కేబినెట్ భేటీ.. కొత్త జిల్లాలపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈరోజు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాల పునర్వవస్థీకరణపైనే దృష్టి…

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈరోజు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాల పునర్వవస్థీకరణపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధ్యయన కమిటీని ఈరోజు నియమించే అవకాశం ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల్ని రెవెన్యూ శాఖ ఇప్పటికే సిద్ధంచేసింది. ఏఏ మండలాలు ఏ జిల్లాలో ఉండాలనే అంశంతో పాటు.. పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా సరిహద్దులు, జిల్లా కేంద్రాల్ని కూడా రెవెన్యూ శాఖ ఇప్పటికే తన ప్రతిపాదనల్లో పొందుపరిచింది. ఈ నివేదికపై ఈరోజు ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు.

నిజానికి ఇప్పటికిప్పుడు జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే… మండలాలు, జిల్లాలు, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి వీల్లేకుండా కేంద్రం ఫ్రీజింగ్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే. ఈ ఫ్రీజింగ్ గడువు ముగిసేలోగా కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో అధ్యయనాన్ని జరిపించడంతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది.

ప్రస్తుతం ఉన్న జిల్లాల్ని 25 జిల్లాలుగా మార్చాలనేది జగన్ ఆలోచన. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలని అనుకున్నారు. అయితే 2 గిరిజన జిల్లాల ఏర్పాటుకు (తూర్పుగోదావరిలో ఒకటి, విశాఖలో ఒకటి) సంబంధించి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారంగా జిల్లాల విభజన వద్దంటూ స్వపక్షంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు