేసే వాళ్లు శాడిస్టులు, సైకో పాత్ లే. అలాగే అకారణంగా హింసించే గుణం, అది ఏ మనిషినో, జంతువునో కూడా కావొచ్చు. అలాంటి స్పందనలు కూడా శాడిజానికి ప్రతీకలే. మనుషులను చంపడం, హింసిండం, బంధించి కృతకంగా వ్యవహరించడం.. ఇలాంటి శాడిస్టిక్ సంఘనటలు బోలెడన్ని వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
లాక్ డౌన్ సమయంలో.. తెలంగాణలోని ఒక పల్లెటూళ్లో బావిలో ఆరేడు మంది మృతదేహాలు బయటకు వచ్చిన వార్త ఒళ్లు గగుర్పొడిచింది. ఏదో కారణం గురించిన గొడవలో తినే అన్నంలో మత్తు మందు కలిపి ఒకరి తర్వాత మరొకరిని బావిలో పడేశాడో దుర్మార్గుడు. వారి మరణానికి కారణాల గురించి పోలీసులు ఎంతో పరిశోధిస్తే కానీ అసలు సంగతి బయటకు రాలేదు.
ఇలాంటి శాడిస్టిక్ కిల్లింగ్ సంఘటనల గురించి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి హాలీవుడ్ సినిమాల్లోనూ, వెబ్ సీరిస్ లలోనూ షాకింగ్ స్టోరీస్ ఉంటాయి. భారతీయ సినిమాల్లో కూడా ఇలాంటి శాడిస్టిక్ ఘటనల గురించి సినిమాలు వచ్చాయి, వస్తుంటాయి. హాలీవుడ్ లో వచ్చే ఇలాంటి స్టోరీలకు సంబంధించి వాస్తవిక ఆధారాలూ ఉంటాయి. మనుషుల్లోని ఈ హింసాత్మక ప్రవృత్తి గురించి అర్థవంతమైన చర్చగా ఆ సినిమాలు నిలిచాయి.
మరి శాడిజానికీ మతానికి కూడా సంబంధం ఉందా? ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య, ఆమెతో సహజీవనం చూస్తే ఆఫ్తాబ్ ఆమెను దారుణంగా హతమార్చడం, ఆ విషయం బయటకు పొక్కకుండా అతడు పన్నిన పన్నాగం.. ఒళ్లు గగుర్పొడిచే సంఘటన. వారిద్దరూ కలిసి కొంత కాలం ఉన్నారు. అతడు దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. అతడిని పెళ్లి చేసుకోమంటూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెను హతమార్చి ఆ విషయం బయటపడకుండా ఆమె మృతదేహాన్ని రంపంతో కత్తిరించి, ముప్పై ఐదు ముక్కలుగా చేసి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి… వాటిని ఒక్కొక్కటిగా బయటపడేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఆఫ్తాబ్ దారుణానికి ఒడిగట్టాడు.
అతడు క్షణికావావేశంలో చేసిన ఘటన అయితే కాదు ఇది. చాలా కుట్రపూరితంగా ఆమె ఉనికినే మాయం చేసేందుకు అతడు పన్నిన కుట్ర అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఆ మానవ మృగానికి ఎంత శిక్ష వేసినా తక్కువే!
అయితే సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి చర్చ పక్కదోవ పట్టింది. అది మతం కోణంలో! అతడి మతం ఏమిటి, ఆమె మతం ఏమిటి? ఇదంతా లవ్ జిహాద్ అంటూ వాదిస్తున్నారు కొంతమంది! జరిగిన దుర్మార్గపు ఘటన నుంచి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నాలు కాబోలు ఇవి. వాట్సాప్ యూనివర్సిటీ ఇలాంటి విషయాలను వాడుకోవడానికి ముందుంటుంది.
శాడిస్టిక్ మర్డర్స్ లో ఇది సంచలనం. అయితే.. మొదటిది అయితే కాదు. భార్యను ఇలా చంపిన వాళ్లు ఉంటారు. భర్తను ఇలా చంపి, రంపంతో కోసిన అతివలూ ఉన్నారు! వాళ్ల కులాలూ, మతాలు ఒక్కటే! కులమూ గోత్రమూ చూసి, మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్లలో కూడా ఒకర్నొకరు హింసించుకునే వాళ్లు, చంపుకున్న వాళ్లు, తొలి రేయే భార్యపై కిరాతకాలకు పాల్పడిన వారు కోకొల్లలు. వీటిల్లో శాడిస్టిక్ లెవల్స్ లో మాత్రమే తేడా ఉంది. మరి ఒక దుర్మార్గపు సంఘటనను మతాల మధ్య విద్వేషాలకు వాడుకోవడం మరో దుర్మార్గం.
చేతనైతే దోషిని శిక్షించాలి. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడడానికి భయం కలిగేలా చర్యలుండాలి! కానీ ఇలాంటి ఘటనలను ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూడటం మాత్రం.. ఆ శాడిస్ట్ కూ, ఈ శాడిస్ట్ లకూ పెద్ద తేడా లేకుండా చేస్తోంది.