సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తయారైన సినిమా వరుడుకావలెను. నాగశౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్లు. ఈ సినిమా నుంచి ఇప్పటికే 'దిగు దిగు నాగ' సాంగ్ విడుదలై పెద్ద హిట్ అయింది.
ఇప్పుడు మరో పాట విడుదల చేసారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన అందమైన ప్రేమ గీతానికి విశాల్ చంద్రశేఖర్ మెలోడియస్ ట్యూన్ అందించారు. చిన్మయి ఈ గీతాన్ని ఆలపించారు.
‘‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ .. పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా…'' ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం.. అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం ’’
అంటూ సాగే ఈ పాటకు రూపొందించిన విజువల్స్ చాలా అందంగా వున్నారు. శౌర్య, రీతూ ఇద్దరినీ చాలా అంతంగా చూపించారు. మెలోడీయస్ ట్యూన్ తో తయారైన ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను.
ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి ఆలపించిన ఈ గీతం అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. వరుడుకావలెను సినిమాకు నిర్మాత నాగవంశీ సూర్యదేవర.