పెడనలో జనసేన కార్యకర్తలను, వైసీపీకి చెందిన వారు, జోగిరమేష్ అనుచరులు కొట్టారంటూ ఇప్పుడు నానా రాద్ధాంతం జరుగుతోంది. ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళితే.. అక్కడ కూడా కొట్టారంటూ జనసేన వారంతా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కొట్టింది నిజమే కావొచ్చు.. కానీ ఎందుకు కొట్టారో ఎవ్వరూ ఆలోచించరా? అనేది ప్రశ్న. జనసేన కార్యకర్తలు చీకటి పనులు చేస్తున్నందనే వారిని కొట్టారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అలాంటి పనులు చేస్తున్నందుకు.. జనసేన కార్యకర్తల మీద ఇంకా వేర్వేరు కేసులు కూడా పెట్టాలి. పోలీసులు అలా చట్ట ప్రకారం పనిచేసినా కూడా.. మళ్లీ పవన్ కల్యాణ్.. ఇంకో గోల చేస్తాడు.
ఇంతకీ పెడనలో ఏం జరిగింది.. వివరాల్లోకి వెళితే..
జనసేన, వైసీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో జనసేన పవన్ కల్యాణ్ మీద అధికార పార్టీ తరఫున విరుచుకుపడడంలో మంత్రి జోగి రమేష్ ముందువరుసలోనే ఉంటున్నారు. జోగిరమేష్ మీద జనసేన వారి విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జోగి రమేష్ ను కించపరిచేలా.. జనసేన వాల్ పోస్టర్లను ముద్రించింది.
జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్‌సుధీర్ పేరుతో ముద్రించిన ఈ పోస్టర్లను, జనసేన కార్యకర్తలు రాత్రివేళ పట్టణంలో గోడల మీద అంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి అనుచరులు వారి మీద దాడిచేసి కొట్టారనేది ఆరోపణ.‘‘ప్రచారార్భాటం.. పనిశూన్యం.. అవినీతి ఘనం’’ అంటూ ఇంకా రకరకాల వ్యాఖ్యలతో ఈ పోస్టర్లను ముద్రించారు. వాటిని అతికిస్తున్న వారిని కొట్టారని తెలియగానే.. విజయవాడనుంచి కూడా జనసేన నాయకులు ఎగబడి రావడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది.
జోగిరమేష్ మీద జనసేన విమర్శలు కొత్త కాదు. వాటికి ఎప్పుడూ ఇలాంటి స్పందన రాలేదు. తాము చేస్తున్న పని తప్పు అని తమకే అవగాహన ఉన్న జనసైనికులు.. వాల్ పోస్టర్లు ముద్రించి.. గుట్టుచప్పుడు కాకుండా.. రాత్రికి రాత్రే చీకట్లో వాటిని ఊరంతా అతికించేయాలని ప్రయత్నించినందుకే దెబ్బలు తిన్నారు. వారి పని నిజాయితీ ఉన్నదే అయితే.. పోస్టర్లు అంటించడం పగలు కూడా చేయవచ్చు. తప్పుడు పనిచేస్తున్నారు గనుక.. ఆ భయంతో రాత్రిపూట పోస్టర్లు అంటించారు. తన్నులు తిన్నారు.
మంత్రి జోగి రమేష్ అవినీతి చేస్తున్నాడని తెలిస్తే.. అదే జనసేన నాయకులు.. ధర్నాలు, ఘెరావ్ లు, దీక్షలు కూడా చేయొచ్చు. కానీ.. రాత్రివేళ అంటించే పోస్టర్ల దారి చూసుకున్నారంటేనే వారి బుద్ధి బయటపడుతోంది.
వారికి ఇంకో సంగతి తెలీదేమో.. సాధారణంగా మన పోలీసులు పట్టించుకోరు గానీ.. వాల్ పోస్టర్లు ముద్రించాలంటే.. డిజైన్ తో సహా వాటికి ముందుగా ప్రభుత్వ అనుమతి ఉండాలి. అలా అనుమతి లేకుండా ఏది పడితే అది కాగితాల మీద ప్రింట్ చేసి.. ఊరంతా అంటిచేస్తే అది కూడా ఇంకో నేరం అవుతుంది.