‘నేను సర్వాంతర్యామిని’ అనడం ఒక్కటే తక్కువ!

చంద్రబాబు నాయుడు ఈ భూమండలం సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిని ఒడ్డుకు తీసుకువచ్చి కాపాడారు.. బిల్ గేట్స్ అనే వ్యక్తికి చదువు సంధ్యలు సరిగా అబ్బక తిరుగుతూ ఉంటే కంప్యూటర్ వాడడం ఎలాగో నేర్పించి ఉపాధి…

చంద్రబాబు నాయుడు ఈ భూమండలం సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిని ఒడ్డుకు తీసుకువచ్చి కాపాడారు.. బిల్ గేట్స్ అనే వ్యక్తికి చదువు సంధ్యలు సరిగా అబ్బక తిరుగుతూ ఉంటే కంప్యూటర్ వాడడం ఎలాగో నేర్పించి ఉపాధి కల్పించారు.. దుర్మార్గులు రాక్షసులు నాలుగు వేదాలను ఎత్తుకుపోయినప్పుడు ఆయన రాక్షసులను సంహరించి వేదాలను కాపాడారు.. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేశారు.. 400 ఏళ్ల నుంచి రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాదు నగరానికి అభివృద్ధి అంటే ఏమిటో చూపించారు.. ఐటీ అనే పదాలను తానే కనిపెట్టారు..

ఇంకా ఇలాంటి అనేక అనేక వాక్యాలు రాసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అభిమానులకు చాలా సమ్మగా ఉంటుంది. తన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇలాంటి కబుర్లు అన్నీ ప్రజల్లోకి ప్రచారం చేయాలని బహుశా చంద్రబాబు నాయుడు కోరుకుంటూ ఉంటారు. ఆయన తనంత తానుగా కొత్తగా ఏ ప్రచారాలు మొదలు పెట్టాలో కనిపెడుతూ ఉంటారు.. ఆలోచిస్తూ ఉంటారు! ఆ క్రమంలో భాగంగానే ‘కర్నూలులో హైకోర్టు’ అనేది కూడా అసలు తన సొంత ఆలోచన అంటూ తాజాగా బుకాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉండాలని తొలుత ప్రతిపాదించింది నేనే అని ఆయన చెప్పుకుంటున్నారు. అమరావతిలో రాజధాని గురించి ఆలోచిస్తున్నప్పుడే.. ఆంధ్ర ప్రాంతానికి తొలి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలనే మాట అన్నట్లుగా చంద్రబాబు చాటుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పవచ్చు గాని.. ఈ మాటల ద్వారా ఆయన పరోక్షంగా జగన్ సంకల్పిస్తున్న రాజధాని వికేంద్రీకరణను సమర్ధిస్తున్నట్టే! ప్రజలలో తన ఆలోచన పట్ల వ్యతిరేకత వ్యక్తం అయ్యేసరికి.. కర్నూలు హైకోర్టు తన ఆలోచన అంటూ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు.

కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుకి స్థానికుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. జగన్ ప్రభుత్వం న్యాయ రాజధానిని సంకల్పిస్తున్న కర్నూలు జిల్లాలో.. తన పర్యటనకు భారీగా జనాలను సమీకరిస్తే అది హెచ్చరిక అవుతుందని బాబు అనుకున్నారు. దానికి తగ్గట్లే.. తెలుగుదేశం నాయకులు కష్టపడి ఆయన ఇతర ప్రాంతాల సభలకు జనాలను తరలించారు. 

కర్నూలులో కూడా అదే జరిగింది. అయితే చైతన్యవంతమైన కర్నూలు ప్రజలు తమ ప్రతిఘటనను, అసంతృప్తిని కూడా చంద్రబాబు నాయుడుకు తీవ్రంగా తెలియజేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ, మూడు రాజధానులు కావాలంటూ వారు నినాదాలు చేయడం చంద్రబాబుకు కంగారు పుట్టించింది. అమాయకులైన విశాఖ ప్రజలను మోసగించినట్లుగా కర్నూలు ప్రజలను మోసగించడం సాధ్యం కాదు అని ఆయన తెలుసుకున్నారు. 

అందుకే అసలు కర్నూలులో హైకోర్టు బెంచ్ అనే ఆలోచన మొదట తానే చేసినట్లుగా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే నిజమైతే విశాఖపట్నం ప్రాంతానికి మాత్రం ఎందుకు ద్రోహం చేయదలుచుకున్నారు చంద్రబాబు? అమరావతిలో రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి విశాఖ అనాధ లాగా వదిలేయాలని అనుకున్నారా? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి.

ఒక ప్రాంతంలో ప్రజలను మోసగించడానికి కొత్త అబద్ధాలు చెబితే.. మిగిలిన ప్రాంతాల ప్రజలు తన దుర్బుద్ధిని గుర్తిస్తారని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి.