తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు రూపొందుతూ ఉన్నాయి. ఇప్పటికే జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన వెబ్ సీరిస్ ఒకటి ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యింది. రమ్యకృష్ణ అందులో శక్తి అనే జయలలిత ను పోలిన పాత్రలో కొన్ని సీన్లలో కనిపించింది. దానికి తదుపరి సీజన్లు వస్తాయో రావో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమాలూ ఉన్నాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తూ ఉండగా ఒక సినిమా రూపొందుతూ ఉంది. కరోనా లాక్ డౌన్ పరిణామాలు లేకపోయి ఉంటే ఆ సినిమా ఈ పాటికే దాదాపు విడుదలకు రెడీ అయ్యేది. మరోవైపు రేసులో ఉంది నిత్యామేనన్. చాన్నాళ్ల కిందటే జయ పాత్రలో నిత్య కనిపిస్తున్న ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
ఆ సినిమా గురించి నిత్య స్పందించింది. జయలలిత జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు రూపొందుతున్నా, వాటితో తమకు పోటీ లేదని అంటోంది నిత్యామేనన్. కేవలం కంగనా రనౌత్ నటిస్తున్న సినిమానే గాక మరి కొన్ని సినిమాలు కూడా రూపొందుతూ ఉన్నాయని, వాటిలో వేటితోనూ తమకు పోటీ లేదని నిత్య స్పష్టం చేస్తోంది. తను నటిస్తున్న జయ బయోపిక్ దర్శకుడికి జయలలితతో పరిచయం ఉందని, ఆమె ఉన్న రోజుల్లో ఆమె ను దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తే తన సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని నిత్య అంటోంది. ఈ రకంగా తమ సినిమా ప్రత్యేకం అని నిత్య చెబుతోంది. కంగనాను కెళుక్కోవడం ఎందుకన్నట్టుగా.. ఆమె సినిమాతో తమకు పోటీ లేదని నిత్య తేల్చి చెప్పినట్టుగా ఉంది!