కోడెల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నర్సరావుపేటకు వెళ్లాలని అనుకున్నారు. లేదా తన వారసుల్లో ఒకరికి నర్సరావుపేట నియోజకవర్గం టికెట్ కేటాయించాలని ఆయన కోరినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నర్సరావుపేటను కేటాయించే అవకాశమే లేదని, సత్తెనపల్లికే ఆయనను పరిమితం చేశారు.
అసలు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కోడెలకు కేటాయించడం మీద కూడా తెలుగుదేశం పార్టీలో పెద్దదుమారమే సాగింది. ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆ విషయంలో వ్యతిరేకత వ్యక్తంచేశారు. కోడెలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆయనకు సత్తెనపల్లి టికెట్ కేటాయించవద్దంటూ వారు చంద్రబాబు నాయుడు ముందు నినదించారు. అయితే కోడెలను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టలేకపోయారు.
అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో మాత్రం.. కోడెలను రాజకీయంగా మరింత అణగదొక్కడానికి తెలుగుదేశం పార్టీలోనే రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. సత్తెనపల్లి నియోజకవర్గానికి వేరే ఇన్ చార్జిని పంపడానికి కూడా చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. కోడెల శివప్రసాద్ రావు మరణానికి ముందే ఈ వార్తలు రావడం గమనార్హం.
రాయపాటి సాంబశివరావు తనయుడిని సత్తెనపల్లి ఇన్ చార్జిగా నియమించడానికి తెలుగుదేశం అధినేత రంగం సిద్ధం చేశారని అప్పుడే వార్తలు ప్రచురితం అయ్యాయి. ఇంతలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామాల వరసను గమనిస్తే.. కోడెలను తెలుగుదేశం పార్టీ ఎలా ట్రీట్ చేసిందో అర్థం చేసుకోవడం ఏమాత్రం కష్టంకాదని పరిశీలకులు అంటున్నారు.
ఆయన కేసుల్లో ఇరుక్కుంటే, ఆయన సతానం వెలగబెట్టిన చేష్టలతో బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు అయితే.. తెలుగుదేశం పార్టీ అధినేత వ్యక్తిగతంగా కూడా ఆయనకు భరోసాను ఇవ్వలేకపోయారు. అదిగాక సత్తెనపల్లి నుంచి కూడా ఆయనను సాగనంపాలని చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోడెలను ప్రభుత్వం క్షోభకు గురి చేసిందంటూ మాట్లాడటం ఎంత విడ్డూరమో!