కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు “లాస్ట్ చాన్స్” అంటూ భావోద్వేగంతో చేసిన వేడుకోలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీకి ఆయన వ్యాఖ్యలు నష్టం కలిగిస్తాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఏమన్నారంటే… “నేను అసెంబ్లీకి వెళ్లాలంటే, రాజకీయాల్లో వుండాలంటే, రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేనిపక్షంలో నేను అసెంబ్లీకి వెళ్లను. 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించక తప్పదు” అని ఉద్వేగంగా చంద్రబాబు చెప్పారు.
2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక ఆ పార్టీ గతించే జాబితాలో చేరడం ఖాయం. 30 ఏళ్లు అధికారంలో వుంటానని పదేపదే చెబుతున్న వైఎస్ జగన్ ఏదో చేస్తారని చంద్రబాబు భయపడడం లేదు. చంద్రబాబు భయం, ఆందోళనల్లా ఒక్కటే… బీజేపీ తన పార్టీని మింగేస్తుందని. బాబు ఆందోళనలో న్యాయం వుంది. దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని వుంది. కర్నాటకలో ఇప్పటికే బీజేపీ అధికారంలో వుంది. అక్కడ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు.
ముఖ్యంగా తెలంగాణ పరిణామాలు చంద్రబాబును కలవరపెడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను కేసీఆర్ నాశనం చేయడం వల్ల, ఆ ఖాళీని బీజేపీ క్రమంగా భర్తీ చేస్తోంది. ఈ దఫా టీడీపీ అధికారంలోకి రాకపోతే ఎవరూ పార్టీలో కొనసాగరని చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ నచ్చని వాళ్లంతా బీజేపీ వైపు చూస్తారనే ఆలోచన ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని ఈ దఫా అధికారంలోకి రానివ్వకూడదనే పట్టుదలతో బీజేపీ వుందని బాబు గుర్తించారు.
పవన్‌ను కూడా ఆ కోణంలోనే కట్టడి చేస్తోందని బాబు పసిగట్టారు. అందుకే జనసేననో, మరొకరినో నమ్ముకోవడం కంటే జనాన్ని వేడుకుంటే ఫలితం వుంటుందనే నిర్ణయానికి బాబు వచ్చారు. అందుకే లాస్ట్ చాన్స్ అంటూ భావోద్వేగ అభ్యర్థనను బాబు మొదలు పెట్టారు. బాబు వ్యూహం ఎంత వరకు సత్ఫలితం ఇస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.