పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీకి సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే కమిటీలో వుండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కమిటీ ఏర్పాటు జాప్యమవుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిరాకరించింది. దేశ భద్రతతో ముడిపడిన అంశంగా దీన్ని చూపడంపై సుప్రీం ఆగ్రహించింది.
దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తామే మధ్యంతర ఉత్తర్వులను ఇస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక కమిటీ ఏర్పాటు నిర్ణయం విషయమై సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్‌సింగ్‌తో చీఫ్ జస్టిస్ తెలిపారు. త్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ తెలిపారు. వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.