జనసేనానిపై బాబు పరోక్ష విమర్శలు

అనుకున్నదొకటి అయ్యింది మరొకటి అన్నట్లుగా మారింది ఏపీలో టీడీపీ – జనసేన సంబంధం. ప్రధాని మోడీ ఈమధ్య ఏపీ పర్యటనకు రాకముందు వరకు టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరిగింది. పవన్…

అనుకున్నదొకటి అయ్యింది మరొకటి అన్నట్లుగా మారింది ఏపీలో టీడీపీ – జనసేన సంబంధం. ప్రధాని మోడీ ఈమధ్య ఏపీ పర్యటనకు రాకముందు వరకు టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరిగింది. పవన్ కు సంబంధించి విశాఖలో జరిగిన ఘటనల తరువాత బాబు వచ్చి ఆయన్ని పరామర్శించారు. మద్దతు పలికారు. ఆ తరువాతే రెండు పార్టీలు పొత్తుకు సంకేతాలు ఇవ్వడం, బీజేపీతో పొత్తు వదులుకుంటున్నట్లు పవన్ పరోక్షంగా చెప్పడం జరిగింది. కానీ ఇంతలో మోడీ విశాఖ వచ్చి పవన్ తో సమావేశమైన తరువాత సీన్ మారిపోయింది. పవన్, చంద్రబాబు దారులు వేరైపోయినట్లుగా కనబడుతోంది.

ప్రధాని తన పర్యటనతో ఏపీ రాజకీయ సమీకరణాలనే మార్చేశారు. అటు అధికార పక్షం వైసీపీని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని డిఫెన్స్ లో పడేశారు. ఇప్పటివరకూ బీజేపీని కార్నర్ చేసుకొని ఏపీలో ప్రాంతీయ పార్టీలు తమ ఆట చూపాయి. ఇప్పుడదే ఫార్ములాతో ప్రాంతీయ పార్టీల ఆటకట్టించారు ప్రధాని మోదీ. పవన్ అనే అస్త్రాన్ని ప్రయోగించి టీడీపీ, వైసీపీ వెన్నులో వణుకు పుట్టించారు. ప్రధానితో భేటీ తరువాత అధికార పక్షంపై పవన్ మరింత దూకడు కనబరుస్తుండగా  తనకు ఒక చాన్సివ్వాలని అభ్యర్థించడం ద్వారా టీడీపీని కూడా డిఫెన్స్ లోపడేశారు. అయితే పవన్ లో మార్పునకు ప్రధాని మోదీ యే కారణమని వైసీపీ, టీడీపీ అనుమానిస్తున్నాయి.

టీడీపీ నుంచి పవన్ ను దూరం చేశారని వైసీపీ తొలుత సంతోషపడినా.. తమపై పవన్ ను ఊసిగొల్పడాన్ని మాత్రం జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రధాని ఏపీలో అడుగుపెట్టిన వరకూ టీడీపీ, జనసేనల మధ్య సానుకూల వాతావరణం ఉండేది. అటు జగన్ కూడా బీజేపీ పెద్దలు తన వెంట ఉన్నారన్న నమ్మకంతో ఉండేవారు. అయితే అవన్నీ పవన్ తో ప్రధాని భేటీతో పటపంచలయ్యాయి. వైసీపీ, టీడీపీ ఆశలు నీరుగారిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన దారి తాను చూసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తున్నారు. చాలా నాటకీయంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు.

తనకు ఇవే చివరి ఎన్నికలంటూ  కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ప్రజల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. అదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తొలి రోజు సభల్లో పవన్ కల్యాణ్ అంశం ప్రస్తావించిన చంద్రబాబు..ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సరే, లేకుంటే ఇవే తన చివరి ఎన్నికలంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగాల్లో మార్పు కనిపించింది. తాను సినిమా నటుడిని కాదని..తన సినిమా ఏదీ సూపర్ హిట్ కాలేదు..అయినా ఇంత స్పందన కనిపిస్తుందంటే తాను తిరిగి అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని అన్నారు.

ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవే అనడంలో సందేహం లేదు. తాను ముఖ్యమంత్రిగా అడుగుపెట్టేందుకు అందరూ సహకరించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. బారీ జన స్పందన చూస్తుంటే ప్రభుత్వంపైన ఉన్న ఆగ్రహం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభగా చంద్రబాబు అభివర్ణించారు. ముఖ్యమంత్రిగానే ఆ సభలోకి అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేసారు. అంటే తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని బాబు ప్రజలను వేడుకుంటున్నారు.