ముందు మనల్ని మనం కరోనా నుంచి కాపాడుకుంటే….ఆ తర్వాతే ఎన్ని సినిమాలైనా తీయొచ్చని బాలీవుడ్ నటి బిపాసా బసు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల షూటింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయడమే మంచిదని ఆమె అంటున్నారు. కరోనా మహమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండటంతో నటీనటులు వణికిపోతున్నారు.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ కుటుంబం, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబం కరోనా బారిన పడడంతో నటీనటుల్లో కరోనా భయం రెట్టింపైంది. ఓ ప్రోగ్రాం షూటింగ్‌లో అమితాబ్ పాల్గొనడం వల్లే కరోనా బారిన పడ్డారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…షూటింగ్‌లు జరపడం అంత శ్రేయస్కరం కాదని చిత్ర పరిశ్రమ అభిప్రాయపడుతోంది.
ఈ నేపథ్యంలో దక్షిణాది బుల్లితెర నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్ కరోనా బారిన పడ్డాడనే సమాచారంతో బుల్లితెర, వెండితెర నటీనటులు మరోసారి ఉలికిపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నటి బిపాసా బసు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మొండిగా షూటింగ్‌ల్లో పాల్గొనడం కంటే దూరంగా ఉంటూ, కరోనా నుంచి రక్షణ పొందడం ఉత్తమం అన్నారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్‌తో పని చేసే అవకాశం ఉందన్నారు. కానీ నటులకు అలాంటి అవకాశం ఎంత మాత్రం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఎంత ప్రమాదమైనా మాస్క్‌లు ధరించి నటీనటులు యాక్ట్ చేసే అవకాశం లేని పరిస్థితుల్లో అసలు షూటింగ్‌లనే రద్దు చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే వరకు షూటింగ్‌ల మాటే ఎత్తక పోవడం మంచిదని ఆమె సూచించారు.