టిటిడి బోర్డు నియామకాలను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ లు దాఖలు చేశారు. బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ ను కోర్టు దాదాపు తిరస్కరించినట్లే. అదే సమయంలో ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
ఈ సమయంలో ప్రభుత్వ వాదన విచిత్రంగా ఉన్నది. బీజేపీ నేత పిటిషన్ ను ఎందుకు తప్పుపట్టింది, ఆహ్వానితుల విషయంలో ఎందుకు ప్రభుత్వ ఆదేశాలను తప్పుపట్టింది అన్న వ్యత్యాసం ప్రభుత్వానికి కనపడకపోవడం విచిత్రంగా ఉంది.
టిటిడి బోర్డు నియామకం 30/ 87 సెక్షన్ 96 ప్రకారం ఏపీ ప్రభుత్వం చేయాలి. బోర్డు సభ్యుల సంఖ్య, నియమాలు అందులో ఉన్నాయి. ప్రభుత్వం సంఖ్యను పెంచాలని భావిస్తే క్యాబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుంది.
గతంలో 9 మందిగా ఉన్న సభ్యులు నేడు 25 మందికి ఎలా పెరిగింది అంటే చట్టంలో మార్పులు చేయడం ద్వారా. బోర్డులో అనర్హులు ఉన్నారన్న బీజేపీ నేత పిటిషన్ ను కోర్టు తప్పు పట్టినట్లే. ఎవరు అనర్హులో వారిని ప్రతివాదులుగా చేర్చకుండా వేసిన పిటిషన్ ను తిరస్కరించడానికి పూనుకుంటే ప్రతివాదులుగా చేర్చ డానికి సమయం అడిగితే కోర్టు సమయం ఇచ్చింది.
బోర్డు, సభ్యులు అని చట్టంలో ఉన్నది చైర్మన్, బోర్డును నియమిస్తూ రెండు జీఓలు విడుదల చేసిన ప్రభుత్వం అదనంగా ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరో రెండు జీఓ లు విడుదల చేసింది. చట్టంలో ఎక్కడా ఆహ్వానితులు అన్న పదమే లేదు. ప్రభుత్వం 52 మందిని నియమిస్తూ చేసిన నిర్ణయం రాజకీయంగా తప్పు. ఎక్కువ మంది సభ్యులను నియమించాలి అనుకుంటే చట్టంలో మార్పులు చేయాలి.
కోర్టులో ప్రభుత్వ వాదన ప్రకారం బోర్డు వేరు టిటిడి వేరు అని మాట్లాడం, వారు సమావేశాలకు రారు అని అర్థం వచ్చేలా వాదించడం హాస్యాస్పదం. బోర్డుకు కాకుండా దేవస్థానంకు ఆహ్వానితులు అని ఎలా అంటారు. ఆలయానికి అందరూ ఆహ్వానితులే అన్న తెలియదా.
ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ఆహ్వానితులకు ఓటు హక్కు ఉండదు అని ఉన్నది ఓటు హక్కు లేదు అన్నారంటే సమావేశానికి హాజరు అవుతారు అనే కదా అర్థం. గతంలో ఈ ప్రభుత్వం నియమించిన ఆహ్వానితులు బోర్డు సమావేశాలకు హాజరు అయినారు. ఈ విషయాన్ని ఫిటీషనర్స్ కోర్టు దృష్టికి తీసుకువస్తే కోర్టును తప్పుదోవ పట్టించినట్లే అవుతుంది.
ఆహ్వానితులు అనే అంశం చట్టంలో పేర్కొన లేదు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుంది. తాము చేయదలుచుకున్నది చట్టంలో మార్పులు చేసి జీఓ ఇచ్చి ఉంటే వివాదమే ఉండదు. ప్రభుత్వం ముందు ఉన్నది రెండు మార్గాలు 81 మంది సభ్యుల నియామకంపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కాబట్టి కోర్టు తీర్పును అంగీకరించడం. లేదా చట్ట సవరణ చేసి అమలు చేయడం. అంతే గానీ చట్టం ముందు నిలబడని అసంబద్ధ వాదనలు చేస్తే ప్రభుత్వం కోర్టు ముందు ముద్దాయిగా నిలబడక తప్పదు.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, 9490493436.