ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా సీరియస్ గా భారతీయ జనతా పార్టీతో తగాదా పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధపడినట్టుగానే భావించాలి. భారతీయజనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు సిట్ 41ఏ నోటీసులు ఇవ్వడం అనేది చాలా సీరియస్ అంశంగా పలువురు పరిగణిస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా జరిగిన వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్.. కీలకమైనదశకు దర్యాప్తును తీసుకువెళుతోంది. కేవలం ఈ కేసును తేల్చడంలో కీలకం మాత్రమే కాదు. యావత్ దేశంలో రాజకీయాలను కుదిపేంత కీలకమైన దశ ఇది! భారతీయ జనతా పార్టీలో.. చాలా పెద్దస్థాయి నాయకుడు అయిన బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం మాత్రమే కాదు, 21వ తేదీన తమ ఎదుట తమ కార్యాలయంలో విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేస్తాం అని కూడా హెచ్చరించడం ఇక్కడ గమనార్హం. బిజెపి ఈ విషయాన్ని తేలికగా తీసుకోదు అని పలువురు విశ్లేషిస్తున్నారు.
బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ అనే ఆయన కేంద్రంలోని ఇతర నాయకుల్లాగా పాపులారిటీ ఉన్నవారు కాదు. పాపులారిటీ కోసం ప్రయత్నించే వారు కూడా కాదు. పార్టీ వ్యవహారాల్లో మాత్రం చాలా కీలకంగా ఉంటారు. తెరాసకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని అంటున్న రామచంద్రభారతి తో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జరిపిన సంభాషణలో సంతోష్ పేరు బాగా వినిపించింది.
సంతోష్ ది పార్టీలో ఏస్థాయి అనే విషయంలోనూ చాలా వివరణ ఉంది. పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ (అంటే బహుశా మోడీ, అమిత్ షాలు అనుకోవాలి) ఇద్దరూ కూడా సంతోష్ ఇంటికి వచ్చి మంతనాలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారంటూ రామచంద్రభారతి చెప్పిన ఫోన్ కాల్ ఆడియో ఇదివరకే లీకైంది. అయితే కేంద్రప్రభుత్వంలో బిఎల్ సంతోష్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా.. ఆయన మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారనే విషయంలో అనుమానాలు ఉండేవి.
ఈ కేసులో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని సిట్ దాదాపు తేల్చినట్టే. ఎందుకంటే.. బిజెపికి ఆయువుపట్టు వంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడాన్ని ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుందనే అందరూ భావిస్తున్నారు. నోటీసుల్లో.. మొబైల్ నెంబరును పేర్కొంటూ ఆ సిమ్ కార్డును, అది వాడుతున్న మొబైల్ ఫోనును కూడా విచారణకు తీసుకురావాలని పోలీసులు సూచించారు. మొబైల్ ఫోను మార్చేసే అవకాశం లేకుండా.. దాని IMEI నెంబరును కూడా పోలీసులే చెప్పారు. ఆ ఫలానా నెంబరు ఉన్న ఫోనునే తీసుకురావాలని సంతోష్ కు నోటీసులు ఇచ్చారు. వీటిలో తేడా జరిగినా కూడా.. ఆయన మీద చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.
గతంలో ఓటుకునోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్ర ఎంత ఉన్నప్పటికీ.. దానిని చురుగ్గా ముందుకు తీసుకెళ్లడాన్ని కేసీఆర్ అంతగా పట్టించుకోలేదని అనుకోవాలి. అయితే ఈ దఫా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేలా లేరు. కేంద్రంలోని బిజెపి పరువు తీయడానికి బ్రహ్మాస్త్రంలా వాడబోతున్నారు.