జీవితంలో ఎప్పటికీ నటించనని ఓ బ్యూటీ స్పష్టంగా చెప్పింది. ఇంతకూ ఎందుకలా చెప్పింది? సమయం, సందర్భం ఏంటి? అనే విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే పూర్తి వివరాలు తెలుసుకుంటే ఆమె అభిమానులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం రాదు.
కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు సరికొత్త హీరోయిన్ ఓవియా పరిచయమైంది. ఈ బ్యూటీ మలయాళి కుట్టి. సినిమాల్లో కంటే బిగ్‌బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందింది. రియాల్టీ షో పుణ్యమా అని సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. ప్రస్తుతానికి మాత్రం చేతిలో సినిమాలేవీ లేవు.
అయితే అభిమానులను మాత్రం నిరుత్సాహ పరచకూడదనే తలంపుతో సోషల్ మీడియాలో అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తన అందచందాలతో హల్‌చల్ చేస్తుంటారామె. ట్విటర్‌లో ఆమె ముచ్చట్లకు తక్కువేం కాదు. అడిగే వారికి చెప్పే వారు లోకువనే సామెత చందాన… ఏం అడిగినా స్పందించే ఓవియా అంటే నెటిజన్లు, అభిమానులకు ఆమె అంటే లోకువో లేక ఇష్టమో చెప్పలేని స్థితి.
ట్విటర్‌లో అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలు సాగిన విధానం చూస్తే…ఉద్యోగానికి వెళ్లిన నిరుద్యోగి ఇంటర్వ్యూ తలపించేలా ఉంది. ఓవియా చెప్పిన ఆసక్తికర సమాధానాలేంటంటే…
సహజంగా మొదటి ప్రశ్న ప్రస్తుతం మీరే సినిమాల్లో నటిస్తున్నారని అడిగారు. తాను రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నేరుగా ఆమె ప్రేమ సంగతులపై ఆరా తీశారు. ఇంతకూ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించగా తాను ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నట్టు తేల్చి చెప్పారు. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు ఇప్పట్లో అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు.
కరోనా కష్టాలపై ఆమె చాలా పరిణితితో కూడిన జ్ఞానంతో స్పందించడాన్ని చూడొచ్చు. కష్టాలెప్పుడైనా మన అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుందన్నారు. అయితే ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమలు పెట్టుకోవద్దని సూచించారు. ఎప్పుడైనా ఎవరి కష్టాలను వాళ్లే పరిష్కరించుకోవాలని కోరారు.
ప్రస్తుతం జరుగుతున్న నేర ఘటనలపై ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు …నిజమైన నేరస్తులను శిక్షించే అధికారం తనకు లేదన్నారు. తన చేతిలో శిక్షించే అధికారం ఉందని మాయ మాటలు చెప్పలేనన్నారు. అలా జీవితంలో తాను ఎప్పటికీ నటించనని ఆమె స్పష్టం చేశారు. తన నటన కేవలం సినిమాల వరకే పరిమితం అని తేల్చి చెప్పారు.