లోకేశ్ కోసం అమ‌రావ‌తి పాద‌యాత్ర బ‌లి!

అమ్మ‌వారికి జంతువుల్ని బ‌లి ఇవ్వ‌డం చూశాం. మొక్కుబ‌డులు తీరితే లేదా తీర్చాల‌ని కోరుకునే భ‌క్తులు తాము న‌మ్ముకున్న దేవుళ్ల‌కు జంతువుల్ని బ‌లిపెట్ట‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కూడా ఓ సంప్ర‌దాయం వుంది. రాజ‌కీయ…

అమ్మ‌వారికి జంతువుల్ని బ‌లి ఇవ్వ‌డం చూశాం. మొక్కుబ‌డులు తీరితే లేదా తీర్చాల‌ని కోరుకునే భ‌క్తులు తాము న‌మ్ముకున్న దేవుళ్ల‌కు జంతువుల్ని బ‌లిపెట్ట‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కూడా ఓ సంప్ర‌దాయం వుంది. రాజ‌కీయ స్వార్థం కోసం న‌మ్ముకున్నోళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా చంద్ర‌బాబు బ‌లి పెడ‌తార‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో వుంది. ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ చంద్ర‌బాబు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇకపై అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డ‌కూడ‌ద‌ని త‌న వాళ్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో అర‌స‌వెల్లి వ‌ర‌కూ రెండో ద‌శ అమ‌రావ‌తి పాద‌యాత్ర చేరే మార్గం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి పాద‌యాత్ర త్రిశంకు స్వ‌ర్గంలో ప‌డిన‌ట్టైంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం దగ్గర పాదయాత్రకు బ్రేక్ ప‌డింది. పాద‌యాత్ర‌లో 600 మంది పాల్గొనేందుకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర ప్రారంభంలో, ఆ త‌ర్వాత మార్గ‌మ‌ధ్యంలో ఎప్పుడూ పాద‌యాత్ర చేస్తున్న వారి గుర్తింపు కార్డుల్ని పోలీసులు అడ‌గ‌లేదు. అయితే పాద‌యాత్ర చేస్తున్న‌, అలాగే న‌డిపిస్తున్న వారి ఓవ‌రాక్ష‌న్ కార‌ణంగా ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా తీసుకుంది. దీంతో 600 మంది ఐడీ కార్డులు చూపాల‌ని పోలీసులు ప‌ట్టుప‌ట్టారు.

ఐడీ కార్డులున్న వారు ప‌ది శాతం మాత్ర‌మే తేలారు. ఒక‌వైపు 33 వేల ఎక‌రాల‌ను త్యాగం చేశామ‌ని చెబుతూ, మ‌రోవైపు పాద‌యాత్ర చేయ‌డానికి క‌నీసం 600 మంది రైతులు దొర‌క‌ని ద‌య‌నీయ స్థితి. ప్ర‌భుత్వం అణ‌చివేత చ‌ర్య‌లకు పాల్ప‌డుతోందంటూ మ‌ళ్లీ అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి హైకోర్టును ఆశ్ర‌యించింది. నిబంధ‌న‌లు పాటించాల్సిందే అని, స‌డ‌లింపులు ఉండ‌వ‌ని తేల్చి చెప్పింది. హైకోర్టులో ఒక‌టికి రెండు బెంచ్‌ల‌ను అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆశ్ర‌యించినా…ఆశించిన విధంగా అనుకూల తీర్పు రాలేదు. మ‌రోవైపు హైకోర్టు తీర్పు రాగానే తిరిగి పాద‌యాత్ర ప్రారంభిస్తామ‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

