తాము జనసేన కలిసి పోటీ చేస్తామని భాజపా నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఇది నిజమో, కాదో అన్న సంగతి పక్కన పెడితే దీన్ని అర్జంట్ గా ఖండించాల్సిన పని అయితెే జనసేనకు లేదు. అలాంటి అభిప్రాయం తమకు నచ్చకపోతే తప్ప, దాన్ని కౌంటర్ చేయాల్సిన పని లేదు జనసేనకు మనసులో తేదేపా-భాజపా రెండు చేతులు పట్టుకుని కాపురం చేయాలని వుందన్న సంగతి రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాప్తిలో వుంది. కానీ భాజపా అధిష్టానం మాత్రం అలా వద్దంటోందన్నది వార్తలు సారాశం.
భాజపాతో కలుస్తారు, తేదేపాతో కలవరు అన్న ప్రచారం ఇప్పుడు జనసేన నేతలకు కంపరం పుట్టిస్తున్నట్లుంది. నాదెండ్ల మనోహర్ అర్జంట్ గా దాన్ని ఖండించడం అంటే అదే అనుకోవాలి. పొత్తు సంగతులు ఇప్పుడు కాదని, ఎన్నికల టైమ్ లో మాత్రమే మాట్లాడతామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతే కాదు, ప్రధాని మోడీతో జరిగిన చర్చల సారాంశాన్ని తాము బయటపెట్టబోమన్నారు.
అంటే అక్కడికి మోడీ చెప్పింది యేదో వేరుగా వున్నట్లు, భాజపా నేతలు చేస్తున్న ప్రచారం సరికాదన్నట్లు మాట్లాడుతున్నారు నాదెండ్ల మనోహర్. నిజానికి జనసేను తేదేపా దిశగా నడిపించే ప్రచారం చేస్తున్నది నాదెండ్ల మనోహర్ అనే విమర్శలు జనసైనికుల్లో వున్నాయి. ఇప్పుడు మనోహర్ మాటలు వాటిని మరోసారి ధృవీకరిస్తున్నాయి.
ఏడాదిన్నర సమయం వుంది ఎన్నికలకు. ఈ లోగా ఏమైనా జరగొచ్చు అని మనోహర్ భావిస్తున్నట్లు వుంది. అందుకే పొత్తుల గురించి ఇప్పుడే తొందర వద్దు అంటున్నారు. కానీ తెలుగుదేశంతో పొత్తు అస్సలు మదిలో లేకుంటే ఇప్పుడే చెప్పేయవచ్చు. అలా కాకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్లాలనే కోరిక బలంగా వుండబట్టే మనోహర్ ఇలా చికాకు పడుతున్నట్లుంది.