ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ రాశారు. ఏపీలో జిల్లాల పునర్వవస్థీకరణ జరగబోతోందనే ప్రచారం జరుగుతున్న బాలయ్య ఈ లేఖ రాశారు. ఒకవేళ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే, హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని లేఖలో జగన్ ను కోరారు బాలయ్య.
ప్రస్తుతం జిల్లా కేంద్రమైన అనంతపురంకు హిందుపురం 110 కిలోమీటర్ల దూరంలో ఉందని.. కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే, హిందూపూర్ కు తగిన న్యాయం చేయాలని లేఖలో బాలకృష్ణ కోరారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తే కలిగే సౌకర్యాలు, ప్రయోజనాల్ని తన లేఖలో వివరించారు బాలయ్య.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జోరుగా కసరత్తు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్ని 25 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లుండి (15వ తేదీ) జరగనున్న కేబినెట్ మీటింగ్ లో జిల్లాల పునర్వవస్థీకరణపై సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య, తన నియోజకవర్గానికి న్యాయం చేయమని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బాలయ్య విన్నపాన్ని జగన్ మన్నిస్తారా లేదా అనేది చూడాలి.
దీంతో పాటు జగన్ కు మరో లేఖను కూడా పంపించారు బాలయ్య. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరవ్వడంపై స్పందించిన బాలయ్య.. తన నియోజకవర్గంలోని మలుగూరు వద్ద కాలేజీ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సినంత భూమి మలుగూరులో ఉందని, ఆల్రెడీ రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేసిన విషయాన్ని బాలయ్య గుర్తుచేశారు.