మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల నుంచి తప్పుకున్నా రాజకీయ విశ్లేషకుడిగా ఉంటున్నారు. అలాగే మార్గదర్శి సంస్థ మీద సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. సామాజిక సమస్యల మీద కూడా తన తనదైన నిరసన గళం వినిపిస్తున్నారు.
ఎంపీ అవుదామనుకుని 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రజా సమస్యల విషయంలో తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జేడీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ ఇద్దరు నేతలు ఇపుడు విశాఖ వేటికగా ఒక హాటెస్ట్ ఇష్యూ మీద చేతులు కలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే మహా సదస్సులో ప్రధాన వక్తలుగా ఈ ఇద్దరు నేతలు పాలుపంచుకోబోతున్నారు.
ప్రజా సంఘాలు, ఉక్కు ఉద్యమకారులు, కార్మికులు, కవులు రచయితలు, కళాకరులు, పౌర సమాజానికి చెందిన మేధావులు అంతా హాజరయ్యే ఈ సదస్సులో జేడీ, ఉండవల్లి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ ఇద్దరు నాయకులు ఏమి మాట్లాడబోతున్నారు అన్నదే ఆసక్తిని పెంచే విషయం.
ఉండవల్లి అంటే మోడీ సర్కార్ ని గట్టిగానే తూర్పార పడతారు. జేడీ ఇంటలెక్చువల్ గా మాట్లాడుతారు. ఇక ఈ ఇద్దరితో పాటు సినిమాల్లో రెడ్ స్టార్ అయిన ఆర్ నారాయణమూర్తి కూడా సదస్సుకు అసలైన ఆకర్షణ. ఈ నెల 22వ తేదీ నాటికి విశాఖ ఉక్కు ఉద్యమానికి ఆరు వందల రోజులు అవుతోంది. దాంతో ఆ రోజున భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి నాందిగా జరిగే ఈ సభ మోడీని, కేంద్రాన్ని ఎంతవరకూ కదిలిస్తుందో చూడాలి.