పేరులో రాజు ఉంది. మరి మంత్రి అయినా కావాలి కదా. ఇంతకీ చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే కావడమే పెద్ద లక్. ఆయన పార్టీలో ఎన్నికలకు ముందు చేరారు. అప్పటికే శ్రీకాకుళంలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న గౌతు శ్యామ సుందర శివాజీతో ఢీ కొట్టారు.
2019 ఎన్నికల్లో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మీద గెలిచి విజయఢంకా మోగించారు. నాడే ఆయన మినిస్టర్ అని ప్రచారం జరిగింది. ఇపుడు మరో మారు ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే పలాసా వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదరి అప్పలరాజు.
వైద్యునిగా నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్న అప్పలరాజు ఎమ్మెల్యేగా కూడా ఏడాదిలో బాగానే కీర్తి గడించారు. జిల్లాకు రెండవ మంత్రిగా ఆయన అవుతారన్న టాక్ ఉందిపుడు. మత్య్సకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ ఖాళీ చేసిన అమాత్య కుర్చీ అప్పలరాజు కోసమేనని అంటున్నారు.
మరి ఎమ్మెల్యేగా నెగ్గి ఎలా లక్కున్నోడు అని చాటారో, ఇపుడు మంత్రి అయితే మాత్రం అప్పలరాజు అసలైన రాజేనని అనుచరులు అంటున్నారుట. మరి చూడాలి ఈ డాక్టర్ రాజు మినిస్టర్ రాజుగా మారుతారా లేదా అన్నది.