మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ విరుచుకుపడ్డాడు. సత్తెనపల్లిలో జరిగిన బీసీల సదస్సులో ఆమె ప్రసంగిస్తూ చంద్రబాబు ఏనాడూ బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు కొత్తగా మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. విజన్-2047 అంటూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విజన్స్ అన్నీ ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు.
ఓడిపోయాక మాత్రమే ఆయనకు అన్నీ గుర్తుకొస్తాయని దెప్పి పొడిచారు. ఓడిన తర్వాత విజన్ గురించి చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని తప్పు పట్టారు. బాబు చెబుతున్నవి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మళ్లీ బాబు చేతిలో ఓడిపోవడానికి జనం సిద్ధంగా లేరని ఆమె అన్నారు.
రాఖీ గురించి హేళనగా బాబు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. అసలే ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబునాయుడు? అని ఆమె ప్రశ్నించారు. మంత్రాల గురించి బాబు చెబుతున్నారని ఆమె చెప్పారు. మంత్రాలకు ఓట్లు రాలవ్ చంద్రబాబు అని హితవు చెప్పారు. మంచి పనులు చేస్తేనే ఓట్లు వేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మాదిరిగా మంచి పనులు చేస్తే జనం ఓట్లు వేస్తారని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కు బీసీలంతా తోడుగా వుండి, మరోసారి సీఎం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇటీవల చంద్రబాబునాయుడు రాఖీ గురించి చెప్పిన మాటలు ఆయన్ను అభాసుపాలు చేస్తున్నాయి. తాను పంపే రాఖీకి 45 రోజులు పూజలు చేసిన అనంతరం తనను తలచుకుంటే కష్టాలన్నీ పోతాయని తనను తాను దైవంగా బాబు ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు భారీగా సెటైర్స్ విసిరారు. అదే విషయమై మంత్రి విడదల రజినీ ప్రస్తావించి, మంత్రాలకు ఓట్లు రాలవని హితవు చెప్పడాన్ని గమనించొచ్చు.