అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇండియా. ఇప్పటివరకు అమెరికాకు కూడా సాధ్యంకాని చంద్రుడి దక్షిణ దృవంపై భారత్ అడుగుపెట్టింది. చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సాయంత్రం సరిగ్గా 6 గంటల 3 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టింది.
ప్రస్తుతం అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తులుగా కొనసాగుతున్నాయి అమెరికా, రష్యా, చైనా. ఇప్పుడీ దేశాల సరసన ఇండియా చేరింది. అయితే చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం మాత్రం ఇండియానే.
సాఫ్ట్ ల్యాండింగ్..
జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం మొదలైంది. ఆగస్ట్ 17న వ్యోమనౌక లోని విక్రమ్ ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. అప్పట్నుంచి భూమి చుట్టూ పరిభ్రమిస్తూ, మెల్లగా చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. ఆ తర్వాత 2 సార్లు డీ-ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి, ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా తీసుకెళ్లారు.
ఎట్టకేలకు చంద్రుడికి అతి సమీపంలోకి ల్యాండర్ చేరుకుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అసలైన ప్రయోగం మొదలైంది. నిజానికి పైన చెప్పుకున్న 2 దశలు ఇస్రోకు కొత్త కాదు. చంద్రయాన్-2లోనే సక్సెస్ చేసి చూపించాయి. కీలకమైన సాఫ్ట్ ల్యాండింగ్ లోనే చంద్రయాన్-2 ఫెయిలైంది.
ఇప్పుడా ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని, అత్యంత కీలకమైన మూడో దశను విజయవంతగా అమలు చేసింది ఇస్రో. చంద్రుడికి 7.4 కిలోమీటర్ల ఎత్తున విక్రమ్ ల్యాండర్ ఉన్నప్పట్నుంచి, కీలకమైన ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ, చంద్రుడి ఉపరితలానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అత్యంత సున్నితంగా ల్యాండర్ ను చంద్రుడిపై దించారు.
తర్వాత ఏంటి..?
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగింది. ఇప్పుడు అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకొస్తుంది. సెకెనుకు సెంటిమీటర్ చొప్పున కదిలే ఈ రోవర్, చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. అటు ల్యాండర్ కూడా తన చుట్టుపక్కలున్న వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేయడంతో పాటు.. ప్రజ్ఞాన్ తో పూర్తిస్థాయిలో కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు తిరుగుతుంది. ఈ 2 వారాల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుంది ఈ రోవర్.
నిజానికి చంద్రుడిపై కొత్తగా అధ్యయనం చేయడానికేం లేదు. చంద్రుడిపై ఘనరూపంలో నీరు ఉందనే విషయాన్ని చంద్రయాన్-2లోనే వెల్లడించింది భారత్. చంద్రుడిపై ఉన్న లోహాలు, ఖనిజాల్ని కూడా విశ్లేషించింది. చంద్రయాన్-3 లక్ష్యం ఏంటంటే… ఇప్పటివరకు ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవాన్ని విశ్లేషించడమే. దీంతో పాటు సాఫ్ట్ ల్యాండింగ్ ఫీట్ ను సాధించడం.
ఇప్పుడీ 2 లక్ష్యాల్ని చంద్రయాన్-3 అందుకుంది. రాబోయే రోజుల్లో చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విశేషాల్ని, ఫొటోల్ని అందించబోతోంది ప్రజ్ఞాన్ రోవర్.