పాద‌యాత్ర‌పై హైకోర్టు ఫైన‌ల్ తీర్పు కూడా వ‌చ్చింది. అయితే పాద‌యాత్ర ఎప్పుడు నిర్వ‌హించాలనేది స్ప‌ష్ట‌త రాలేదు. ఎందుకంటే ఇంత కాలం పాద‌యాత్ర‌ను వెనుక నుంచి న‌డిపిస్తున్న టీడీపీ మ‌ద్ద‌తు కొర‌వ‌డింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ త‌మ ప‌రిధిలో అమ‌రావ‌తి పాద‌యాత్ర ఖ‌ర్చుల్ని భ‌రించేలా చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్టు తెలిసింది. పాద‌యాత్ర ఆగిన వ‌ర‌కూ అదే జ‌రిగింది. ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. జ‌న‌వ‌రి 27 నుంచి లోకేశ్ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో లోకేశ్ పాద‌యాత్ర ఖ‌ర్చుల భారం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లే మోయాల్సి వుంది. అమ‌రావ‌తి పాద‌యాత్ర, అలాగే లోకేశ్ పాద‌యాత్ర ఖ‌ర్చులు భ‌రించ‌డం టీడీపీ నేత‌ల‌కు త‌ల‌కు మించిన భార‌మ‌వుతుంద‌నే చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. దీంతో రెండో ద‌శ పాద‌యాత్రను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని మౌఖిక ఆదేశాల‌ను చంద్ర‌బాబు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. పాద‌యాత్ర పేరుతో అమ‌రావ‌తి జేఏసీ వంద‌ల కోట్లు వ‌సూలు చేసింద‌ని, క‌నీసం సొంత ఖ‌ర్చులు కూడా పెట్టుకోకుండా ఆ మొత్తాన్ని ఏం చేస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

పైగా అమ‌రావ‌తిని న‌మ్ముకుంటే కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారిని ఈదిన‌ట్టే అని చంద్ర‌బాబు అంటున్న‌ట్టు తెలిసింది. అమ‌రావ‌తి పాద‌యాత్ర వ‌ల్ల ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌తో పాటు ఆ 29 గ్రామాలు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో టీడీపీకి న‌ష్ట‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఇక‌పై రాజ‌ధాని పాద‌యాత్ర‌కు క‌నీసం న్యాయ స‌హాయం కూడా అందించ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి టీడీపీ రావ‌డం అమ‌రావ‌తి జేఏసీ ఆగ్ర‌హానికి గురి చేసింది. దీంతో రాజ‌ధాని పాద‌యాత్ర ముందుకు సాగ‌డంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది. ఆషాడం త‌ర్వాత పాద‌యాత్ర సాగించాల‌ని అనుకుంటున్న‌ట్టు అమ‌రావ‌తి జేఏసీ నేత‌లు చెబుతూ వ‌చ్చారు. ఇప్పుడేమో సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంద‌ని, అది తేలిన త‌ర్వాత న‌డ‌క సాగిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌నే సాకుతో పాద‌యాత్ర‌కు అర్ధాంతరంగా ముగింపు ప‌ల‌కాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది.

మొత్తానికి అర‌స‌వెల్లి వ‌ర‌కూ పాద‌యాత్ర వెళ్ల‌కుండానే, కొడుకు కోసం అమ‌రావ‌తిని చంద్ర‌బాబు బ‌లి పెట్టార‌నే ఆవేద‌న‌, ఆక్రోశం అమ‌రావ‌తి జేఏసీలో వుంద‌న్న‌ది వాస్త‌వం. కొడుకు భ‌విష్య‌త్ త‌ర్వాతే అమ‌రావ‌తైనా, మ‌రేదైనా అని చంద్ర‌బాబు అనుకోవ‌డంలో త‌ప్పేం వుంది. అర‌స‌వెల్లి సూర్య‌భ‌గ‌వానుడు త‌మ జీవితాల్లో కాంతి ప్ర‌స‌రింప‌జేస్తార‌నే ఆశ‌తో పాద‌యాత్ర‌గా వెళ్లాల‌ని అనుకున్నారు. కానీ చంద్ర‌బాబు మ‌రొక‌టి త‌ల‌చి, వారి జీవితాల్లో చీక‌ట్లు నింపారు. చివ‌రికి బ‌లి అవుతున్న‌ది మాత్రం అమ‌రావ‌తే.