కరోనా వైరస్ సోకి ముంబయి నానావతి హాస్పిటల్ జాయిన్ అయిన అమితాబ్ బచ్చన్, అతడి తనయుడు అభిషేక్ బచ్చన్ కు పూర్తిస్థాయి కరోనా చికిత్స అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. అమితాబ్ కు చాలా తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని, తక్కువ మోతాదులో మందులు ఇస్తున్నామని తెలిపిన వైద్యులు.. ట్రీట్ మెంట్ కంటే అబ్జర్వేషన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
అటు అదే హాస్పిటల్ లో చికిత్స పొందుకున్న అభిషేక్ బచ్చన్ కు ఇంకా తక్కువ మోతాదులో చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన వైద్యులు.. అభిషేక్ కు జ్వరం కూడా లేదని స్పష్టంచేశారు. మరో 5 రోజుల పాటు వీళ్లిద్దర్నీ అబ్జర్వేషన్ లో ఉంచి, ఆ తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
అప్పటికీ పాజిటివ్ వస్తే చికిత్సకు సంబంధించి డోస్ పెంచుతామని.. నెగెటివ్ వస్తే అదే చికిత్సను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించారు.
మరోవైపు ఐశ్వర్యరాయ్ కు, కూతురు ఆరాధ్యకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో, హాస్పిటల్ చేరి వైరస్ సోకే రిస్క్ ను మరింత పెంచుకునే కంటే ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకోవడం ఉత్తమమని సూచించారు. దీంతో ఐశ్వర్య-ఆరాధ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.
బిగ్ బి ఫ్యామిలీలో వీళ్లకు మాత్రమే కరోనా సోకింది. జయాబచ్చన్, శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలకు టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. మరోవైపు ముంబయి మున్సిపల్ అధికారులు.. బిగ్ బికి చెందిన అన్ని ఇళ్లను పూర్తిగా శానిటైజ్ చేశారు.