లాక్ డౌన్ టైమ్ లో కూడా వీలయితే ఓ చిన్న సినిమాను లాగించేసి, ఓటిటికి ఇవ్వాలనే ఆలోచనలో వుంది యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ. అయితే దీని కోసం బహుశా కొత్త బ్యానర్ పెట్టే ఆలోచన కూడా వుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ, మాటలు అందిస్తారు. దర్శకుడిగా మాత్రం ఆయన అసిస్టెంట్ వుంటారు.
కాస్త అడల్ట్ కంటెంట్ కావడంతో, నిర్మాణ సంస్థగా యువి పేరు, డైరక్టర్ గా గాంధీ పేరు వుండకపోవచ్చని వినిపిస్తోంది. దీనికి కాస్త నూనూగు మీసాల యంగ్ హీరో కావాలి. అందుకోసం డైరక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ ను తీసుకున్నారు. నటుడు బ్రహ్మాజీ కుమారుడు కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఇటీవల ఆర్జీవీ, చంద్ర సిద్దార్థ వంటి వాళ్లు ఖాళీగా వున్న రిసార్ట్ లను రెండు మూడు వారాలకు తీసుకుని, అక్కడే సినిమా మొత్తం లాగించేసే ఆలోచనలు చేస్తున్నారు. గతంలో దర్శకుడు మారుతి కూడా ఇలాగే ప్రేమకథాచిత్రమ్ సినిమాను తీసారు. ఇప్పుడు ఇదే బాటలోకి యువి కూడా అడుగుపెడుతుందని తెలుస్తోంది.
విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్ ను ఇందుకోసం ఎంచుకున్నారు. సముద్రం ఒడ్డు, గ్రీనరీ అన్నీ బాగా వున్న ఈ రిసార్ట్ లో ఈ అడల్ట్ కంటెంట్ సినిమా మొత్తం లాగించేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బహుశా ఆహా ఓటిటి ఛానెల్ లో ఈ సినిమా ప్రత్యక్షం కావచ్చు.