ఈ భయమే వ్యక్తం అవుతోంది టీఆర్ఎస్ నేతల నుంచి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు ఫిక్సింగ్ చేసుకుంటాయని, టీఆర్ఎస్ ను దెబ్బకొట్టే వ్యూహంతో ఆ రెండు పార్టీలూ లోలోపల చేతులు కలుపుతాయనే టాక్ ను పుట్టిస్తున్నారు గులాబీ పార్టీ నేతలే!
కేసీఆర్ పై ధిక్కార పతాకాన్ని ఎగరేసిన ఈటల రాజేందర్ కు లోపాయికారీగా సహకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవచ్చనేది టీఆర్ఎస్ నేతల మాట. టీఆర్ఎస్ ను ఓడించడం అనే ఉమ్మడి లక్ష్యం మేరకు ఈటలకు రేవంత్ రెడ్డి సహకారం అందిస్తాడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడో తిరుగుతున్న రేవంత్ రెడ్డి హుజూరాబాద్ కు సరిగా రావడం లేదని చెబుతున్నారు!
ఈ వాదన బాగానే ఉంది కానీ, ఈటల గెలవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోవచ్చేమో కానీ, కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు! ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కానీ, బీజేపీ గెలవడం వల్లనే కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం! టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే ప్రచారం చేసుకుంటోంది బీజేపీ.
అంతేగాక 2023లో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రాబోయేది కూడా తామేనని ప్రకటించుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అడ్రస్ కోల్పోవడం, బీజేపీ పోటీ పడిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ లో బీజేపీకి గనుక కాంగ్రెస్ సహకారం అందిస్తే ఆ పార్టీ తన తోకకు తనే నిప్పు పెట్టుకున్నట్టుగా అవుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే.. అధికారాన్ని ఉపయోగించుకుని గెలిచారంటూ కాంగ్రెస్ తేల్చేయవచ్చు. అదే బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీనే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది.
చిన్న పిల్లాడికి కూడా ఈ మాత్రం తెలుస్తుంది. మరి అలాంటిది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటల విజయం కోసం కాంగ్రెస్ లోపాయికారీగా అయినా పని చేస్తుందా? అనేది సందేహమే! ఒకవేళ టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నట్టుగా అదే జరిగితే.. అంతిమంగా అది కాంగ్రెస్ కే తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు!